రూ.5 కోట్లతో అమ్మవారికి అలంకరణ.. చూసేందుకు తరలి వస్తున్న భక్తులు

ABN , First Publish Date - 2021-10-13T16:43:31+05:30 IST

శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో..

రూ.5 కోట్లతో అమ్మవారికి అలంకరణ.. చూసేందుకు తరలి వస్తున్న భక్తులు

నెల్లూరు: నెల్లూరులోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో కరెన్సీ నోట్లతో అలంకరణ చేశారు. శవనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రూ.కోటి కాదు.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.5కోట్ల విలువైన కరెన్సీ నోట్లను ఈ అలంకరణ కోసం వినియోగించారు. ఏడు కిలోల బంగారం, 60 కిలోల వెండి ఆభరణాలతో అమ్మవారికి ధనలక్ష్మి అలంకరణ చేశారు. దీంతో ఆలయమంతా కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది. ఈ అలంకరణ భక్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజులుగా కమిటీ సభ్యులు, కార్మికులు శ్రమించి ఈ అలంకరణ చేశారు. 


నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ ముక్క‌ల ద్వార‌కానాథ్ మీడియాతో మాట్లాడుతూ రూ. 2వేలు, రూ.500, రూ.200, రూ.100, రూ.5 నోట్లను ఇందుకు ఉపయోగించామన్నారు. అలంకరణ కోసం ఆలయ కమిటీ సభ్యులు నెల్లూరు నగరవాసులకు ఒక మెసేజ్ చేయగా.. భక్తులు రూ.5కోట్ల 16లక్షల విరాళాలు అందజేశారన్నారు. ఇంతపెద్దం మొత్తంతో అలంకరణ చేయడం దేశంలోనే ప్రథమమని ఆయన చెప్పారు. ఈ ఆలయాన్ని 130సంవత్సరాల క్రితం నిర్మించామని, నాలుగేళ్ల క్రిత‌ం రూ.11 కోట్ల వ్యయంతో పున‌ర్నిర్మించామన్నారు. అప్ప‌టి నుంచి ఏటా వైభ‌వంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-13T16:43:31+05:30 IST