Abn logo
Sep 14 2021 @ 18:43PM

రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు: బీజేపీ సెటైర్లు

లఖ్‌నవూ: రాజకీయాల్లో రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని భారతీయ జనతా పార్టీ నేత గౌరవ్ భాటియా ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై మంగళవారం ఆయన స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా యోగి వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘యోగి ఎలాంటి ధ్వేషాన్ని ప్రచారం చేస్తారు?’’ అనే అర్థంలో ట్వీట్ చేశారు. అనంతరం దీనిపై వెంటనే యోగి మద్దతుదారులు రాహుల్‌పై ప్రతిదాడికి దిగారు.


‘‘రాజకీయాల్లో రాహుల్ గాంధీని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోరు. అల్లర్లను ద్వేషించేవారు, అవినీతిపరులను ద్వేషించేవారు, ఉగ్రవాదులను ద్వేషించేవారు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడతారు. అలా చేసే వ్యక్తి యోగి ఆదిత్యానాథ్’’ అని గౌరవ్ భాటియా అన్నారు. నిజానికి యోగి చేసిన ‘అబ్బా జాన్’ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సహా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


ఖుషినగర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ‘‘2017కు ముందు అందరికీ రేషన్ అందేది కాదు. అబ్బా జాన్ అనే వాళ్లు రేషన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆగలేదు. ఖుషినగర్ నుంచి రేషన్ సరుకులు నేపాల్, బంగ్లాదేశ్‌లకు తరలుతున్నాయి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. అక్రమ దారిలో రేషన్ తినేవారిని జైలుకు పంపిస్తున్నాం’’ అని యోగి అన్నారు.