నిర్మల్ జిల్లా: పెట్రోల్ దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు

ABN , First Publish Date - 2021-07-14T17:38:50+05:30 IST

టీఆర్ఎస్ సర్పంచ్.. టెక్నికల్‌ అసిస్టెంట్‌పై పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

నిర్మల్ జిల్లా: పెట్రోల్ దాడి ఘటనపై పోలీసుల దర్యాప్తు

నిర్మల్ జిల్లా: టీఆర్ఎస్ సర్పంచ్.. టెక్నికల్‌ అసిస్టెంట్‌పై పెట్రోల్‌ పోసి దాడి చేసిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సాంవ్లీ గ్రామ సర్పంచ్‌ లాయేవార్‌ సాయినాథ్‌‌ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఉపాధి హామీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత  టెక్నికల్ అసిస్టెంట్ రాజు.. బిల్లులు చేయడం లేదన్న కోపంతో సర్పంచ్ అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


పూర్తి వివరాలు...

ఉపాధి హామీ పథకం కింద తాను చేసిన పనులకు బిల్లులు చేయడంలేదని ఆగ్రహించి ఓ సర్పంచ్‌.. టెక్నికల్‌ అసిస్టెంట్‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం సాంవ్లీలో మంగళవారం చోటుచేసుకుంది. సాంవ్లీ గ్రామ సర్పంచ్‌ లాయేవార్‌ సాయినాథ్‌ గత మార్చిలో ఉపాధి హామీ పథకం కింద రూ.11 లక్షల విలువైన అభివృద్ధి పనులను కాంట్రాక్టు తీసుకొని చేశాడు. అప్పటినుంచి ఈ పనులకు సంబంధించిన ఎంబీ రికార్డు చేయాల్సిందిగా టెక్నికల్‌ అసిస్టెంట్‌ రాజును కోరుతున్నాడు. అయితే రికార్డులపై గ్రామ కార్యదర్శి సంతకం లేనందున.. తాను ఏమీ చేయలేనని రాజు తిరస్కరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్‌ మంగళవారం మధ్యాహ్నం బాటిల్‌లో పెట్రోల్‌ తీసుకొని కుభీర్‌లోని ఈజీఎస్‌ కార్యాలయానికి వెళ్లాడు.


ఈ సందర్భంగా ఎంబీ రికార్డుల విషయంలో రాజుతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన సర్పంచ్‌ సాయినాథ్‌.. తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను రాజు ఒంటిపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి సిబ్బంది మంటలను ఆర్పివేసి రాజును భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఛాతి, వీపు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని.. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, సర్పంచ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-07-14T17:38:50+05:30 IST