కలిసుందాం వచ్చేయండి.. కూటమికి సారథ్యం వహించండి!

ABN , First Publish Date - 2021-03-06T15:54:11+05:30 IST

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీతో పొసగక

కలిసుందాం వచ్చేయండి.. కూటమికి సారథ్యం వహించండి!

చెన్నై : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో బీజేపీతో పొసగక, పక్క చూపులు చూస్తున్న మాజీ సీఎం ఎన్‌ఆర్‌ రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో చెలిమికి స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే, కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీలు ముందుకొచ్చాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు సెక్యులర్‌ కూటమికి నేతృత్వం వహించాలంటూ రంగస్వామి డీఎంకే ఆహ్వానించింది. కారైక్కల్‌ జిల్లా డీఎంకే నేత నజీమ్‌ ఈ మేరకు శుక్రవారం ఓ బహిరంగ వీడియో సందేశం పంపించారు.


ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ మునుపెన్నడూ లేనంతగా అయోమయంలో కొట్టుమిట్టాడుతోందని, పార్టీ నాయకుడిని కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని నజీమ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలుగా రంగస్వామి తమ కూటమికి నాయకత్వం వహించేందుకు రావాలన్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ నేతలు దిగ్ర్భాంతి చెందారు. రంగస్వామి తమ కూటమిలోకి వస్తే పరిస్థితి ఏంటన్నదానిపై వారు బేరీజు వేసుకుంటున్నారు. మరోవైపు కమల్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీదిమయ్యం పార్టీ నేతలు శుక్రవారం పుదుచ్చేరి వెళ్లి రంగస్వామితో భేటీ అయ్యారు. అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ నేతృత్వంలోని కూటములతో సంబంధం లేకుండా తమ కూటమిలో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. తమకు భారీ స్థానాలు అవసరం లేదని, కానీ, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కలిసి పని చేద్దామని, దీనికి తాము పూర్తిగా సహకరిస్తామని సూచించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా ధైర్యంగా ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకాయన తమ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని చెప్పినట్లు తెలిసింది. 

Updated Date - 2021-03-06T15:54:11+05:30 IST