రామగుండానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌

ABN , First Publish Date - 2021-10-10T05:33:04+05:30 IST

రామగుండం నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు.

రామగుండానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌
గోదావరిఖని పట్టణం వ్యూ

- సిద్ధం చేసిన డీడీఎఫ్‌ కన్సల్టెన్సీ

- నగర అభివృద్ధికి రోడ్లు, ఇతర ప్రణాళికలు

- 20ఏళ్ల అంచనాలతో రూపకల్పన

- త్వరలోనే స్టేక్‌ హోల్డర్స్‌తో సమావేశం

- అభిప్రాయాలు, సూచనలకు అనుగుణంగా చేర్పులు, మార్పులు

కోల్‌సిటీ, అక్టోబరు 9: రామగుండం నగరానికి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. భవిష్యత్‌ అవసరాలు, నగర విస్తరణ, నూతన పరిశ్రమలు, మెడికల్‌ కళాశాల తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాస్టర్‌ ప్లాన్‌ను తయారుచేస్తున్నారు. డిజైన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (డీడీఎఫ్‌) సంస్థ ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపకల్పన చేస్తోంది. మున్సిపల్‌ శాఖ డీడీఎఫ్‌ కన్సల్టెంట్‌కు మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేసిన ఈ సంస్థ డ్రాఫ్టును కూడా రూపొందించింది. కరోనా కారణంగా మాస్టర్‌ ప్లాన్‌కు సంబంధించి  పనికి కొంత జాప్యం ఏర్పడింది. ఇప్పుడు డీడీఎఫ్‌ సంస్థ పని వేగవంతం చేసింది. ఈ నెలలోనే స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశం నిర్వహించనున్నది. ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, పాత్రికేయులతో సమావేశం నిర్వహించి మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలపై అభిప్రాయ సేకరణను చేయనున్నారు. 

ఈ ఏడాదితో మాస్టర్‌ ప్లాన్‌ గడువు పూర్తి

రామగుండం నగరపాలక సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ను ఈ ఏడాదితో కాలపరిమితి ముగియనున్నది. రామగుండం మున్సిపాలిటీగా ఏర్పడిన తరువాత 2001లో మొదటగా మాస్టర్‌ ప్లాన్‌ను ఏర్పాటు చేశారు. 20ఏళ్ల కాలపరిమితిపై ప్రభుత్వం ఈ మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదం తెలిపింది. ఈ ఏడాదిలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి కౌన్సిల్‌లో ఆమోదం తరువాత ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వం ఆమోదం తెలిపి జీఓ జారీ చేస్తుంది. 

నగర విస్తరణే లక్ష్యంగా..

రామగుండం నగరపాలక సంస్థలో నగర విస్తరణే లక్ష్యంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం రామగుండం నగర జనాభా 2,29,644గా ఉంది. 2021లో ఈ జనాభా 2,48,980గా ఉం టుందని అంచనా వేస్తున్నారు. 93.87చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రామగుండం నగరంలో రామగుండం, ఎన్‌టీపీసీ, గోదావరిఖని పట్టణాలున్నాయి. దీనికి ట్రైసిటీగా పేరుంది. 2001లో మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించినా అందుకు అనుగుణంగా రోడ్లు, పార్కులు, ఆట స్థలాలు కానీ, ఇతర అభివృద్ధి ప్రతిపాదనలు కానీ అమలుకు నోచుకోలేదు. 2011లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో నగర విస్తరణపై పూర్తిస్థాయిలో ముందుచూపు లేకుండా వ్యవహరించారనే విమర్శలున్నాయి. ఇందులో గోదావరిఖని పట్టణంలోని ఏ ఒక్క రహదారిని 100అడుగుల రహదారిగా అంచనా వేయలేదు. కేవలం బీ పవర్‌హౌస్‌ నుంచి పెద్దంపేట, ఎన్‌టీపీసీ ప్రస్తుత పీకే రామయ్య క్యాంపు లింగాపూర్‌గుండా రామగుండంకు 100అడుగుల రహదారిని ప్రతిపాదించారు. దీంతో పాటు ఎన్‌టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు నుంచి ఎఫ్‌సీఐ వరకు 100అడుగుల రహదారిని ప్రతిపాదించారు. ఇక మేడిపల్లి సెంటర్‌ నుంచి మేడిపల్లి ఓసీపీ, గంగానగర్‌ నుంచి మేడిపల్లి వరకు మాత్రం 80అడుగుల రహదారిని ప్రతిపాదించారు. రామగుండం నగరం విస్తరించడం, శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందుతుండడంతో అందుకు అనుగుణంగా రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఆర్‌డీపీ)ను రూపొందించుకున్నాయి. ముఖ్యంగా గోదావరిఖని మున్సిపల్‌ జంక్షన్‌ నుంచి ఫైవింక్లయిన్‌ వరకు వంద అడుగుల రహదారి, రాజేష్‌ థియేర్‌  నుంచి మార్కండేయకాలనీ, మార్కండేయకాలనీ నుంచి కళ్యాణ్‌నగర్‌ వరకు 60అడుగుల రహదారికి ఆమోదం లభించింది. అలాగే ఇందిరానగర్‌ నుంచి గౌతమినగర్‌, ఇందిరానగర్‌ నుంచి 7ఎల్‌బీ కాలనీ వరకు 60అడుగుల విస్తరణ ప్రతిపాదించారు. అలాగే మున్సిపల్‌ ఆఫీస్‌ వెనుక నుంచి శివాలయం వరకు 40అడుగులకు ఆర్‌డీపీ ఆమోదం లభించింది. ఇక లక్ష్మీనగర్‌లో 40అడుగుల విస్తరణను ప్రతిపాదించారు. గత మాస్టర్‌ ప్లాన్‌లో చాలా ప్రాంతాలను ఓపెన్‌ స్పేస్‌లుగా చూపారు. చుట్టూ రెసిడెన్షియల్‌ జోన్‌లో ఉన్న ప్రాంతాలలో మధ్యన ఉన్న ఏరియాను వెకెంట్‌ ల్యాండ్‌గా చూపారు. ముఖ్యంగా ఎన్‌టీపీసీలోని కృష్ణనగర్‌ ప్రాంతంలో గల గంగపుత్ర సొసైటీ ఏరియా, సప్తగిరికాలనీ సమీపంలోని ఏరియా, ప్రస్తుత గంగానగర్‌ ఏరియాలను మాస్టర్‌ ప్లాన్‌లో వెకెంట్‌ ల్యాండ్‌గా చూపారు. దీంతో ఈ ప్రాంతంలో నిర్మాణాలకు అనుమతులు రావడం లేదు. చుట్టూ నిర్మాణాలు జరిగి ఈ స్థలాలు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. గంగానగర్‌లో సింగరేణి ప్లాటింగ్‌ జరిగి నిర్మాణాలు కూడా జరిగాయి. అయినా ఆ ప్రాంతాన్ని వెకెంట్‌ ల్యాండ్‌గా మాస్టర్‌ ప్లాన్‌లో చూపారు. అక్కడ పాత షెడ్ల స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించాలంటే కూడా అనుమతులు రావడం లేదు.  వీటితో పాటు 1984లో గోదావరికి వచ్చిన వరదలను అంచనా వేసి సబ్‌ మెర్జిబుల్‌ ఏరియాను రూపొందించారు. ఇందులో ప్రస్తుత పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీ, జనగామ పరిసర భూములన్నీ ముంపు భూములుగానే ఉన్నాయి. ఈ భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులు రావు. అనుమతులు రావాలంటే ప్రభుత్వం కన్వర్షన్‌ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణం వల్ల బ్యాక్‌ వాటర్‌ పవర్‌హౌస్‌కాలనీ, సప్తగిరికాలనీలోని చాలా ప్రాంతాలకు వస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, గోదావరి వరదలకు సప్తగిరికాలనీ సమీపంలోని ఎన్‌ఆర్‌సీపీ పరిసర భూములన్నీ ముంపునకు గురయ్యాయి. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో సబ్‌ మెర్సిబుల్‌ ఏరియాలో వీటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

20 ఏళ్ల అభివృద్ధికి మాస్టర్‌ ప్లానే ఊపిరి..

రామగుండం నగరం మరో 20ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి జరుగాలన్న విషయానికి మాస్టర్‌ ప్లానే సూచికగా మారనున్నది. సింగరేణి గనుల విస్తరణలో భాగంగా అనేక రహదారులు, నాలాలను మళ్లిస్తున్నారు. రామగుండం నగరానికి సమీపం నుంచి కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి. రామగుండం నుంచి కాళేశ్వరం, రామగుండం నుంచి వరంగల్‌, రామగుండం నుంచి నాగపూర్‌ మార్గాలకు జాతీయ రహదారులు కనెక్ట్‌ అవుతాయి. ఇందుకు అనుగుణంగా బైపాస్‌ల నిర్మాణాలు జరగాల్సి ఉంటుంది. రామగుండం శివారు ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందాయి. లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల కల్చర్‌ వచ్చింది. రామగుండం నుంచి జనాభా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం దాదాపు ఆగింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌, ఎన్‌టీపీసీ తెలంగాణ ప్లాంట్‌, సింగరేణి, ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో సోలార్‌ ప్లాంట్లు, రామగుండంలో నూతనంగా మెడికల్‌ కళాశాల, ఐటీ టవర్ల మంజూరు వంటివి జరిగాయి. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి కూడా జరుగుతోంది. రామగుండం నగరం పక్కనే ఉన్న అంతర్గాం ప్రాంతంలో ఇండస్ర్టియల్‌ పార్కును ప్రతిపాదిస్తున్నారు. రామగుండం పక్కనే రామగుండం నగరంకు పది కిలో మీటర్ల దూరంలో ఇందారం నుంచి టేకుమట్ల, మంథని, బేగంపేట మీదుగా వరంగల్‌కు కొత్త జాతీయ రహదారి మంజూరైంది. త్వరలోనే నిర్మాణ పనులు కూడా మొదలుకానున్నాయి. గనుల విస్తరణలో భాగంగా రామగుండం-మంథని-కాళేశ్వరం రహదారిని కూడా మళ్లించారు. గోదావరి వెంట ఉన్న గ్రామాల గుండా ఈ రహదారి నిర్మాణం జరిగింది. నూతన మాస్టర్‌ ప్లాన్‌లో 100, 120 అడుగుల రహదారులను అభివృద్ధి జరుగనున్న ఏరియాల్లో ప్రతిపాదించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, స్టేడియంలు, ఆసుపత్రులు, పా ర్కులకు సంబంధించి పబ్లిక్‌యుటిలిటీ ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉం టుంది. మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదించిన తరువాత ప్రభుత్వం ఇందుకు సం బంధించి అమలుకు నిధులు కేటాయించనున్నది. కొత్త మాస్టర్‌ ప్లాన్‌లో రాబోయే 20ఏళ్ల జనాభాను అంచనా వేసి అందుకు అనుగుణంగా రహదారుల రూపకల్పన కూడా చేయాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే నిర్మాణాలకు సంబంధించిన అనుతులు కూడా మంజూరవుతాయి. 

Updated Date - 2021-10-10T05:33:04+05:30 IST