Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 3 2021 @ 17:26PM

భారత్-పాక్ సంబంధాల్లో మార్పు క్షణాల్లో రాదు : ఆర్మీ చీఫ్

న్యూఢిల్లీ : భారత దేశం, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు రాత్రికి రాత్రే మారిపోవని భారత సైన్యం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే చెప్పారు. ఇరు దేశాల మధ్య అపనమ్మకం, అనుమానం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని ఏర్పరచుకోవడం కోసం పాకిస్థాన్ మన దేశంలోకి ఉగ్రవాదులను పంపించడం మానుకోవాలని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. నమ్మకాన్ని పెంచుకోవలసిన బాధ్యత పూర్తిగా పాకిస్థాన్‌పైనే ఉందన్నారు. 


నరవణే జమ్మూ-కశ్మీరులో భద్రత పరిస్థితులను గురువారం సమీక్షించారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేయడానికి తీసుకుంటున్న చర్యలను స్థానిక కమాండర్లు ఆయనకు వివరించారు. ఆయన సైనికులతో మాట్లాడారు. కార్యకలాపాలకు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నందుకు సైనికులను ప్రశంసించారు. 


జనరల్ నరవణే ఇటీవల మాట్లాడుతూ, భారత దేశంతో సంత్సంబంధాలను కోరుకుంటే ముందుగా ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ నాశనం చేయాలని చెప్పారు. కాల్పుల విరమణను ఇరు దేశాల సైన్యాలు పాటిస్తుండటం నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి భద్రత విషయంలో మంచి పరిణామమని తెలిపారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని రెచ్చగొట్టే విధానాలను పాకిస్థాన్ విడనాడాలన్నారు. భారత దేశం లేవనెత్తుతున్న ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.  


Advertisement
Advertisement