చలిలో ప్రాణాలు అరచేత పట్టుకుని..

ABN , First Publish Date - 2022-02-27T11:06:11+05:30 IST

చలిలో ప్రాణాలు అరచేత పట్టుకుని..

చలిలో ప్రాణాలు అరచేత పట్టుకుని..

పిల్లలతో ఉక్రెయిన్‌ను వీడుతున్న స్త్రీలు

దేశం దాటొద్దంటూ పురుషులకు ఆజ్ఞలు


ప్రజెంసిల్‌ (పోలండ్‌), ఫిబ్రవరి 26: ఒంటరిగా.. ఉగ్గుపాలు తాగే పసి బిడ్డలతో.. ఆరేడు డిగ్రీల చలిలో.. పుట్టి పెరిగిన ఊరు, ఇన్నాళ్లూ తలదాచుకున్న గూడును వీడి.. దేశం దాటుతున్నారు వేలాదిమంది ఉక్రెయిన్‌ మహిళలు. వారికి తెలిసిందొక్కటే..! ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలి. రష్యా పూర్తిగా ఆక్రమిస్తే.. వారి దాడులను తట్టుకోలేమని భావించి పిల్లాజెల్లాతో వేలాదిమంది ఇలా సరిహద్దులు దాటుతున్నారు. వీరిలో అత్యధికులు మహిళలు, వృద్ధులే. సైన్యంలో చేరే వయసు ఉన్న పురుషులెవరూ దేశం వీడొద్దంటూ ఇప్పటికే నిషేధాజ్ఞలు ఉండటంతో వారిని కనీసం రైల్వే స్టేషన్లకూ రానివ్వడం లేదు. ఎవరైనా ప్రయత్నించినా.. రైళ్ల నుంచి బలవంతంగా దింపేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో మహిళలు మాత్రమే చిన్నారులతో కలిసి పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నారు. 48 గంటల వ్యవధిలో 50 వేలమందిపైగా ఉక్రెయిన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి(యూఎన్‌) ప్రకటించింది. యుద్ధం మొదలైన దగ్గరనుంచి 1.20 లక్షల మంది వలస వెళ్లినట్లు పేర్కొంది. పోలండ్‌కు చెందిన మెడికా సరిహద్దు వద్ద 15 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయని పేర్కొంది. కొందరు ఉక్రెనియన్లు.. మాల్దోవా, హంగరీ దేశాలకు చేరినట్లు తెలిపింది. ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే 40 లక్షలమంది యూరప్‌ దేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.


నిబంధనలను సడలిస్తూ.. ఉదారత

ఉక్రెయిన్‌ నుంచి వస్తున్నవారికి ఆశ్రయం ఇస్తూ, ఆహారం అందజేస్తూ పోలండ్‌, స్లొవేకియా, హంగరీ, రొమేనియా, మాల్దోవా సహృదయత చాటుతున్నాయి. కొవిడ్‌ టెస్టు వంటి నిబంధనలను సడలించి మరీ సరిహద్దులను తెరుస్తున్నాయి. వలస వెళ్తున్నవారిలో కొందరు పోలండ్‌లో స్థిరపడిన తమ బంధువులను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యుద్ధభయంతో ఉక్రెయిన్‌ను వీడుతున్న అందరినీ యూరోపియన్‌ సమాఖ్య (ఈయూ) దేశాలు ఆదుకుంటాయని జర్మనీ, ఇటలీ అభయమిచ్చాయి. హంగరీ అయితే.. ఉక్రెయిన్‌ నుంచి వస్తున్నవారు తమదగ్గర ఉండేందుకు ప్రత్యేక డిక్రీ జారీచేసింది. వారికి సహాయం చేసే బాధ్యతను సైన్యానికి అప్పగించింది. ఇదిలా ఉండగా.. దాదాపు రెండు రోజుల వాయుసేన దాడుల అనంతరం రాజధాని కీవ్‌లోకి వచ్చిన రష్యా దళాలను ఉక్రెయిన్‌ సైన్యం ప్రతిఘటిస్తోంది. దీంతో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అభ్యర్థించింది. శత్రు సైన్యం దాడులను కొంతమేరకు తప్పించుకున్నామని.. నగర శివారులో పోరు కొనసాగుతోందని ఉక్రెయిన్‌ అధికారులు వివరించారు.

Updated Date - 2022-02-27T11:06:11+05:30 IST