పీఎఫ్‌ఐ కదలికలపై ఎన్‌ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2022-09-19T06:48:24+05:30 IST

జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యక్రమాలపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మూడు గంటల నుంచే దర్యాప్తు కొనసాగించారు. పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

పీఎఫ్‌ఐ కదలికలపై ఎన్‌ఐఏ సోదాలు

జిల్లాలో ఏకకాలంలో 23 ప్రాంతాల్లో తనిఖీలు

పీఎఫ్‌ఐకి సంబంధించిన అనుమానితుల ఇళ్లల్లో సోదాలు

సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పాస్‌పోర్టులు, ప్రింటర్ల స్వాధీనం

డిగ్రీ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు

నేడు విచారణకు హాజరుకావాలని మరో పదిమందికి నోటీసులు

నిజామాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/ఖిల్లా: జిల్లాలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యక్రమాలపై ఎన్‌ఐఏ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మూడు గంటల నుంచే దర్యాప్తు కొనసాగించారు. పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. కొంతమందికి నోటీసులు ఇవ్వడంతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో పది మందికి ఈ నెల 19న ఎన్‌ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులను ఇచ్చారు. పీఎఫ్‌ఐకి సంబంధించిన కార్యకలాపాలు పరిశీలించడంతో పాటు అనుమానితులకు సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్‌, సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, పాస్‌పోర్టులు, ప్రింటర్‌లు స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి జిల్లాకు ఎన్‌ఐఏ అధికారులు

ఎన్‌ఐఏ సీనియర్‌ ఎస్పీ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి అధికారులు జిల్లాకు చేరుకున్నారు. ఇద్దరు డీఎస్పీలు, 40 మంది ఇన్స్‌పెక్టర్‌లతో పాటు ఇతర సిబ్బంది బృందాలుగా విడిపోయి ఆదివారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. జిల్లా పోలీసుల సహకారంతో జిల్లాలోని 23 ప్రాంతాల్లో సోదాలను నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలోని ఆటోనగర్‌, బాబన్‌సాపహాడ్‌, మాలపల్లి, అర్సపల్లి, నిజాంకాలనీ, పూలాంగ్‌, హస్మీకాలనీ, గుండారం, ఎడపల్లిలోని ఎంఎస్సీ ఫారం, ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌, బోధన్‌లోని రాకాసిపేట, శక్కర్‌నగర్‌ ప్రాంతాల్లో ఎన్‌ఐఏ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 3 గంటల నుంచి 11గంటల వరకు సోదాలు నిర్వహించారు. అనుమానితులకు సంబంధించిన సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్‌ అకౌంట్‌ను పరిశీలించారు. పీఎఫ్‌ఐలో ఎంతకాలంగా సభ్యులుగా ఉన్నారు? ఏయే ప్రాంతాలకు వెళ్లారు? ఎక్కడ శిక్షణ తీసుకున్నారో వంటి అంశాలపై ఆరా తీశారు. 

అధికారుల అదుపులో డిగ్రీ విద్యార్థి

నగరానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థి సమీర్‌ ఈ మధ్యనే కేరళకు వెళ్లి కొన్నిరోజులు ఉండి రావడంతో ఆ విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థికి సంబంధించిన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌ను సీజ్‌ చేశారు. అతని తండ్రికి నోటీసు అందజేయడంతో పాటు ఈ నెల 19న ఎన్‌ఐఏ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో వివరాలు సేకరించడంతో పాటు కొంతమంది పాస్‌పోర్టులను కూడా ఎన్‌ఐఏ అధికారులు సీజ్‌ చేసి తీసుకెళ్లారు. సోదాలపై ఎన్‌ఐఏ అధికారులు మాత్రం మీడియాకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ రీజనల్‌ కార్యాలయం నుంచి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.

జిల్లా కేసుతోనే ఎన్‌ఐఏలో కదలిక

జిల్లా కేంద్రంలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయంలో జరుగుతున్న కార్యకలాపాలపై జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుపైనే ఎన్‌ఐఏ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. కార్యకలాపాలు పెద్దస్థాయిలో ఉండడంతో పూర్తి వివరాలు సేకరించిన అధికారులు.. ఏకకాలంలో ఉభయరాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. జిల్లా పోలీసులు తమకు అందిన సమాచారం ఆధారంగా జూలై 4వ తేదీన నగరం పరిధిలోని గుండారంలో దాడులు నిర్వహించారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరున కార్యకలాపాలు నిర్వహిస్తున్న అబ్దుల్‌ ఖాదర్‌ను అరెస్టు చేశారు. ఆయన ద్వారా వివరాలను సేకరించడంతో పాటు మొత్తం 28 మందిపై కేసు నమోదు చేశారు వీరిలో మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా పేరున కరాటే తరగతులు నిర్వహించడంతో పాటు లీగర్‌ అవేర్‌నెస్‌ క్యాం పులను నిర్వహిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. జిల్లాకు చెందిన యువతతో పాటు జగిత్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, కడప, కర్నూల్‌, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారికి శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మొత్తం 400 మందికి నగరంలోని గుండారం పరిధి లో ఈ శిక్షణను కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తు లో తేల్చారు. కాగా, ఎన్‌ఐఏ అధికారులు రెండు నెలల క్రితం ఆర్మూర్‌లోని జిరాయత్‌నగర్‌లో సోదాలు నిర్వహించి అనుమానిత వ్యక్తికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఎన్‌ఐ ఏ కార్యాలయానికి రావాలని నోటీసులు పంపించారు. తర్వాత విచారణ చేశారు. ఉమ్మడి రాష్ట్రం పరిధిలో ఎవరెవరు శిక్షణ పొందారో వివరాలు సేకరించారు.

ఎన్‌ఐఏకు జిల్లా పోలీసుల సహకారం

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలకు రావడంతో శనివారం అర్ధరాత్రి నుంచే వారికి కావాల్సిన భద్రతను జిల్లా పోలీసులు కల్పించారు. సీపీ నాగరాజు ఆదేశాలకు అనుగుణంగా ఏసీపీ వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్‌ వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పలు పోలీసు స్టేషన్‌ల నుంచి ఎస్‌ఐలు, సీఐలు, ఇతర సిబ్బందిని రప్పించి భద్రత ఏర్పాట్లు చేశారు. సోదాలో జరిగే ఇళ్లవైపు ఎవరూ రాకుండా చూశారు.

నిజామాబాద్‌ కేసుతోనే దర్యాప్తు ముమ్మరం

నిజామాబాద్‌లో జూలై 4న నగర  6వ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసు ఆధారంగానే ఎన్‌ఐఏ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఏకకాలంలో సోదాలను నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. నిజామాబాద్‌లో అబ్దుల్‌ ఖాదర్‌ పీఎఫ్‌ఐ సంస్థ పేరున కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు గుండారంలో వీరికి కావాల్సిన శిక్షణ విడతల వారీగా ఇచ్చారు. కరాటే ట్రైనింగ్‌తో పాటు ఇతర శిక్షణను కూడా వారికి ఇచ్చినట్లు గుర్తించిన పోలీసులు శిక్షణ పొం దినవారి వివరాలను అరెస్టు అయిన వారి ద్వారా సేకరించారు. పీఎఫ్‌ఐ కార్యకలాపాల వెన క ‘సిమి’ ఉండడం, ఇతర ప్రాంతాల నుంచి నిధులు శిక్షణ పొందినవారికి వస్తుండడంతో ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. జిల్లా పోలీ సులు మొదట గుర్తించి శిక్షణ ఇచ్చిన వ్యక్తితో పాటు సహకరించిన ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఒకే సారి దాడులు నిర్వహించడం అది నిజామాబాద్‌ కేంద్రబిందువు కావడం మరోసారి ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా చర్చనీయాంశంగా మారింది. 

తమ కుమారుడికి సంబంధంలేదు : రఫిక్‌, విద్యార్థి తండ్రి

పీఎఫ్‌ఐ కార్యకలాపాలతో తమ కుమారుడికి సంబంధంలేదు. నగరంలో ఓ కళాశాలలో డిగ్రీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. పీఎఫ్‌ఐ సంస్థ నిర్వహించే కరాటే తరగతులకు హాజరయ్యాడు. ఎన్‌ఐఏ అధికారులు ఉదయం 3 గంటలకు వచ్చి తనిఖీ చేసి తమ కొడుకును తీసుకెళ్లారు. తనకు నోటీసు ఇచ్చి ఈ నెల 19న హాజరుకావాలని కోరారు.

Updated Date - 2022-09-19T06:48:24+05:30 IST