Abn logo
Apr 17 2021 @ 00:29AM

మే నుంచి నాడు- నేడు రెండో దశ ప్రారంభం

కనిగిరి, ఏప్రిల్‌ 16: పాఠశాలలో మే నుంచి ‘నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు పాఠశాల విద్య ఆర్‌జేడీ కే.రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. కనిగిరిలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.  నాడు-నేడు మొదటి దశ పనులను ఈ నెలాఖరుకు సీఎం చేతులమీదుగా ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాలో మొదటి దశలో 1324 పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. అన్ని రకాల వసతులు, మౌలిక సదుపాయాల కల్పన పూర్తయ్యిందన్నారు. తల్లిదండ్రుల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల సంయుక్త కృషి వలన మొదటి దశ నాడు -నేడు పనులు విజయవంతం అయ్యిందన్నారు. రెండవ దశలో అభివృద్ధి చేయాల్సిన పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. మూడవ దశలో 100 శాతం పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తవుతాయన్నారు. నాడు-నేడు, గోరుముద్ద, విద్యా కానుక, ఆంగ్ల మాధ్యమం వలన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని ఆర్‌జేడీ పేర్కొన్నారు. 

పలు పాఠశాలల పరిశీలన

శుక్రవారం కనిగిరి మండలంలోని పలు పాఠశాలలను ఆర్‌జేడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని కేవీపల్లి, వెలిగండ్ల మండలం మొగళ్లూరు, సీఎస్‌.పురం, ఆర్‌కేపల్లి, పామూరు దూబగుంట, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి నాడు-నేడు పనులను పరిశీలించారు. ఆర్‌జేడీ వెంట హెచ్‌ఎం రాజాల కొండారెడ్డి, ఎంఈవో దాసు ప్రసాద్‌లు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement