‘లవ్‌ జిహాద్‌’ పేరిట మత చిచ్చు

ABN , First Publish Date - 2021-01-18T07:15:20+05:30 IST

: ‘లవ్‌ జిహాద్‌’ పేరిట హిందూ-ముస్లింల మధ్య విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాలీవుడ్‌ విలక్షణ నటుడు నసీరుద్దీన్‌ షా (70) ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘లవ్‌ జిహాద్‌’ పేరిట మత చిచ్చు

ఆ సాకుతో హిందూ-ముస్లిం మధ్య విభజన : నసీరుద్దీన్‌ షా  


ముంబై, జనవరి 17: ‘లవ్‌ జిహాద్‌’ పేరిట హిందూ-ముస్లింల మధ్య విభజనకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బాలీవుడ్‌ విలక్షణ నటుడు నసీరుద్దీన్‌ షా (70) ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్‌ జిహాద్‌ పదం సృష్టికర్తలకు ‘జిహాద్‌’ అనే పదానికి అర్థం తెలిసి ఉండకపోవచ్చని అన్నారు. ‘‘లవ్‌ జిహాద్‌ అంటూ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న తమాషా ధోరణులు కోపం తెప్పిస్తున్నాయి. ముస్లింలు హిందూ జనాభాను అధిగమిస్తారనేంత మూర్ఖత్వంలో ఎవరూ లేరు. ఇది ఊహాతీతం’’ అని యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నసీరుద్దీన్‌ షా వ్యాఖ్యానించారు. ‘‘మతాంతర వివాహాలకు కళంకం ఆపాదించే ఉద్దేశంలో, రెండు మతాల మఽధ్య దూరం పెంచే ఆలోచనలో లవ్‌ జిహాద్‌ పదం పుట్టింది. విద్వేషాలు సృష్టిస్తున్నవారు.. హిందూ-ముస్లిం ఐక్యతనూ దెబ్బతీస్తున్నారు’’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని మతాంతర వివాహం కలకలం సృష్టిస్తోంది. బికనేర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి, 22 ఏళ్ల యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. గత నెల 10న వీరు పెళ్లి చేసుకున్నారు. ఇది ఏమాత్రం ఇష్టం లేని యువతి కుటుంబ సభ్యులు.. ‘లవ్‌ జిహాద్‌’గా పేర్కొంటూ సోషల్‌ మీడియాలో ప్రకటన విడుదల చేశారు. అయితే, యువతి మాత్రం ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నట్లు పోలీసులకు స్పష్టం చేసింది. ఆమె భర్తనే హిందూ మతం స్వీకరించినట్లు పేర్కొంది. పోలీసులు సైతం యువతీయువకుడు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని ప్రకటించారు. కాగా.. ఇవి లవ్‌ జిహాద్‌ కిందకు వస్తాయని, దీనిపై లోతైన విచారణ జరపాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌ చౌధరి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-18T07:15:20+05:30 IST