Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్పు చూపిస్తా..

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా కాంతిరాణా బాధ్యతల స్వీకారం

విజయవాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ కొత్త పోలీస్‌ బాస్‌గా టి.కాంతిరాణా బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. కమిషనరేట్‌లో ఇప్పటివరకు 25 మంది పోలీస్‌ కమిషనర్లు పనిచేశారు. 26వ సీపీగా రాణా నియమితులయ్యారు. తొలుత ఆయన ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. వేదాశీర్వచనం తీసుకున్నాక పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చి ఏఆర్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన చాంబర్‌కు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. 

సొంత ప్రాంతానికి వచ్చినట్టుంది

సీపీ తన సమావేశపు హాల్లో మీడియాతో మాట్లాడారు. బదిలీల్లో కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొత్త అనుభూతి కలుగుతుందని, విజయవాడకు రావడం వల్ల సొంత ప్రాంతానికి వచ్చానన్న అనుభూతి కలిగిందన్నారు. పోలీసింగ్‌లో కచ్చితంగా కొత్త మార్క్‌ కనిపిస్తుందని చెప్పారు. నేరాలు, బ్లేడ్‌బ్యాచ్‌, గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, ట్రాఫిక్‌తో పాటు నగర రహదారులపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. నగరంలో వీఎంఎస్‌ (విజువల్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌) బోర్డులను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను పనిచేసినప్పటికీ, ఇప్పటికీ ట్రాఫిక్‌లో చాలా మార్పు వచ్చిందని, దానిని ఇంకా క్రమపద్ధతిలోకి తీసుకురావాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో చోరీలకు పాల్పడుతున్న ముఠా చెడ్డీ గ్యాంగ్‌ అవునా, కాదా అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా అవకాశం కల్పించిన సీఎం జగన్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని, అందరూ సహకరించాలని కోరారు. విధినిర్వహణలో నిర్లిప్తతను ప్రదర్శించినా, పారదర్శకత లోపించినా సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రాణా హెచ్చరించారు. 

Advertisement
Advertisement