రెండేళ్లలో నేవీ ప్రత్యామ్నాయ స్థావరం

ABN , First Publish Date - 2021-12-03T05:30:00+05:30 IST

జిల్లాలోని రాంబిల్లి మండలంలో నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ఇంకో రెండేళ్లలో పూర్తవుతుందని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా తెలిపారు.

రెండేళ్లలో నేవీ ప్రత్యామ్నాయ స్థావరం

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి బిశ్వజిత్‌ దాస్‌గుప్తా

అరిహంత్‌ పనితీరును అగ్రరాజ్యాల వద్ద ఉన్న సబ్‌మెరైన్‌లో పోల్చడం సరికాదు

తుఫాన్‌ కారణంగా నేడు నేవీ ఆపరేషన్‌ డెమో రద్దు


విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రాంబిల్లి మండలంలో నిర్మిస్తున్న నేవీ ప్రత్యామ్నాయ స్థావరం ఇంకో రెండేళ్లలో పూర్తవుతుందని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా తెలిపారు. శనివారం (డిసెంబరు 4) నౌకా దళ దినోత్సవం నేపథ్యంలో ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. చాలాకాలంగా ప్రత్యామ్నాయ స్థావర నిర్మాణం జరుగుతున్నదని, అనేక అంశాలతో ముడిపడినది కావడంతో జాప్యం జరుగుతోందన్నారు. ఇటువైపు భూసేకరణ, పునరావాసంతో పాటు నేవీ వైపు నుంచి హార్బర్‌, జెట్టీల నిర్మాణం వంటివి కీలకమైనవని, చాలా జాగ్రత్తగా చేయాల్సి వుందని వివరించారు. విశాఖలోనే తయారైన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ ఆశించిన మేర లేదనే అంశాలపై మాట్లాడుతూ, అది దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన మొదటిదని, దాని పనితీరు అగ్రరాజ్యాల దగ్గర అందుబాటులో వున్న వాటితో పోల్చడం సరికాదన్నారు. ప్రొటోటైపుగా (నమూనా) చూడాలని, ఆ తరువాత వచ్చేవి మెరుగ్గా వుంటాయని పేర్కొన్నారు. యుద్ధనౌకల్లో ఉపయోగించే గ్యాస్‌ టర్బైన్లకు విశాఖలోని ఐఎన్‌ఎస్‌ ఏకశిల మరమ్మతులు చేసి, జీవితకాలం పెంచుతుందని, దానివల్ల అధిక ప్రయోజనం కలుగుతోందన్నారు. 


నేవీ డే ఆపరేషన్‌ డెమో రద్దు

నౌకాదళ దినోత్సవం సందర్భంగా బీచ్‌లో నిర్వహించే విన్యాసాలను ఈ ఏడాది తుఫాన్‌ కారణంగా రద్దు చేశామని వివరించారు. తీరంలో యుద్ధనౌకలను నిలిపి, వాటికి విద్యుద్దీపాలతో అలంకరించే సంప్రదాయం కూడా ఉందని, అయితే ప్రస్తుతం అవేవీ చేయడం లేదన్నారు. అయితే అమరవీరులకు నివాళులు అర్పించి, ఇన్‌హౌస్‌లో కొన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 


తుఫాన్‌ సాయానికి సన్నద్ధం

తూర్పు నౌకాదళం పరిధిలో ఎక్కడ విపత్తులు సంభవించినా సహాయ సహకారాలకు తాము ముందుంటామని, ఇప్పుడు తుఫాన్‌ జవాద్‌కు సాయం చేయడానికి బలగాలను సిద్ధం చేశామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయం కోసం 13 బృందాలను, నాలుగు డైవింగ్‌ బృందాలను సిద్ధం చేశామన్నారు. అందులో కొన్నింటిని ఒడిశాకు పంపించామని చెప్పారు. అదనంగా నాలుగు నౌకలు, ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి హెలికాప్టర్లు సాయానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 

Updated Date - 2021-12-03T05:30:00+05:30 IST