గందరగోళమేనా?

ABN , First Publish Date - 2021-08-01T06:35:28+05:30 IST

నూతన విద్యావిధానంతో జిల్లాలో పాఠశాల విద్యా వ్యవస్థ మారనుందా?

గందరగోళమేనా?

నూతన విద్యావిధానంపై సందేహాలెన్నో 

ప్రాథమిక పాఠశాలల విలీనంపై ఎంఈవోలతో  డీఈవో సమీక్ష

పాఠశాలలు తెరిస్తే 16 నుంచే నూతన విధానం అమలు

పలు ప్రాంతాల్లో పాఠశాలల విలీనంపై అభ్యంతరాలు


నూతన విద్యావిధానంతో జిల్లాలో పాఠశాల విద్యా వ్యవస్థ  మారనుందా?  ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే టైమ్‌టేబుల్‌ ఏర్పాటు చేసి, దాని ప్రకారం సబ్జెక్టుకు ఒక టీచర్‌ను నియమిస్తారా? ఇది సాధ్యమయ్యే పనేనా? ఆ  తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే  ఇప్పటివరకు పనిచే స్తున్న టీచర్లను ఎక్కడ సర్దుబాటు చేస్తారు?.. అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తే జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనే సందేహం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వ్యక్తమవుతోంది. నూతన విద్యావిధానం అమలులో భాగంగా ఆయా మండలాల్లో విలీనమయ్యే పాఠశాలలు, తదితర అంశాలపై డీఈవో తాహేరా సుల్తానా విజయవాడ, గుడివాడ, నూజవీడు డివిజన్లలోని ఎంఈవోలతో శనివారం సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సోమవారం  మచిలీపట్నం డివిజన్‌ పరిధిలోని ఎంఈవోలతో  సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం పాఠశాలల విలీనంపై తుది నిర్ణయం ప్రకటిస్తారు. 


16 నుంచే నూతన విధానం 

పాఠశాలల్లోనూతన  విద్యావిధానం ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా వ్యాప్తి తగ్గి, పాఠశాలలు తెరుచుకుంటే నూతన విద్యావిధానం అమలవుతుంది. ఈ విధానం అమలులోకి వస్తే జిల్లాలో ఉన్నత పాఠశాలలకు 250 మీటర్లలోపు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నతపాఠశాలల్లో విలీనం చేస్తారు. విజయవాడ డివిజన్‌లో 36, నూజివీడు డివిజన్‌లో 36, మచిలీపట్నం డివిజన్‌లో 50, నందిగామ డివిజన్‌లో 25, గుడివాడ  డివిజన్‌లో మరికొన్ని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాల్సి వస్తుందని ఎంఈవోలు ప్రభుత్వానికి పంపిన మ్యాపింగ్‌లో చూపారు. అయితే పాఠశాలల విలీనాన్ని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారంపై కొందరు ప్రజాప్రతినిధులు ఎంఈవోలపై ఒత్తిడి పెంచారు. దీంతో రైల్వేట్రాక్‌లు, ప్రధాన కాలువలు ఉన్నందున కొన్ని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేసేందుకు అవకాశం ఉండదని శనివారం డీఈవోతో జరిగిన సమావేశంలో ఎంఈవోలు తెలిపినట్టు సమాచారం. 


కొరత ఏర్పడితే ఉపాధ్యాయుల బదిలీ 

నూతన విద్యావిధానం అమలులో భాగంగా టీచర్ల కొరత  ఏర్పడితే అవసరమైన ప్రాంతాలకు ఉపాధ్యాయులను బదిలీ చేస్తారని, మరింతగా అవసరమైతే కొందరిని సర్దుబాటు చేస్తారని  చెబుతున్నారు. మూడు నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలను నియమించి పని విభజన చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక పాఠశాలల్లో  విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎల్‌ఎఫ్‌ఎల్‌  ప్రధానోపాధ్యాయులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తే ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుల పరిస్థితి ఏమిటనేది అర్థంకాని స్థితి. దీనిపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారు? ఎప్పటిలోగా నూతన విద్యావిధానం గాడిన పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నత పాఠశాల నాలుగైదు గ్రామాలకు ఒకటి ఉంటుందని,  ప్రాథమిక పాఠశాలలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయని, ఏకోపాధ్యాయ పాఠశాలలలు మండలానికి కనీసం 15 నుంచి 30 వరకు ఉన్నాయని వాటిని ఏం చేస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.   


గదులు చాలకుంటే పాత పాఠశాలలోనే..

ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను విలీనంచేసినా, అక్కడ గదులు చాలకుంటే నూతన గదులను నిర్మించే వరకు పాత పాఠశాలలోనే  తరగతులు నిర్వహించాలని ఇటీవల ఏర్పాటు చేసిన  ప్రధానోపాధ్యాయుల సమావేశంలో చెప్పినట్టు సమాచారం. 3, 4, 5 తరగతులకు నాలుగు గంటలు మాత్రమే సబ్జెక్టులు బోధించి, మిగిలిన సమయంలో పద్యాలు, యోగా, డ్రిల్‌, హోమ్‌వర్క్‌ చేయించాలని సూచించారు. సబ్జెక్టు టీచర్లు చాలకుంటే హెచ్‌ఎంలు ఆ తరగతులను తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాథమిక పాఠశాల నుంచి  వచ్చిన టీచర్లు చాలకుంటేస్కూల్‌ అసిస్టెంట్లే ఆ పిల్లలకు పాఠాలు చెప్పాలని నిర్ణయించారు.  పాఠశాల హెచ్‌ఎంలు, పీఈటీలు, పీడీలు ఉదయం ఎనిమిది గంటలకే పాఠశాలకు రావాలని, సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పాఠశాలలోనే ఉండాలని చెప్పినట్టు ఉపాఽధ్యాయులు  అంటున్నారు. డీవైఈవోలు, ఎంఈవోలు సరిపడినంతగా లేని కారణంగా కొంతమంది  హెచ్‌ఎంలకు సమీపంలో ఉన్న పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను కూడా అప్పగిస్తారని సూచనప్రాయంగా చెప్పారు.  

Updated Date - 2021-08-01T06:35:28+05:30 IST