ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించాలి

ABN , First Publish Date - 2022-06-19T06:25:00+05:30 IST

యువత ఆత్మ విశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి అన్నారు.

ఆత్మవిశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించాలి
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి

- రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి

కరీంనగర్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): యువత ఆత్మ విశ్వాసంతో చదివి ఉద్యోగం సాధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి పార్థసారధి అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1, ఎస్‌ఐ, తదితర పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ప్రణాళికాబద్ధంగా చదివితే ఉద్యోగాన్ని సాధించవచ్చని తెలిపారు. కలలు కనడంతోపాటు వాటిని సాకారం చేసుకోవాలని, అందుకు సరైన సమయ పాలన పాటిస్తూ సిలబస్‌కు అనుగుణంగా ప్రిపేర్‌ కావాలని సూచించారు. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవాలని, పరీక్షల్లో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమేనని, ఏకాగ్రతతో, స్థిరత్వంతో, విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ ప్రిపేర్‌ కావాలని అన్నారు. తాను కూడా గ్రామీణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని, విద్యార్థులు ఆత్మన్యూనత భావానికి లోనుకాకుండా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకంతో ప్రిపరేషన్‌ కొనసాగించాలని సూచించారు. కష్టపడి చదివే  వారే విజేతలు అవుతారని అన్నారు. నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకుంటూ ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని తెలిపారు. చిన్న చిన్న అవరోధాలను అపజయాలను చూసి కుంగిపోకూడదని, వాటిని విజయానికి మెట్లుగా వాడుకోవాలని హితవు పలికారు. నిలకడ, ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేధించాలని కమిషనర్‌ సూచించారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో వారధి సొసైటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్టడీ సర్కిల్స్‌ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం తయారు చేసిన వారధి యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ మీ విజయం మీ చేతుల్లోనే ఉందని, అనవసర అపోహలు, పుకార్లు నమ్మకుండా చదవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో ప్రియాంక, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌, వారధి సొసైటీ బాధ్యుడు ఆంజనేయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారులు నతానియేల్‌, గంగారాం, రాజ మనోహర్‌, మధుసూదన్‌, స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-19T06:25:00+05:30 IST