గాళ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి.. కప్పిపుచ్చుకునేందుకు డ్రామా ఆడి అడ్డంగా దొరికిన జర్నలిస్ట్

ABN , First Publish Date - 2021-06-26T21:27:34+05:30 IST

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. అంటూ ఆ జర్నలిస్టు ఇప్పుడు విచారంగా పాడుకుంటున్నాడు. ఫేస్‌బుక్‌లో

గాళ్ ఫ్రెండ్ ఇంటికెళ్లి.. కప్పిపుచ్చుకునేందుకు డ్రామా ఆడి అడ్డంగా దొరికిన జర్నలిస్ట్

న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. అంటూ ఆ జర్నలిస్టు ఇప్పుడు విచారంగా పాడుకుంటున్నాడు. ఫేస్‌బుక్‌లో అనవసర పోస్టులు ఎంత రచ్చకు దారితీస్తాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. యూపీ నోయిడాలోని హిందీ న్యూస్ చానల్ ‘ఖబర్’‌కు అతుల్ అగర్వాల్ ఎడిటర్-ఇన్-చీఫ్. ఈ నెల 19న తన పేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఐదుగురు దుండగులు తన కారును అడ్డగించి తన వద్దనున్న రూ. 5-6 వేలు లాక్కున్నారంటూ పెద్ద పోస్టు పెట్టాడు. 


అతుల్ అగర్వాల్ ఓ చానల్‌లో అత్యున్నత పోస్టులో ఉండడం, పైగా దోపిడీ అని చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై అతుల్ ఫిర్యాదు చేయనప్పటికీ దర్యాప్తు మొదలుపెట్టారు. సుమోటోగా దారిదోపిడీ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగరాన్ని జల్లెడపట్టారు. అతుల్ తిరిగిన ప్రదేశాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చూసి షాకయ్యారు. ఫుటేజీలు పరిశీలించిన అనంతరం అతుల్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నది పూర్తి అబద్ధమని తేల్చారు.


దోపిడీ జరిగినట్టు చెబుతున్న రోజు సాయంత్రం అతుల్ తాను పనిచేస్తున్న స్టూడియో బయటకు వచ్చి నేరుగా తన గాళ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ దాదాపు నాలుగు గంటలు గడిపిన తర్వాత ఆజ్‌తక్ చానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న తన భార్య చిత్ర త్రిపాఠి నుంచి ఫోన్ రావడంతో హడావుడిగా అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అలా వచ్చిన అతుల్ ఇంటికి వెళ్లకుండా అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో గాళ్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఓయూ రూమ్ బుక్ చేసినట్టు చెప్పాడు. ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. హోటల్ సీసీటీవీ ఫుటేజీలో అతుల్ హోటల్‌లో వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 


అతుల్ ఫేస్‌బుక్ పోస్టు పూర్తిగా ఫేక్ అని తేల్చిన పోలీసులు అతడు ఎందుకలాంటి పోస్టు పెట్టి ఉంటాడన్న దానిపై విచారణ ప్రారంభించారు. అయితే, వ్యక్తిగత కారణాలు కానీ, కుటుంబ పరమైన కారణాల వల్ల కానీ అతడు ఆ పోస్టు పెట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, అతుల్ మాత్రం తన ఫేస్‌బుక్ పోస్టు నిజమేనని చెబుతున్నాడు. పోలీసుల దర్యాప్తుపై మాత్రం పెదవి విప్పలేదు. మరోవైపు, అతుల్ ఫేస్‌బుక్ పోస్టు, దానిపై పోలీసుల విచారణ సోషల్ మీడియాకెక్కడంతో ఈ కథ విపరీతంగా వైరల్ అయింది. ఫన్నీ పోస్టులతో కడుపుబ్బా నవ్వించే కామెంట్లు చేస్తూ రచ్చ చేశారు.



Updated Date - 2021-06-26T21:27:34+05:30 IST

News Hub