అదరగొడుతున్న న్యూజిల్యాండ్.. 100 రోజులుగా నో కరోనా..!

ABN , First Publish Date - 2020-08-09T18:05:34+05:30 IST

కరోనాను కట్టడి చేయాలి.. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఓకే ఒక్క లక్ష్యం ఇది. అయితే అనేక దేశాల విషయంలో ఇది కలగానే మిగిలిపోతోంది. కొన్ని దేశాల్లో తొలుత కరోనా అదుపులోకి వచ్చినట్టు అనిపించినప్పటికీ..అకస్మాత్తూగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. చైనా ఇందుకు మంచి ఉదాహరణ. అయితే న్యూజిల్యాండ్ మాత్రం అందరికంటే భిన్నంగా..కరోనా కట్టడిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది.

అదరగొడుతున్న న్యూజిల్యాండ్.. 100 రోజులుగా నో కరోనా..!

వెల్లింగ్టన్: కరోనాను కట్టడి చేయాలి.. ప్రస్తుతం ప్రపంచం ముందున్న ఓకే ఒక్క లక్ష్యం ఇది. అయితే అనేక దేశాల విషయంలో ఇది కలగానే మిగిలిపోతోంది. కొన్ని దేశాల్లో తొలుత కరోనా అదుపులోకి వచ్చినట్టు అనిపించినప్పటికీ..అకస్మాత్తూగా కేసుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వాధికారులు తలలు పట్టుకుంటున్నారు. చైనా ఇందుకు మంచి ఉదాహరణ. అయితే న్యూజిల్యాండ్ మాత్రం అందరికంటే భిన్నంగా..కరోనా కట్టడిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. గత 100 రోజుల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదుకాకపోవడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


ప్రస్తుతం న్యూజిల్యాండ్లో కేవలం 23 యాక్టివ్ కేసులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కూడా కరోనా రోగులు దేశంలోకి అడుగుపెట్టే సమయంలో గుర్తించినవే.! వీరందరూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని కరోనా ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.


కాగా.. కరోనా కట్టడి విషయంలో తాము అనుకున్నది సాధిస్తున్నామని ఆదేశ ఆరోగ్య సేవల విభాగం చీఫ్ ఆష్లే బ్లూమ్‌ఫ్లీడ్ వ్యాఖ్యానించారు. ‘గత 100 రోజుల్లో స్థానిక మూలాలున్న కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాకపోవడమనేది కరోనా కట్టడికి సంబంధించి ఓ ముఖ్యమైన మైలురాయి. అయితే ఇది అలసత్వం ప్రదర్శించటానికి సమయం కాదు. అనేక ప్రాంతాల్లో కరోనా కట్టడిలోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ విజృంభించడం మనం చూశాం. కాబట్టి.. భవిష్యత్తులో కరోనా కొత్త కేసులేవీ నమోదుకాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి’ అని ఆష్లే వ్యాఖ్యానించారు.


ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం న్యూజిల్యాండ్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సామాజిక వ్యాప్తిని నిరోధించడంలో న్యూజిల్యాండ్‌ను మిగితా దేశాలకు ఆదర్శంగా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే వ్యాఖ్యానించింది. న్యూజిల్యాండ్‌లొ తొలి కేసు ఫిబ్రవరిలో బయటపడగా.. ఇప్పటివరకూ అక్కడ మొత్తం 1219 కేసుల నమోదయ్యాయి. ఇక స్థానిక వ్యాప్తికి సంబంధించి మే1న చివరి కేసు బయటపడింది. అప్పటి నుంచి ఈ రోజు (ఆదివారం) వరకూ.. అంటే ఏకంగా వంద రోజుల పాటు దేశంలో కమ్యూనిటీకి ట్రాన్స్‌మిషన్‌కు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడంతో న్యూజిల్యాండ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-08-09T18:05:34+05:30 IST