Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధాన్యం కొనుగోలులో కొ(త్త)ర్రీ

 ఓపీఎంఎ్‌సలో నమోదు తప్పనిసరి

 ఓటీపీ నంబరు చూపితేనే ధాన్యం కాంటా

 కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం

 నిరక్షరాస్యులైన రైతులకూ ఇబ్బందే 

 ఓపీఎంఎ్‌సతో అక్రమాలకు చెక్‌ పడుతుందంటున్న అధికారులు


ఎండనక.. వాననక.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట పండిస్తే తీరా విక్రయిద్దామంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కేంద్రం కొనుగోలు చేస్తలేదని రాష్ట్రం, రాష్ట్రమే కొనుగోలు చేయాలని కేంద్రం ప్రకటనలు చేస్తూ రైతులను తికమక పెడుతున్నాయి. మరోవైపు వాతావరణ మార్పులు కల్లాల్లో ధాన్యంపై ప్రభావం చూపుతుంటే, రైతులు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మరో కొర్రీతో ముందుకొచ్చింది. ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంటు మేనేజ్‌మెంటు సిస్టమ్‌ (ఓపీఎంఎ్‌స)లో పేర్లు నమోదు చేసుకోవాలని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చాలా వరకు నిరక్ష్యరాస్యులైన రైతులు గందరగోళంలో పడిపోయారు. 

 మోత్కూరు


వానా కాలం వరి కోతలు ప్రారంభమై సుమారు నెల గడిచింది. అయినా నేటికీ ధాన్యం కొనుగోలు సక్రమంగా సాగడంలేదు. ముందుగా వరి కోసిన రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు క్వింటా రూ.1400 నుంచి 1500కు అమ్ముకుని నష్టపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రభుత్వమే మద్దతు ధరకు ధాన్యం కొనాలన్న డిమాండ్‌ మేరకు నవంబరు మొదటి వారంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రారంభించిన కేంద్రాల్లో కొన్నింటిలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతుండగా మరికొన్నింటిలో ఇంకా కొనగోలు ప్రారంభించనేలేదు. ప్రభుత్వం తాజాగా ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంటు మేనేజ్‌మెంటు సిస్టమ్‌ (ఓపీఎంఎ్‌స)లో పేర్లు నమోదు చేసుకోవాలని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. రైతు ఆధార్‌ నంబరుకు మొబైల్‌ ఫోన్‌ నంబర్‌ లింక్‌ అయి ఉంటే నమోదు చేయగానే రైతుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నంబర్‌ చెబితేనే ధాన్యంకొంటారు. వానా కాలం పంటల సాగు సమయంలో వ్యవసాయాధికారులు ఆన్‌లైన్‌ పంటలు నమోదు చేసిన విస్తీర్ణం మేరకే ఎకరాకు 90 (40 కిలోలవి) బస్తాల చొప్పున్నే బిల్లు అవుతుంది. ఎక్కువ బస్తాలు తూకం వేస్తే బిల్లు కాదు. 


ఓపీఎంఎ్‌సలో నమోదు ఇలా..

కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు ముందుగా కొనుగోలు కేంద్రాల వద్దగాని, పోస్టాఫీసులోగాని, ఇంటర్నెట్‌ సెంటర్‌లోగాని మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఓపీఎంఎ్‌సలో రైతు పేరు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆధార్‌ నంబరు నమోదు చేయగానే దానితో లింక్‌ చేయబడిన ఫోన్‌కు ఓటీపీ నంబర్‌ వస్తుంది. ఆ నంబర్‌తో వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే రైతు పంటసాగుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు కొత్తగా వివరాలు నమోదు చేయడానికి వీలుకాదంటున్నారు. క్రాప్‌ బుకింగ్‌ అప్పుడు నమోదు చేసిన విస్తీర్ణం మేరకే ఎకరాకు 90 బస్తాల (40 కిలోలు) చొప్పున కొంటేనే బిల్లు రికార్డు అవుతుంది. ఆ మేరకే కేంద్రాల నిర్వాహకులు ధాన్యం కొంటారు. కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ సౌకర్యం లేదని, పోస్టాఫీసులో గాని, ఇంటర్నెట్‌ సెంటర్‌లో గాని రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని నిర్వాహకులు చెబుతున్నారు.


జిల్లాలో 170 కేంద్రాలు ప్రారంభం 

యాదాద్రిభువనగిరి జిల్లాలో 170 కేంద్రాలను ప్రారంభించారు. మోత్కూరు మండలంలో 11 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఓపీఎం్‌సలో రైతుల రిజిస్ట్రేషన్‌పై క్లారిటీ ఒక్క బస్తా ధాన్యం కూడా కొనలేదు. యాదాద్రిభువగిరి జిల్లాలో ఇప్పటివరకు 1300 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని చెబుతున్నప్పటికీ బిల్లు మాత్రం చేయడం లేదు. 


ఓపీఎంఎస్‌ పట్ల నిర్వాహకులకు సైతం అవగాహన కరువు

ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ముందుగా ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేసినా క్షేత్రస్థాయిలో అధికారులు రైతులకు దానిపై అవగాహన కల్పించడంలేదు. రైతులకే కాదు కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న మార్కెట్‌, సింగిల్‌విండో, ఐకేపీ సిబ్బందికి కూడా అవగాహనలేదు. దీంతో ఇటు నిర్వాహకులు, అటు రైతులు అయోమయం, ఆందోళనకు గురవుతున్నారు. కొద్దిగా భూమి ఉన్నవారు ఇతర రైతుల భూములు కౌలుకు తీసుకుని వరి సాగుచేశారు. వారికి ఆన్‌లైన్‌లో తమ పేర పట్టా ఉన్న భూమి మాత్రమే ఉంటుంది. ఆ భూమిలో వచ్చే దిగుబడినే తీసుకుంటే మిగతా ధాన్యం ఎలా అమ్ముకోవాలన్నది రైతులకు బోధపడటం లేదు. 


కౌలు రైతులను గుర్తించడమే లేదు 

కౌలు రైతులను ప్రభుత్వం రైతులుగా గుర్తించడమే లేదు. ఓపీఎంఎ్‌సలో పేర్లు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న నిబంధనతో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతు పేరున భూమిగాని, పంట వివరాలు గాని ఆన్‌లైన్‌లో నమోదుకాలేదు. దీంతో కౌలు రైతులు ఓపీఎంఎస్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. భూమి కౌలుకు ఇచ్చిన రైతుల పేరున రిజిస్ర్టేషన్‌ చేయిద్దామంటే దూర ప్రాంతాల్లో ఉండే పట్టాదారులు కొందరు పంటల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించగా, మరికొందరు చేయించలేదు. దీంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. పట్టాదారుల పేరున అమ్మితే డబ్బు వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని, వారు వచ్చేదెప్పుడు, డబ్బులు తీసి ఇచ్చేదెప్పుడు,  యాసంగి పంటల సాగుకు పెట్టుబడి ఎలా అని కౌలు రైతులు వాపోతున్నారు. ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానాన్ని రద్దు చేసి గతంలో ఇచ్చినట్లు తమ బ్యాంకు ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు. ధాన్యం అమ్ముకున్న డబ్బులు రైతుబంధు కోసం ఇచ్చిన ఖాతాల్లోనే జమ అవుతుందని, కొత్తగా బ్యాంకు ఖాతాలు తీసుకునేదేమి ఉండదంటున్నారు. 


అక్రమాలకు చెక్‌ పెట్టడానికే..

ధాన్యం కొనుగోలులో జరిగే అక్రమాలకు చెక్‌ పెట్టడానికే ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ విధానాన్ని తీసుకవచ్చామని అధికారులు చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులకు కోత పెట్టిన ధాన్యం ఇతరుల పేరున అమ్ముకోవడానికి ఈ విధానంతో అవకాశముండదంటున్నారు. 


ఓపీఎంఎ్‌సపై సందిగ్ధంతోనే కొనడం లేదు

జిల్లాలో మోత్కూరు మండలంతోపాటు పలు మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఓపీఎంఎ్‌సలో రైతుల రిజిస్ట్రేషన్‌పై సందిగ్ధంతోనే ధాన్యం కొనడంలేదని నిర్వాహకులు చెబుతున్నారు. తాము చెబితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు పరిగణించి తమను ఇబ్బందులకు గురిచేస్తారని వారు తమ పేర్లు రాయవద్దంటున్నారు. ఓపీఎంఎ్‌సపై వారు జిల్లా ఉన్నతాధికారులను అడిగినా వారు కూడా సరైన క్లారిటీ ఇవ్వడం లేదంటున్నారు.


ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ తప్పని సరి : గోపీకృష్ణ, పౌరసరఫరాల జిల్లా అధికారి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆధార్‌నంబరుకు మొబైల్‌ నంబరు లింక్‌ అయి ఉంటే చాలు. ఆధార్‌నంబరు నమోదు చేయగానే రైతు మొబైల్‌కు ఓటీపీ నంబరు వస్తుంది. దాంతో వివరాలు నమోదు చేసుకోవచ్చు.   

యానాల దామోదర్‌రెడ్డి

ఓపీఎంఎస్‌ విధానం రద్దు చేయాలి: యానాల దామోదర్‌రెడ్డి, రైతు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి

ధాన్యం కొనుగోలును తగ్గించుకోవడానికే ప్రభుత్వం కొత్త, కొత్త విధానాలు తెస్తోంది. ఓపీఎంఎ్‌సలో రిజిస్ట్రేషన్‌ అంటే రైతులు ఇబ్బంది పడుతారు. గతంలో చిన్న కమతాలు ఉన్న ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ధాన్యం ఒక్కదగ్గర కాంటా వేయించి డబ్బులు వచ్చాక పంచుకునే వారు. కౌలు రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేది. ఇప్పుడా అవకాశం ఉండదు. కౌలు రైతుల పరిస్థితి ఏమిటి. ప్రభుత్వం పునరాలోచించి ఓపీఎంఎస్‌ విధానం రద్దు చేయాలి. అవినీతి, అక్రమాలను అరికట్టలేక అధికారులు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు.

Advertisement
Advertisement