Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్యోన్య బంధం.. అంతలోనే అంతం.. అసలు కారణం Phone సంభాషణేనా..అందులో ఏముంది..!?

ఆ భర్త ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే.. భార్య నవ్వుతూ ఎదురు రావలసిందే. ఆమెకూ అంతే..ఏ చిన్న విషయమైనా భర్తతో పంచుకోవాల్సిందే. వివాహ బంధంలో అడుగు పెట్టి నాలుగు నెలలే అయినా.. అన్యోన్యమైన జంటగా ఇరుగుపొరుగు వద్ద పేరు తెచ్చుకున్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం విధులకు బయలుదేరిన భర్తకు భార్య నవ్వుతూ ఎదురొచ్చింది. అంతలోనే ఏమైందో అర్ధాంతరంగా ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆ వార్త విన్న భర్త కూడా అదే బాట పట్టాడు. ఇదీ కొత్తవలస పంచాయతీ చీపురువలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు కర్రిరాము, వెంకట హేమదుర్గల విషాదాంతం.


కొత్తవలస,  అక్టోబరు 30 : కొత్తవలస పంచాయతీ చీపురువలస గ్రామంలో శనివారం నవ దంపతులు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య ఫ్యానకు ఉరేసుకోగా.. ఇది తెలిసి భర్త మామిడిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఫోన్‌ సంభాషణే ఈ దారుణానికి కారణం కావొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన వెంకట హేమదుర్గ(23)కు, చీపురువలస గ్రామానికి చెందిన కర్రి రాము(25)తో ఈ ఏడాది జూలై ఒకటో తేదీన వివాహమైంది. భార్యాభర్తలు ప్రస్తుతం చీపురువలసలోనే నివాసం ఉంటున్నారు.


ఒకే ఇంట్లో మొదటి అంతస్తులో ఈ దంపతులు... కింది భాగంలో రాము తండ్రి అప్పారావు, చెల్లెలు కనకమహాలక్ష్మి నివాసం ఉంటున్నారు. రాము తల్లి గతంలోనే మృతి చెందారు. రాము ఎక్సకవేటర్‌కు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం విధులకు బయలుదేరే ముందు భార్య హేమ భర్తకు ఎదురు కూడా వచ్చింది.


భర్త వెళ్లిన కొద్ది గంటల్లోనే ఆమె ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. రాము బయటకు వెళ్లిన కొద్ది సేపటికే భార్యకు ఫోన చేశాడని తెలిసింది. వారి మధ్య ఫోన సంభాషణ అనంతరం ఆమె ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండొచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేడపైకి వెళ్లిన వదిన ఎంతకూ కిందికి రాకపోవడంతో రాము చెల్లెలు కనకమహాలక్ష్మి లోపలికి వెళ్లి చూసింది. ఉరేసుకుని ఉండడాన్ని గమనించి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి కిందికి దించారు. కొన ఊపిరితో ఉన్న హేమను ఆసుపత్రికి తరలించేందుకు  ప్రయత్నిస్తుండగా.. కన్నుమూసింది. భార్య మృతి చెందిన విషయాన్ని రాముకు ఫోన్‌ ద్వారా స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన చీపురువలస గ్రామానికి వెళ్లే దారి మధ్యలో ఉన్న మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంపతుల మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణే ఆత్మహత్యకు కారణమై ఉంటుందని భావిస్తున్నారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారని...వారి మధ్య ఎటువంటి విబేధాలు లేవని గ్రామస్థులు తెలిపారు. కొత్తవలస పోలీసులకు అందిన సమాచారం మేరకు తహసీల్దార్‌ ఎస్‌.రమణారావు సమక్షంలో సీఐ ఎస్‌.బాలసూర్యారావు శవపంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను శృంగవరపుకోట ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాల సూర్యారావు తెలిపారు. 


Advertisement
Advertisement