26 తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం?

ABN , First Publish Date - 2021-07-18T08:26:53+05:30 IST

ఈ నెల 25న కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న 79 సంవత్సరాల యడియూరప్ప ఆ మరుసటి రోజే(జూలై 26) తన పదవికి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

26 తర్వాత కర్ణాటకకు కొత్త సీఎం?

  • రాజీనామాకు యడియూరప్ప సంసిద్ధత 
  • విమానాశ్రయం నుంచి పిలిపించి చెప్పిన షా


న్యూఢిల్లీ/బెంగళూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఈ నెల 25న కర్ణాటక ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న 79 సంవత్సరాల యడియూరప్ప ఆ మరుసటి రోజే(జూలై 26) తన పదవికి రాజీనామా చేయనున్నారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. శుక్రవారం ప్రధాని మోదీని, శనివారం రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకున్న యడియూరప్ప మధ్యాహ్నం కర్ణాటకకు తిరిగి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతుండగా హోం మంత్రి షా నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో విమానాశ్రయం నుంచే వెనక్కి వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా యడ్డి రాజీనామా గురించే వారు ప్రధానంగా చర్చించారని సమాచారం. పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్న యడియూరప్ప.. అనారోగ్య కారణాలతో తప్పుకొనే అవకాశాలున్నాయి. యడ్డి స్థానంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మయి, గనుల మంత్రి మురుగేష్‌ నిరానీ పేర్లు వినపడుతున్నాయి. కాగా, తనకుమారుడు విజయేంద్రకు పార్టీలో మంచి స్థానం కల్పించాలని యడియూరప్ప కోరినట్లు సమాచారం. కాగా, కర్ణాటకలో సీఎం మార్పు అనేది రాజకీయ వదంతేనని.. తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని యడ్డి ఢిల్లీలో విలేకరులకు స్పష్టం చేశారు.


కర్ణాటకలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు సహా నడ్డా సూచించారని తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని, సీఎంగా తననే కొనసాగాలని బీజేపీ పెద్దలు కోరినట్టు చెప్పారు. కేంద్ర మంత్రులు, నడ్డాను కలిసిన అనంతరం.. ఆయన చాలా ఖుషీగా కనిపించారు. కాగా, తన పదవిని కాపాడుకునేందుకు, తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నుంచి బయటపడేందుకే యడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా డబ్బుల మూటలు పట్టుకెళ్లారని దుయ్యబట్టారు.

Updated Date - 2021-07-18T08:26:53+05:30 IST