చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం నరసాపురం

ABN , First Publish Date - 2021-03-03T05:44:33+05:30 IST

వశిష్ఠ గోదావరి తీరాన నరసాపురం పట్టణం చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది.

చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం నరసాపురం

నరసాపురం, మార్చి 2: వశిష్ఠ గోదావరి తీరాన నరసాపురం పట్టణం చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోంది. అధ్యాత్మిక ప్రసిద్ధి గాంచిన అలయాలు, చర్చిలు, మసీదులు పట్టణంలో కొలు వయ్యాయి. బ్రిటిష్‌, డ్రచ్‌, పోర్చుగీస్‌ దేశస్థులు ఇక్కడి నుంచి వ్యాపారాలు నిర్వహించే వారు. దానికి గుర్తుగా నాటి కట్టడాలు నేటికి పట్టణంలో చెక్కు చెదరలేదు. ఎగుమతులకు కేంద్రంగా ఉన్న రేవు వలంధర్‌ రేవుగా పేరుగాంచింది. దశాబ్దాలు గడిచినా నేటికి స్టీమర్‌ రోడ్‌గానే పిలుస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఆదికేశవ ఎంబర్‌మన్నార్‌ ఆలయం పట్టణంలో కొలువైంది. 150ఏళ్లు చరిత్ర కలిగిన లూథరన్‌ చర్చి, పాతబజార్‌ లో వందేళ్ల నాటి మసీదులు ప్రార్థన మందిరాలుగా కొనసాగుతున్నాయి.


మున్సిపాల్టీకి అర్ధ శతాబ్దం

బ్రిటిష్‌ హయాం నుంచి నరసాపురం పట్టణం డివిజన్‌ కేంద్రంగా కొనసా గుతోంది. సబ్‌ కలెక్టర్‌, డీఎస్పీ కార్యాలయాలతో పాటు అనేక శాఖల సబ్‌ డివిజన్‌ కేంద్రాలు పట్టణంలోనే ఉన్నాయి. 1968లో పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మారింది. ఆ తరువాత మున్సిపాల్టీగా అక్కడి నుంచి గ్రేడ్‌ 1 పురపాలక సంఘంగా స్థాయి పెరిగింది.


31 వార్డులు..

పట్టణ పరిధి 12 కిలోమీటర్లు విస్తరించింది. 31వార్డులు ఉన్నాయి. 60 వేల జనాభా కలిగిన పట్టణంలో సుమారు 48 వేల మంది ఓటర్లు ఉన్నారు. 18 వేల నివాసాలున్నాయి. ఏటా పురపాలక సంఘానికి ఆస్తి పన్ను రూపంలో సుమారు రూ.4 కోట్లు ఆదాయం లభిస్తుంది.


11 మంది చైర్మన్‌లు

ఇప్పటివరకు పురపాలక సంఘానికి 11 ఎన్నికలు జరిగాయి. మొదటి చైర్మన్‌గా యర్రమిల్లి నారాయణమూర్తి, తరువాత ఓసూరి గంగాధర్‌, పొన్నపల్లి సుబ్రహ్మణ్యం, కురిశెటి కృష్ణమూర్తి, చెరుకూరి లక్ష్మణ రావు, మండా సత్యనారాయణమూర్తి, జక్కం అమ్మాణీ, బొంతు పద్మజ, కొప్పర్తి వేణుగోపాలరావు, కోటిపల్లి పద్మ, పసుపులేటి రత్నమాల వ్యవహరించారు.


బీసీ మహిళకు రిజర్వ్‌ 

ఈసారి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వు అయింది. వార్డుల వారీగా ఎస్టీ 1, ఎస్సీ 4, బీసీ 10, జనరల్‌కు 16 కేటాయించారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో మూడుసార్లు మహిళలే చైర్మన్‌లుగా వ్యవహరించారు. 2000లో బీజేపీ ఆభ్యర్ధిగా గెలుపొందిన కొప్పర్తి వేణుగోపాలరావు చైర్మన్‌ అయ్యారు.

Updated Date - 2021-03-03T05:44:33+05:30 IST