సంజాయిషీ ఇవ్వాల్సిందే!.. అనర్హత కేసులో కొత్త మలుపు

ABN , First Publish Date - 2020-07-09T15:19:38+05:30 IST

ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే దాఖలు చేసిన తాజా పిటిషన్లపై సుప్రీంకోర్టులో

సంజాయిషీ ఇవ్వాల్సిందే!.. అనర్హత కేసులో కొత్త మలుపు

  • ఓపీఎస్‌ సహా 11 మంది ఎమ్మెల్యేలకు, స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు 


చెన్నై: ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే దాఖలు చేసిన తాజా పిటిషన్లపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కొత్త మలుపు చోటు చేసుకుంది. పన్నీర్‌సెల్వం సహా 11 మందికి సర్వోన్నత న్యాయస్థానం సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసి సంచలనం కలిగించింది. శాసనసభలో ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వంపై జరిగిన విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారి నుంచి సంజాయిషీ కోరుతూ సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఓపీఎస్‌, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసు కోకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణపై శాసనసభ స్పీకర్‌ ధనపాల్‌కు, శాసనసభ కార్యదర్శికి కూడా నోటీసులు జారీ చేసింది. శాసనసభలో 2017 ఫిబ్రవరి 18న ఎడప్పాడి పళని స్వామి ప్రభుత్వంపై విశ్వాసపరీక్షపై ఓటింగ్‌ జరిగింది. ఆ సమయంలో అసమ్మతివర్గంగా వ్యవహరించిన ఒ.పన్నీర్‌సెల్వం (బోడినాయకనూర్‌), పాండ్యరాజన్‌ (ఆవడి) సెమ్మలై (మేట్టూరు), షణ్ముగనాథన్‌ (శ్రీవైకుంఠం), నటరాజ్‌ (మైలాపూరు), ఆరుకుట్టి (గౌండంపాళయం), చిన్నరాజ్‌ (మేట్టుపాళయం), మనోరంజితం (ఊత్తంగరై), శరవణన్‌ (మదురై సౌత్‌) మాణిక్కం (చోళ వందాన్‌), మనోహరన్‌ (వాసుదేవనల్లూరు) ప్రభుత్వానికి మద్దతుగా, వ్యతిరేకంగా ఓటు వేయకుండా మౌనం పాటించారు. దీంతో పార్టీవిప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన పన్నీర్‌సెల్వం, ఆయన వర్గంలోని 10 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించాలని డీఎంకే విప్‌ చక్రపాణి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 


అప్పట్లో అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకుడిగా వ్యవహరించిన టీటీవీ దినకరన్‌ అనుచరులు వెట్రివేల్‌, రంగసామి తదితరులు కూడా ఇదేవిధంగా పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై అప్పటి హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి 2018 ఏప్రిల్‌ 7న స్పీకర్‌ అధికారంలో జోక్యం చేసుకోలేమని తీర్పు వెలువరించింది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ డీఎంకే విప్‌ చక్రపాణి సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 11 మంది శాసనసభ్యులపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌కు ఎలాంటి గడువు విధించలేమని, ఆ వివాదంలో ఆయనే తగు నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ప్రకటించింది. ఆ తర్వాత స్పీకర్‌ ధనపాల్‌ ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు సూచన చేసి మూడు నెలలు దాటినా 11 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపిస్తూ డీఎంకే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా మరో పిటిషన్‌ దాఖలు చేసి, గతంలో మణిపూర్‌ శాసనసభలో జరిగిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్‌ ధనపాల్‌కు తగు ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఈ తాజా పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే,  న్యాయమూర్తులు ఎం.ఆర్‌. షా, ఏఎస్‌ గోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జూన్‌ 16 విచారణ జరిపి ఈ వివాదంలో స్పీకర్‌ ఎందుకింత జాప్యం చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఓపీఎస్‌ సహా 11 మంది శాసనసభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించి కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. బుధవారం డీఎంకే పిటిషన్‌పై మళ్ళీ విచారణ ప్రారంభమైంది. ఆ సందర్భంగా పన్నీర్‌సెల్వం సహా 11 మంది శాసనసభ్యులపై స్పీకర్‌ ఏదో ఒక చర్య తీసుకుంటారని ఆశించిన తమకు నిరాశే ఎదురైందని, తమ సూచన పాటించకుండా మూడు మాసాలపాటు కాలయాపన చేయడం గర్హనీయమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు.

Updated Date - 2020-07-09T15:19:38+05:30 IST