ఉక్రెయిన్‌ నుంచి ఉషస్సుకు!

ABN , First Publish Date - 2022-02-27T10:55:45+05:30 IST

ఉక్రెయిన్‌ నుంచి ఉషస్సుకు!

ఉక్రెయిన్‌ నుంచి ఉషస్సుకు!

స్వదేశంలో అడుగుపెట్టిన 269 మంది భారతీయులు

రొమేనియా నుంచి 2 ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీకి

స్వాగతం పలికిన కేంద్ర మంత్రులు గోయల్‌, మురళీధరన్‌ 

చివరి బాధితుడిని తరలించేదాకా మిషన్‌ కొనసాగుతుంది: కేంద్రం

ఉక్రెయిన్‌ నుంచి చేరుకున్న విద్యార్థులు ఉచితంగా హైదరాబాద్‌కు

కేసీఆర్‌ ఆదేశం.. విమాన టికెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: క్షిపణుల మోతతో నిప్పులు చిమ్ముతున్న ఆకాశం నుంచే ఆశాజ్యోతీ వెలిగింది. బాంబులు జారుతున్న గడ్డ పొలిమేరల్లోనే ‘మీరు ఇక సురక్షితం’ అన్న సందేశమిస్తున్నట్లుగా గాల్లోంచి రెండు విమానాలు వాలాయి. రష్యా దురాక్రమణతో ఎప్పుడేం జరుగుతుందోనని ఉక్రెయిన్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయ విద్యార్థులు ఆ విమానాల్లోకి ఎక్కి హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి రొమేనియా సరిహద్దుకు.. అక్కడి నుంచి ఆ దేశ రాజధాని బుకారె్‌స్టకు ప్రత్యేక బస్సుల ద్వారా చేరుకున్న విద్యార్థుల కోసం శనివారం ముంబై నుంచి, ఢిల్లీ నుంచి ఒక్కో ఎయిర్‌ ఇండియా విమానం వెళ్లాయి. ఈ రెండు విమానాల ద్వారా 469 మంది విద్యార్థులు స్వదేశంలో అడుగుపెట్టారు. తమవాళ్లు స్వదేశం చేరుకోవడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు ఊరట పొందారు. తమ మిషన్‌ ముగిసిపోలేదని.. ఉక్రెయిన్‌ నుంచి చివరి భారతీయుడిని సురక్షితంగా స్వదేశానికి తరలించేదాకా ఈ ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం సాగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. 


చీకట్లను చీల్చుకుంటూ బుకారెస్ట్‌ వైపు.. 

శనివారం రొమేనియాకు బయలుదేరిన రెండు విమానాల్లో తొలి విమానం ‘ఏఐ-1944’ ముంబై నుంచి తెల్లవారుజామున 3:38 గంటలకు రొమేనియా రాజధాని బుకారెస్ట్‌ వైపు గాల్లోకి లేచింది. అక్కడ ఉదయం 10:45 గంటలకు ల్యాండ్‌ అయింది. మధ్యాహ్నం 219 మందిని ఎక్కించుకొని ముంబైకి తిరుగు ప్రయాణమై రాత్రి 8గంటలకు ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. రెండో విమానం ‘ఏఐ-1942’ ఢిల్లీ నుంచి శనివారం ఉదయం 11:40 బయలుదేరి సాయంత్రం 6:30 గంటలకు బుకారె్‌స్టలో దిగింది. అక్కడి నుంచి 250 మందితో బయలుదేరి అర్ధరాత్రి 1:55 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అయింది. ్ఞముంబైలో దిగిన వారికి కేంద్రమంత్రి పీయుష్‌ గోయల్‌, ఢిల్లీలో దిగినవారికి మరో కేంద్రమంత్రి మురళీధరన్‌ స్వాగతం పలికారు. ఈ రెండు ప్రత్యేక విమానాలు బుకారెస్ట్‌ నుంచి బయలుదేరిన తర్వాత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఓ ప్రకటన చేశారు. ‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు నిర్విరామంగా ప్రయత్నిస్తున్నాం. ఈ తరలింపు ప్రక్రియను నేను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను’ అని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 22న ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో 240 మంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చారు. 


ఆ సాహసం చేయొద్దు 

ఉక్రెయిన్‌ నుంచి ఆ దేశ సరిహద్దు దేశాలకు చేరుకుంటే.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత ప్రభుత్వం తమను స్వదేశానికి తరలిస్తుందని బాధితుల్లో ఎవరైనా భావిస్తే? తమకు తాముగా నిర్ణయం తీసుకొని సరిహద్దుల్లోకి చేరుకుంటే? ఇలాంటి వారి కోసమే ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం శనివారం గట్టి సూచనను జారీ చేసింది. తమతో సంప్రదింపులు, సమన్వయం లేకుండా ఎవ్వరూ ఉక్రెయిన్‌ సరిహద్దుల వైపు బయలుదేరొద్దని స్పష్టం చేసింది. కాల్పులు, బాంబులు, మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌ దద్దరిల్లుతుండటంతో భారతీయుల భద్రత కోసమే ఈ సూచన చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయుల కోసం మరో సూచనా చేసింది. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని పేర్కొంది. కాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులంతా విదేశీ వ్యవహారాల శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాలని కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన ద్వారా సూచించిం ది.  


ఉచితంగా హైదరాబాద్‌కు..

హైదారబాద్‌: ఉక్రెయిన్‌ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను ఉచితంగా హైదరాబాద్‌ చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఆ వెంటనే ఆ దిశగా ఏర్పాట్లు జరిగాయి. బుకారెస్ట్‌ నుంచి ఒక విమానం ముంబైకి ఇప్పటికే చేరుకుందని, మరొకటి ఢిల్లీకి అర్ధరాత్రి తర్వాత (తెల్లవారితే ఆదివారం) చేరుకుంటుందని సోమేశ్‌ తెలిపారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఉచితంగా విమాన టికెట్లు అందించడానికి ఏర్పాట్లు చేశామని సీఎస్‌ వెల్లడించారు. విద్యార్థులు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారని చెప్పారు. 


‘అప్పుడు’ ఈ రోజును గుర్తుచేసుకోండి


బుకారె్‌స్టకు చేరిన ఎయిర్‌ ఇండియా తొలి విమానంలో 219 మంది ఎక్కిన తర్వాత వారిని ఉద్దేశించి రొమేనియాలో భారత రాయబారి రాహుల్‌ శ్రీవాస్తవ ఓ భావోద్వేగ సందేశాన్నిచ్చారు. అది నెటిజెన్లను విశేషంగా ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది. ‘మున్ముందు జీవితంలో మీకు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుకు సాగడం కష్టంగా అనిపిస్తుంది. అప్పుడు ఈ రోజును గుర్తుచేసుకోండి. అంతా సర్దుకుంటుంది’ అని విద్యార్థులను ఉద్దేశించి శ్రీవాస్తవ చెప్పారు. ‘స్వదేశంలో అడుగుపెట్టాక మీ వాళ్లతో ఆనందాన్ని పంచుకున్నాక ఓ విషయం మరిచిపోవొద్దు. ఉక్రెయిన్‌లో ఇంకా మీ స్నేహితులు ఎందరో ఉన్నారు. వారికి ఫోన్‌ చేయండి. ప్రతి ఒక్కరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేస్తోందని వారికి భరోసా ఇవ్వండి’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-27T10:55:45+05:30 IST