రష్యాపై ఆంక్షల ప్రభావమెంత?

ABN , First Publish Date - 2022-02-27T11:09:29+05:30 IST

రష్యాపై ఆంక్షల ప్రభావమెంత?

రష్యాపై ఆంక్షల ప్రభావమెంత?

దశాబ్దంగా ‘ఆత్మ నిర్భరత’లో ముందంజ

సహజ వాయువులు, ఖనిజ సంపద ఉంది

ఆహార ధాన్యాల ఉత్పత్తిలోనూ కీలక స్థానం


(సెంట్రల్‌డెస్క్‌)

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో.. ఆ దేశంపై ప్రపంచదేశాలు ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఆర్థికంగా దెబ్బతిస్తామని అమెరికా ప్రకటించింది. రష్యా బ్యాంకులను వెలివేస్తూ ‘స్విఫ్ట్‌’ సేవలను నిలిపివేస్తామని స్పష్టం చేసింది. బ్రిటన్‌, ఐరోపా సమాఖ్య కూడా తమ దేశాల్లోని రష్యా ఆస్తుల సీజ్‌, రష్యా బ్యాంకుల నిషేధం, వ్యాపార-వాణిజ్యాల నిలిపివేత వంటి ఆంక్షలు విధించాయి. జర్మనీ తన గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టును రద్దుచేసింది. ఇలాంటి ఆంక్షలన్నీ నిజంగానే రష్యాపై ప్రభావం చూపిస్తాయా? రష్యాను ఒంటరిని చేయగలుగుతాయా? అనే ప్రశ్నలకు ఏమాత్రం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆంక్షల వల్ల రష్యాకు నష్టమా? ఇతర దేశాలకు నష్టమా? అనే విషయాలను బేరీజు వేసుకున్నాకే.. పుతిన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. 1991 నాటి రష్యా కాదని, ఇప్పుడు ఆ దేశం శాసించే స్థాయికి ఎదిగిందని స్పష్టం చేస్తున్నారు. అప్పులు ఎక్కువగా ఉన్న దేశాలు ఆంక్షలను తట్టుకోవడం చాలా కష్టం. కానీ, రష్యా పరిస్థితి అందుకు భిన్నం. ఆ దేశ జీడీపీలో సుమారు 14ు మేర మాత్రమే అప్పులున్నాయి. మన దేశానికి 40ు, అమెరికాకు 120ు దాకా రుణాలున్నాయి. నిజానికి 1991లో సోవియట్‌ విచ్ఛిన్నమై ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొన్న రష్యా.. 21వ శతాబ్దంలో సూపర్‌పవర్‌ అవ్వడమే లక్ష్యంగా భారీ సంస్కరణలను తీసుకువచ్చింది. 2000 సంవత్సరం నుంచి వాటిని పక్కాగా అమలు చేస్తూ వచ్చింది. రాజకీయ స్థిరత్వం కూడా దానికి దోహదపడింది. క్రమంగా తనకున్న సహజవనరులను ఆదాయంగా మలచుకుంటూ జీడీపీని వృద్ధిలోకి తీసుకువచ్చింది. 2001లో వ్యక్తిగత పన్నును స్థిరీకరించి.. ప్రజలపై భారాన్ని తగ్గించింది. 2006లో అత్యధిక అప్పులను తీర్చేసింది. 1999లో 12 బిలియన్‌ డాలర్ల మేర చమురు ఎగుమతులు జరపగా.. 2008లో దాన్ని 597 బిలియన్‌ డాలర్లకు పెంచింది. ప్రస్తుతం అతిపెద్ద చమురు ఎగుమతిదార్లలో ఒకటిగా మారింది. 1999లో 12.4శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటును క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. 2014 నాటికి అది 5.4శాతానికి పడిపోయింది.  


ధాన్యం ఎగుమతి చేసే స్థితికి.. 

సోవియట్‌ విచ్ఛిన్నానికి ముందు నుంచి కూడా ఐక్య రష్యా ధాన్యం కోసం దిగుమతులపై ఆధారపడేది. 1999 దాకా ఇదే పరిస్థితి. కానీ, 2000 సంవత్సరం నుంచి రష్యా వ్యవసాయానికి పెద్దపీట వేసింది. 12.37 లక్షల చదరపు కిలోమీటర్ల నేలను సాగుకు అనుకూలంగా మార్చింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఆ దేశ వ్యవసాయరంగం ప్రపంచంలోనే నాలుగో స్థానానికి చేరుకుంది. ఒకప్పుడు ధాన్యం కోసం ఎదురుచూసిన రష్యా.. ఇప్పుడు అభివృద్ధిచెందుతున్న దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే స్థితికి చేరుకుంది. సహజ వాయువుల విషయంలోనూ రష్యా రారాజుగా కొనసాగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయువులున్న దేశంగా మారింది. ఆ దేశ ఎగుమతుల్లో 80ు వాటా చమురు, కలప, ఖనిజాలవే. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పల్లాడియంలో 45.6ు వాటా ఒక్క రష్యాదే..! అంతేకాదు.. ప్లాటినం(15.1శాతం), బంగారం(9.2 శాతం), చమురు(8.4 శాతం), గ్యాస్‌(6.2 శాతం), నికేల్‌(5.3 శాతం), అల్యూమినియం(4.2 శాతం), బొగ్గు(3.5 శాతం) ఉత్పత్తుల్లోనూ రష్యా కీలకంగా మారింది. రష్యా దాదాపు దశాబ్ద కాలంగా డాలర్‌ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ వచ్చింది. ఎగుమతులు, దిగుమతుల విషయంలో ఆయా దేశాల కరెన్సీని ఆమోదించుకోవడం ప్రారంభించింది. అందుకే.. ఆంక్షలు విధించినా రష్యాకు నష్టమేమీ ఉండదని, తమతో పెట్టుకునే దేశాలకే నష్టమనే ధీమాలో పుతిన్‌ ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆరు నెలలకు మించి ఆంక్షలు కొనసాగితే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 


అమెరికాకే నష్టం

ఏ రకంగా చూసినా.. రష్యాపై ఆంక్షల విధింపు అమెరికాకే నష్టం. డాలర్‌/స్విఫ్ట్‌ యాక్సె్‌సను రష్యాకు లేకుండా చేస్తే.. ఆ దేశం ఇతర కరెన్సీల్లో వర్తక-వాణిజ్యాలను కొనసాగిస్తుంది. అప్పుడు నష్టం ఎవరికి? అమెరికా డాలర్‌ వినియోగం తగ్గి.. బలహీనపడుతుంది. ఈ ఆంక్షల వల్ల చమురు ధరలు పెరుగుతాయి. దాని వల్ల రష్యాకే లాభం. అపార చమురు నిల్వలున్న ఆ దేశానికే ధరల పెరుగుదల లబ్ధి కలుగుతుంది. ధరలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే అమెరికా, ఐరోపా సమాఖ్య రష్యాపై చమురు ఎగుమతులు/దిగుమతులపై ఆంక్షలు పెట్టకపోవడం గమనార్హం. ఆంక్షలతో నష్టం ఎవరికంటే.. చమురు, ధాన్యాలు, బొగ్గు, ఖనిజాల కోసం రష్యాపై ఆధారపడి.. ఆ దేశానికి వ్యతిరేకంగా మారిన ఐరోపా దేశాలకే.

- ప్రొఫెసర్‌ పాపారావు, ఆర్థిక నిపుణుడు

Updated Date - 2022-02-27T11:09:29+05:30 IST