కాబూల్‌లో కొత్త ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-09-09T06:21:38+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. కాబూల్‌ను చేజిక్కించుకున్న తాలిబన్ల మాటలు, చేతలు విపరీతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్మాతలుగా...

కాబూల్‌లో కొత్త ప్రభుత్వం

అఫ్ఘానిస్థాన్‌లో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచింది. కాబూల్‌ను చేజిక్కించుకున్న తాలిబన్ల మాటలు, చేతలు విపరీతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్మాతలుగా తాలిబన్లు విచక్షణతో, దూరదృష్టితో వ్యవహరిస్తారని, అన్ని వర్గాల వారిని కలుపుకుపోతారని ప్రపంచం ఆశించింది. కానీ, తాత్కాలిక ప్రభుత్వంలో వివాదాస్పదులు, గతకాలపు బీభత్సాలను గుర్తుచేసేవారు కనిపిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రమాదకారులుగా, ఉగ్రవాదులుగా గుర్తించినవారికి అందలాలు కిరీటాలు పెట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళలు మంత్రివర్గంలో లేరు. అఫ్ఘాన్ కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడానికి ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదు.


మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుతోటే, తాలిబన్ల తీరు పూర్తిగా వ్యక్తమైందని భావించలేము. ఇదొక ప్రక్రియ. అమెరికా ఆక్రమణను అనేక తెగలవారు, సంస్థలవారు విడివిడిగా ప్రతిఘటించారు. ఈ సమూహాలలో ఒకదానితో మరొకటి కూడా వైరం కలిగి ఉన్నాయి. పాతిక సంవత్సరాల కిందట మొదటిసారి తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న వీరావేశం, దుందుడుకుతనం, ఈ సుదీర్ఘపోరాటం కారణంగా నెమ్మదించిందని, సభ్యసమాజానికి భిన్నంగా కనిపిస్తున్న వ్యవహారసరళిని సవరించుకునే ధోరణి వారిలో కనిపిస్తోందని వారితో జరిగిన సుదీర్ఘ సంప్రదింపుల ప్రక్రియలో అమెరికా గమనించింది. తాలిబన్ల నుంచి మంచి తాలిబన్లను వేరు చేసి వారితో వ్యవహరించాలన్న దృష్టితో అనేకమంది అమెరికా అధ్యక్షులు తమ ప్రయత్నాలు సాగించారు. అఫ్ఘానిస్థాన్‌ను తమ అధీనంలో ఉంచుకుని అమెరికా లాభమేమీ పొందలేదని చెప్పలేము కానీ, నష్టం కూడా అపారంగా అనుభవించింది. వియత్నాంలో లాగానే, ఇక్కడ కూడా బయట పడలేని పద్మవ్యూహంలో చిక్కుకుని అలమటించవలసి వచ్చింది. చివరకు ఏవో ఒప్పందాలు చేసుకుని, బయటపడింది. నిష్క్రమించిన తీరుతో అమెరికా ప్రభుత్వం ఇంటా బయటా కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనవలసి వచ్చింది. 


ఇదంతా ఎట్లా మొదలయిందో ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. రాబోయే శనివారం నాటికి న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్‌సెంటర్ జంట భవనాలను ఉగ్రవాదులు విమానదాడిలో కూల్చివేసి ఇరవై సంవత్సరాలు. అక్కడే కాదు, అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌పై కూడా అదే సమయంలో దాడి జరిగింది. మరొక విమానం ఉగ్రవాదుల అధీనంలోనే కుప్పకూలిపోయింది. ఈ తీవ్ర సంఘటనల కారకులైన ఉగ్రవాదులకు అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆశ్రయమిస్తున్నదన్న అభిప్రాయంతో అమెరికా ఆ దేశంపై దాడిచేసి, ప్రభుత్వాన్ని కూల్చివేసింది. అప్పటి అఫ్ఘాన్ ప్రభుత్వ అధినేత ముల్లా ఉమర్ తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అనేకమంది తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధులు గ్వాంటినామో బే కారాగారంలో సుదీర్ఘకాలం శిక్షలు అనుభవించారు. అఫ్ఘాన్‌పై దాడి కారణంగా అల్ ఖాయిదాను కట్టడి చేయడం సాధ్యపడిందా లేదా అన్నది చర్చనీయాంశమే. పాకిస్థాన్-అఫ్ఘాన్ సరిహద్దులలో ఉన్న గొలుసుకట్టు గుహలపై అమెరికా వరుస వైమానిక దాడులు, డ్రోన్ దాడులు చేస్తూనే ఉన్నది. తాలిబన్లకు సహాయకారిగా ఉన్నదని ఇప్పటికీ చెప్పుకుంటున్న పాకిస్థాన్ కిమ్మనకుండా అమెరికా దాడులకు సహకరిస్తూ వచ్చింది. రెండు దశాబ్దాల కాలంలో, అమెరికా అఫ్ఘానిస్థాన్‌ను సైనికంగా గెలవలేకపోయింది. తన మిత్రదేశమైన పాకిస్థాన్ ద్వారా కూడా తాలిబన్లను లొంగదీయలేకపోయింది. అమెరికా నిష్క్రమిస్తుందన్న ఆశతో తాలిబన్లు కూడా కొంత రాజీధోరణి చూపించి ఉండవచ్చు. పాతికేళ్ల కిందటి లాగా ఇప్పుడు ప్రభుత్వం నడపడం సాధ్యం కాదని వారికి కూడా అర్థమై ఉంటుంది. ప్రపంచదేశాలలో ఒకటిగా, ఇరుగుపొరుగు మధ్య సహజీవనం చేయవలసిన దేశానికి అందుకు తగ్గ ప్రభుత్వాన్ని నిర్మించకపోతే, అది తాలిబన్లకు, అఫ్ఘాన్లకు కూడా నష్టం. 


త్వరగా ఈ ఊబి నుంచి బయటపడాలన్న అమెరికా ఆత్రుతను తాలిబన్లు కూడా గమనించారు. వారు చైనా, రష్యాలలో కొత్త మిత్రులను కనుగొన్నారు. భౌగోళిక రాజకీయాలలో ఇది ఒక గమనించదగ్గ అంశం. సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పుడు అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించి భంగపడిన రష్యాకు, తిరిగి ఈ ప్రాంతంలో కొంత పలుకుబడి సిద్ధించబోతోంది. పాకిస్థాన్‌తో ఒక రకమైన స్నేహం, అఫ్ఘానిస్థాన్తో మరో రకమైన స్నేహంతో చైనా బాగా లబ్ధి పొందబోతోంది. ముఖ్యంగా మహా రవాణామార్గాల నిర్మాణానికి ఎంతో సానుకూలత ఏర్పడుతోంది. అమెరికా వెంట నడిచి, అప్ఘానిస్థాన్‌లో వేలాది కోట్ల పెట్టుబడులు పెట్టిన భారత్‌కు రాజకీయంగాను, ఆర్థికంగానూ కూడా నష్టం తప్పనట్టు కనిపిస్తోంది. తమలోని అనేక బృందాలను, తమకు వెలుపల ఉన్న బృందాలను సంతుష్టిపరచడానికి ఒకనాటి తీవ్రవాదులకు, వివాదాస్పదులకు తాత్కాలిక ప్రభుత్వంలో స్థానం ఇచ్చి ఉండవచ్చును కానీ, పాతచరిత్ర పునరావృత్తం కావడం పాకిస్థాన్, చైనాలకు కూడా ఇష్టం లేదు. పరిణామాలను నియంత్రించే అవకాశం లేని భారత్ వేచి చూడడం మాత్రమే చేయగలదు. అదే చేస్తున్నది కూడా. 


మహిళలకు స్థానం లేని ప్రభుత్వం ఏర్పాటునకు నిరసనలు బలంగా వినిపించడం విశేషం. అఫ్ఘానిస్థాన్‌లో విభిన్న స్వరాలు, నిరసనస్వరాలు కూడా ఉన్నాయి. అంతిమంగా ప్రజాస్వామ్యం దిశగా ఆ దేశం అడుగులు వేయగలదని అవే ఆశ కలిగిస్తున్నాయి.

Updated Date - 2021-09-09T06:21:38+05:30 IST