ఉక్రెయిన్‌కు ఆయుధాలొచ్చాయ్.. ఇక భీకర పోరే..!

ABN , First Publish Date - 2022-02-27T10:51:13+05:30 IST

ఉక్రెయిన్‌కు ఆయుధాలొచ్చాయ్.. ఇక భీకర పోరే..!

ఉక్రెయిన్‌కు ఆయుధాలొచ్చాయ్.. ఇక భీకర పోరే..!

ఉక్రెయిన్‌ ప్రతిఘటన! 

అమెరికా, జర్మనీ ఆయుధాలివ్వడంతో ఇక భీకర పోరు

రాజకీయ మద్దతు ఇవ్వండి

రష్యా దాడిని అడ్డుకోండి

ప్రధాని మోదీని కోరిన  ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ

ప్రాణ, ఆస్తి నష్టంపై నరేంద్ర మోదీ ఆవేదన

యుద్ధం ఉద్ధృతం చేయాలని రష్యా నిర్ణయం

క్షిపణులు, వైమానిక దాడులతో నగరాల విధ్వంసం

భూతల దాడుల్లో ముందుకు సాగని రష్యా ట్యాంకులు

తీవ్రంగా ప్రతిఘటిస్తున్న ఉక్రెయిన్‌ బలగాలు, పౌరులు

3500 మంది రష్యా సైనికుల్ని చంపామని ప్రకటన

సంప్రదింపుల తలుపులు తెరిచే ఉంచిన ఇరుపక్షాలు

దేశం విడిచి వెళ్లేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడి తిరస్కృతి

అణు ఒప్పందం నుంచి వైదొలగుతాం.. రష్యా హెచ్చరిక

పశ్చిమ దేశాలతో సంబంధాలు అక్కర్లేదని స్పష్టీకరణ

రష్యా టీవీ సర్వర్ల పనిబట్టిన పశ్చిమ దేశాల హ్యాకర్లు

ప్రధాన చానెళ్లలో ఉక్రెయిన్‌ జాతీయ గీతం ప్రసారం

రష్యాలో ట్విటర్‌ బంద్‌... ఫేస్‌బుక్‌కు అదేగతి?


కీవ్‌, ఫిబ్రవరి 26: ఉక్రెయిన్‌, రష్యాల యుద్ధం ఉగ్రరూపం దాల్చే వాతావరణం కనిపిస్తోంది. ఆదివారం నుంచి ఉక్రెయిన్‌ మీద దాడులను బహుముఖంగా ఉద్ధృతం చేయాలని రష్యా నిర్ణయించింది. మొదటి రెండు రోజుల యుద్ధంలో వైమానిక స్థావరాలను ధ్వంసం చేసి, నగరాలపై గగనతల దాడులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పాదాక్రాంతం అవుతుందని రష్యా అంచనా వేసింది. అందుకే, శనివారం మూడో రోజు దాడుల తీవ్రతను తగ్గించింది. రష్యా అంచనాలకు విరుద్ధంగా ఉక్రెయిన్‌ చావో రేవో అన్నట్లుగా పోరాటానికి సిద్ధం కావడం, అధ్యక్షుడు స్వయంగా తాను ఎక్కడికీ పారిపోకుండా ప్రజల మధ్యే ఉండి యుద్ధానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించడంతో ఇప్పట్లో చర్చలకు దిగొచ్చే వాతావరణం లేదని గ్రహించింది. అందుకే, యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు ఆదివారం నుంచి ముప్పేట దాడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈలోగా ఉక్రెయిన్‌కు అమెరికా, జర్మనీ, ఇతర యూరప్‌ దేశాల నుంచి ఆయుధ సహకారం అందడంతో రష్యా దాడులను గట్టిగా తిప్పికొట్టేందుకు దాయాది దేశం సిద్ధమవుతోంది. దాంతో ఉక్రెయిన్‌ యుద్ధం సిరియా, ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌యుద్ధాల తరహాలో సుదీర్ఘంగా సాగుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే, శనివారం కూడా ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. చర్చల సమయం, స్థలం మీద సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌కు అండగా అమెరికా శనివారం 60 కోట్ల డాలర్ల(4,500 కోట్ల రూపాయలు) సైనిక సాయాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వు మీద అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేశారు.. తక్షణమే 35 కోట్ల డాలర్లు విడుదల చేశారు. ఉక్రెయిన్‌కు యాంటీ ట్యాంక్‌ మిసైల్‌ జావలెన్‌ శ్రేణిని సమకూరుస్తామని అమెరికా ప్రకటించింది. నెదర్లాండ్‌ భుజాల మీద పెట్టుకొని విమానాలను కూల్చే స్టింజర్‌ క్షిపణులను ఉక్రెయిన్‌కు సమకూర్చింది. జర్మనీ 1000 యాంటీ ట్యాంకు రాకెట్లను, 500 స్టింజర్‌ క్షిపణులను పంపించాలని నిర్ణయించింది. నిజానికి సంక్షోభ ప్రాంతాలకు ఆయుధాలను ఎగుమతి చేయకూడదని జర్మనీ విధాన నిర్ణయం తీసుకుంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఉక్రెయిన్‌కు సాయం చేస్తోంది.


అణు ఒప్పందం నుంచి వైదొలగుతాం

పశ్చిమ దేశాలు ఆంక్షల పిడికిలిని బిగించడంతో రష్యా కూడా అంతే దూకుడుగా స్పందించింది. అమెరికాతో అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందం నుంచి వైదొలగుతామని హెచ్చరించింది. పశ్చిమ దేశాలతో దౌత్య సంబంధాలు తెంచుకుంటామని, ఆయా దేశాలకు తమ దేశంలో ఉన్న ఆస్తులను స్తంభింపజేస్తామని ప్రకటించింది. రష్యా మాజీ అధ్యక్షుడు, అంతర్గత భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్‌ ఏకంగా పశ్చిమ దేశాలతో సంబంధాలు తమకు అవసరం లేదని, అక్కడ దౌత్య కార్యాలయాలు అన్నింటికీ తాళం వేస్తామని వ్యాఖ్యానించారు. యూరప్‌ మానవ హక్కుల వేదిక యూరోపియన్‌ కౌన్సిల్‌ నుంచి రష్యాను గెంటేసిన నేపథ్యంలో నేరగాళ్లకు మరణశిక్ష విధించే స్వేచ్ఛ తమకు లభించిందన్నారు. పశ్చిమ దేశాల ఆంక్షలతో రష్యా ముఖ్యంగా ఐటీ దిగుమతుల చెల్లింపుల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు ఉపయోగించే స్విఫ్ట్‌ బ్యాంకింగ్‌ నుంచి కూడా రష్యాను వెళ్లగొట్టే దిశగా పావులు కదుపుతుండటంతో రష్యా తీవ్రంగా స్పందించింది. అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం నుంచి రష్యా వైదొలిగితే అమెరికా, రష్యాలు ఎన్ని అణుబాంబులైనా తయారు చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచంలో మళ్లీ అణ్వాయుధ రేసు మొదలవుతుందని ఆందోళన చెందుతున్నారు.


తీవ్ర ప్రతిఘటన

రష్యా సైన్యం అక్కడక్కడా నగరాల్లోకి చొచ్చుకురావడంతో వీధి పోరాటాలు మొదలయ్యాయి. ‘‘యుద్ధంలో ఇప్పటిదాకా ఉక్రెయిన్‌ పౌరులు 200 మంది మరణించారు. వెయ్యి మంది గాయపడ్డారు’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నల్ల సముద్రంలో రష్యాకు చెందిన సుఖోయ్‌ 30 విమానాన్ని కూల్చేసినట్లు ప్రకటించుకుంది. రాజధానికి దక్షిణాన 40 కిలోమీటర్ల దూరంలో పారా టూపర్లతో వస్తున్న రష్యా విమానాన్ని పేల్చేశామని ప్రకటించింది. 3500 మంది రష్యా సైనికులు మరణించారని, 22 విమానాలు కూల్చేశామని, వంద ట్యాంకులు పేల్చేశామని, 200 మంది రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్‌ ప్రకటించింది. రష్యా సైన్యం గగనతలం నుంచి బలగాలను పారాట్రూపింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి ప్రకటించారు. దక్షిణాది నగరం మెలిటోపాల్‌ పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చిందని, 800 సైనిక స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. అర్థరాత్రి రాజధాని కీవ్‌లోకి అడుగు పెట్టేందుకు రష్యా వ్యూహరచన చేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తెలిపారు. 


వీరమరణం

స్నేక్‌ ఐలండ్‌ ఘటన తర్వాత ఉక్రెయిన్‌ సైనికుల్లో స్ఫూర్తి నింపే మరో వీరమరణం వెలుగులోకి వచ్చింది. విటలే స్కాకున్‌ అనే సైనికుడు క్రిమియా నుంచి ఉక్రెయిన్‌ వైపు దూసుకువస్తున్న రష్యా యుద్ధ ట్యాంకులను ఆపేందుకు మందుపాతరలు అమర్చిన వంతెనపై తనను తాను పేల్చేసుకున్నాడు. వంతెన ధ్వంసం కావడంతో ట్యాంకులు ముందుకు వెళ్లలేక పోయాయి. రిమోట్‌తో పేల్చేందుకు ఏర్పాటు చేయడానికి తగినంత సమయం లేకపోవడంతో తన ప్రాణత్యాగం చేశాడు. బాక్సింగ్‌ మాజీ ప్రపంచ చాంపియన్‌ వ్లాదిమిర్‌ క్లిట్స్‌కో కూడా మాతృదేశ రక్షణకు ఆయుధాలు పట్టారు. రష్యాపై పోరాటం చేస్తున్నారు. కీవ్‌ నగర మేయర్‌ సోదరుడైన క్లిట్స్‌కో అన్నతో కలిసి యుద్ధ రంగానికి వెళ్లారు. 


రష్యా వెబ్‌సైట్లు హ్యాక్‌ 

రష్యా వెబ్‌సైట్ల మీద పశ్చిమదేశాల హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఏకంగా అధ్యక్ష సౌధం క్రెమ్లిన్‌ వెబ్‌సైట్‌ను పని చేయకుండా చేశారు. రష్యా మీడియాను నియంత్రించే ప్రభుత్వ విభాగం వెబ్‌సైట్‌నూ హ్యాక్‌ చేశారు. టీవీ చానెళ్ల సర్వర్లలో చొరబడి ఉక్రెయిన్‌ జాతీయ గీతం ప్రసారం అయ్యే విధంగా చేశారు. రష్యాకు ఉపయోగపడే విధంగా ఏ మాత్రం వ్యవహరించడానికి వీల్లేదని ఫేస్‌బుక్‌, ట్విటర్‌కు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. రష్యా ప్రధాన మీడియా సంస్థలు సోషల్‌ మీడియాలో తప్పుడు వార్తలు పోస్టు చేసినపుడల్లా ఫేస్‌బుక్‌, ట్విటర్‌లు వాటిని బ్లాక్‌ చేయడమో, తప్పుడు వార్తలని చెప్పడమో చేశాయి. ఆగ్రహించిన రష్యా ప్రభుత్వం ట్విటర్‌ను స్తంభింపజేసింది. ఫేస్‌బుక్‌కు కూడా హెచ్చరికలు పంపింది. ఉక్రెయిన్‌కు అనుకూల వార్తలు రాస్తున్న మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చింది. సదరు వార్తలను తొలగించాలని ఆదేశించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లు రష్యా ప్రభుత్వ మీడియా వార్తల పెయిడ్‌ ప్రమోషన్‌ను నిషేధించాయి. 


భారీగా వలసలు

ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న రుమేనియా, హంగరీలకు భారీ ఎత్తున ప్రజలు వలస పోతున్నారు. లక్షన్నర మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మాస్కోలో ఉన్న ఉక్రెయిన్‌ రాయబార సిబ్బంది మొత్తం పొరుగున ఉన్న లాత్వియాకు వెళ్లిపోయారు. పుతిన్‌, విదేశాంగ మంత్రి సర్గే లవ్‌రోవ్‌లకు తమ దేశాల్లో ఉన్న ఆస్తులను స్తంభింపజేయాలని పశ్చిమ దేశాలు నిర్ణయించాయి. వాళ్లకు ఏ స్థాయిలో ఆస్తులు ఉన్నాయో మాత్రం చెప్పలేదు. రష్యాతో వరల్డ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడబోమని పోలండ్‌, స్వీడన్‌ ప్రకటించాయి. రష్యాపై ఆంక్షలు విధించాలని కెనడా నిర్ణయించింది. 


చావైనా బతుకైనా ఇక్కడే

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తనను, తన కుటుంబాన్ని దేశం వెలుపలికి తరలించేందుకు అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించారు. చావైనా బతుకైనా ఇక్కడేనని, దేశ ప్రజలను విడిచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. తనకు కావాల్సింది పారిపోయే వాహనం కాదని, దేశాన్ని కాపాడుకొనేందుకు మందుగుండని చెప్పారు. జెలెన్‌స్కీ కుటుంబానికి రష్యాతో ప్రాణహాని ఉందని అమెరికా గత కొద్ది నెలలుగా చెబుతున్నా ఆయన కొట్టిపడేశారు. ఇటీవల పొరుగుదేశ పర్యటనకు వెళుతున్నపుడు కూడా ప్రభుత్వం పడగొట్టే కుట్ర జరగొచ్చని అమెరికా హెచ్చరించింది. ఆయన లెక్క చేయలేదు. తాజాగా దేశం విడిచి వెళ్లాడని ప్రచారం జరగడంతో తాను దేశంలోనే ఉన్నానని నిరూపించుకొనేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ నేను ఇక్కడే ఉన్నాను చూడండి అంటూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేశారు. ఈ ఒక్కరాత్రి గట్టిగా నిలబడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2022-02-27T10:51:13+05:30 IST