కాలేయ మార్పిడి చికిత్సతో ఇబ్బందులుండవు

ABN , First Publish Date - 2021-10-22T06:13:04+05:30 IST

కాలేయ మార్పిడి చికిత్సతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని చెన్నై గ్లోబల్‌ హెల్త్‌ సిటీ కాలేయక వైద్య నిపుణుడు డాక్టర్‌ రజనీకాంత్‌ అన్నారు.

కాలేయ మార్పిడి చికిత్సతో ఇబ్బందులుండవు
కాలేయ మార్పిడి చేసుకున్న వారితో మాట్లాడుతున్న డాక్టర్‌ రజనీకాంత్‌

తిరుపతి సిటీ, అక్టోబరు 21: కాలేయ మార్పిడి చికిత్సతో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని చెన్నై గ్లోబల్‌ హెల్త్‌ సిటీ కాలేయక వైద్య నిపుణుడు డాక్టర్‌ రజనీకాంత్‌ అన్నారు. గురువారం కాలేయ వ్యాధులకు సంబంధించి తిరుపతిలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మద్యం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడంతో పాటు హెపటైటిస్‌ బీ, సీ వంటి వైర్‌సల వల్ల కాలేయ వ్యాధులు వస్తాయన్నారు. ముందుగానే గర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రమాదం ఉండదన్నారు. కాలేయం పూర్తిగా దెబ్బతింటే మార్చుకోవాలని, లేకపోతే ప్రాణాపాయం తప్పదన్నారు. రోగి రక్త సంబంధీకులు ఎవరైనా సగం కాలేయం దానం చేయవచ్చని, కాల క్రమేణా దాతతో పాటు గ్రహీతకు కూడా కాలేయం యథావిధిగా పూర్తి పునఃనిర్మాణం జరుగుతుందని వివరించారు. ఇద్దరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉండవని స్పష్టం చేశారు. నెలలు వయసున్న చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా కాలేయ మార్పిడి చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాలేయ మార్పిడి చేసుకున్న రోగులు, దాతల జీవనం ఎలా ఉందనేది వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T06:13:04+05:30 IST