కరోనా పరీక్షలు చేయించుకున్నాకే ఊళ్లోకి రావాలని ఆ యువకుడికి తేల్చి చెప్పడంతో..

ABN , First Publish Date - 2020-07-24T20:07:00+05:30 IST

కరోనా విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలో నిర్ధారణ పరీక్షలు జరిపే వారు లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులు చనిపోయినా, ప్రాణాపాయస్థితిలో ఉన్నా పరీక్షలు నిర్వహించడం లేదు.

కరోనా పరీక్షలు చేయించుకున్నాకే ఊళ్లోకి రావాలని ఆ యువకుడికి తేల్చి చెప్పడంతో..

నిర్ధారణ పరీక్షలు కైసా కరోనా?

ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు, పీహెచ్‌సీలో ల్యాబ్‌ టెక్నీషీయన్ల కొరత

పూర్తి లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహిస్తున్న వైనం

ఆందోళన చెందుతున్న జిల్లా ప్రజలు


దుబ్బాక(సిద్దిపేట): కరోనా విజృంభిస్తున్న తరుణంలో జిల్లాలో నిర్ధారణ పరీక్షలు జరిపే వారు లేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులు చనిపోయినా, ప్రాణాపాయస్థితిలో ఉన్నా పరీక్షలు నిర్వహించడం లేదు. జిల్లాలో కేవలం రెండు కేంద్రాలకే ర్యాపిడ్‌ టెస్టుల కిట్లు, ఆర్‌టీపీసీఆర్‌లకు పరిమితం చేశారు. ఆ రెండు కేంద్రాల్లో కూడా ల్యాబ్‌ టెక్నీషీయన్ల కొరతతో నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం వెయ్యి ర్యాపిడ్‌ టెస్టు కిట్లనే పంపిణీ చేశారు. వాటితో పరీక్షలు చేస్తే సుమారు 96 మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ కిట్లు కూడా మంగళవారమే అయిపోవడంతో ర్యాపిడ్‌ టెస్టులు నిలిచిపోయాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వచ్చిన 10 కిట్లతో పదిమందికి పరీక్షలు జరిపి చేతులు దులుపుకున్నారు. 


జిల్లా వ్యాప్తంగా 17 మందే ల్యాబ్‌ టెక్నీషన్లు 

జిల్లాలో 32 పీహెచ్‌సీలు, రెండ్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లుండగా కేవలం 17 మంది ల్యాబ్‌ టెక్నీషీయన్లు మాత్రమే ఉన్నారు. దీంతో వారినే సిద్దిపేట మెడికల్‌ కళాశాల, గజ్వేల్‌ జిల్లా ఆసుపత్రిల్లో పరీక్షల నిర్వహణకు వంతుల వారిగా నియమిస్తున్నారు. రోజుకు నలుగురు చొప్పున పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆ నలుగురిని కూడా ఐదు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యావసర పరిస్థితిలో పీహెచ్‌సీలకు ల్యాబ్‌ టెక్నీషీయన్లు వచ్చినా కూడా ఆర్‌టీపీసీఆర్‌ల పరీక్ష చేసే వారుండరు. దీంతో సిద్దిపేట, గజ్వేల్‌కు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించకుండానే పంపిస్తున్నారు. దుబ్బాకకు చెందిన ఓ యువకుడు అత్యవసర పరిస్థితిలో సిద్దిపేట మెడికల్‌ కళాశాలకు వెళ్లగా.. రాత్రి వేళ పరీక్షలు జరిపేవారు లేరని చెప్పారు. పరీక్షలు జరపనిదే రావొద్దని గ్రామస్థులు చెప్పడంతో రాత్రంతా అక్కడే జాగరణ చేశాడు. మరుసటి రోజు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లగా, ఐసోలేషన్‌లో చేర్చుకుని, పరీక్షలు నిర్వహించారు. 


లక్షణాలున్నాయా?.. ఇంట్లోనే చికిత్స పొందండి

కరోనా లక్షాలున్న వారికి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే ఇంట్లో ఉండి చికిత్స పొందాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తిస్థాయి చికిత్సను ఫోన్‌ ద్వారా అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే, తమకు సోకింది కరోనా? సీజనల్‌ వ్యాధా? తెలిసేదెలా అని రోగులు వాపోతున్నారు.


దుబ్బాకలో పలు కుటుంబాలకు నిర్ధారణ పరీక్షలు కరువు

దుబ్బాకలోని ఒక నాయకుడికి కరోనా పాజిటివ్‌ వస్తే, కుటుంబ సభ్యులు నిర్ధారణ పరీక్షలు చేయలేదు. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులందరూ క్వారైంటెన్‌లో ఉండి, పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డారు. ఓ వృద్ధుడు మరణిస్తే, అతడి కుటుంబ సభ్యులకు నిర్ధారణ పరీక్షలు జరుపలేదు. పీహెచ్‌సీ సిబ్బంది మాత్రమే ఆ ప్రాంతంలో సర్వే నిర్వహించి, వీధిలోని ప్రజలకు సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి జిల్లాలో నిర్ధారణ పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-24T20:07:00+05:30 IST