Abn logo
Mar 26 2020 @ 01:50AM

గడప దాటని భారత్‌

90% ప్రజలు ఇంట్లోనే.. సామూహిక వ్యాప్తి లేదు..

మృతులు 10.. కేసులు 606

న్యూఢిల్లీ, మార్చి 25: కరోనా కట్టడికి దేశమంతా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో జనజీవనం  స్తంభించిపోయింది. పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. నిత్యావసరాల నిమిత్తం ప్రజలు ఉదయం వేళ పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చినా తరువాత సద్దుమణిగింది. పోలీసు శాఖల అంచనాల ప్రకారం 90 శాతం ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటిదాకా వ్యాధి బారిన పడి 10 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ 65 ఏళ్ల మహిళ, తమిళనాడులోని మదురైలో ఓ 54 ఏళ్ల వ్యక్తి, అహ్మదాబాద్‌కు చెందిన ఓ 85 ఏళ్ల మహిళ కూడా చనిపోయినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా దానిని కేంద్రం ఇంకా ధ్రువీకరించలేదు. ఈ మూడూ గనక కలుపుకుంటే  మరణాల సంఖ్య 13కు పెరుగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 606కు పెరిగింది.


ఇందులో 564 మంది భారతీయులు కాగా, 42 మంది విదేశీయులు. మహారాష్ట్రలో వైరస్‌ ఉధృతంగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇంతవరకూ ముగ్గురు మరణించగా, కేసుల సంఖ్య 128కు పెరిగింది. కేరళ (112) తరువాతి స్థానంలో ఉంది. కాగా, కర్ణాటకలో ఒక్కరోజే 10 మందికి కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 51కి పెరిగింది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 519 మందికి వైరస్‌ సోకగా - ఒక్క రోజులోనే 87 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో తాజాగా తేలిన ఆరు పాజిటివ్‌ కేసుల్లో ఓ జర్నలిస్టు కూడా ఉన్నాడు. ఈయన ఈనెల 20న భోపాల్‌లో అప్పటి సీఎం కమల్‌నాథ్‌ ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌కు హాజరుకావడంతో అదే రూమ్‌లో ఉన్న అనేకమంది మీడియా సిబ్బంది ఇపుడు ఆందోళనలో ఉన్నారు.


ఈ జర్నలిస్టు భార్యకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌ ఉంది. కరోనా అనుమానితులను పరీక్షించేందుకు దేశమంతటా 118 ల్యాబరేటరీలు పనిచేస్తున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. అదే విధంగా 16,000 శాంపిల్‌ సేకరణ కేంద్రాలున్న 29 ప్రైవేటు ల్యాబ్‌లు కూడా రిజిస్టర్‌ చేసుకున్నాయని వెల్లడించింది. వైరస్‌ సామూహిక వ్యాప్తి ఎక్కడా లేదని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ అమలవుతున్నంత కాలం అంటే ఏప్రిల్‌ 14వ తేదీ రాత్రి దాకా దేశంలోని జాతీయ రహదారులపై టోల్‌ వసూలును నిలిపేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు- సిబ్బంది కనీస దూరం మధ్య పనిచేసేందుకు వీలుగా బ్యాంకులు వివిధ పనివేళలను అనుసరిస్తున్నాయి. ఉదయం 8-11 మధ్య కొందరు, 11-2 గంటల మధ్య మరో షిఫ్టు, 2 నుంచి సాయంత్రం 6 గంటల దాకా మరో షిఫ్టు పనిచేస్తున్నామని స్టేట్‌బ్యాంకు ఎండీ పీకే గుప్తా తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి నిధులను (ఎంపీలాడ్స్‌) వైరస్‌ సంబంధిత వైద్య చికిత్సలకు, టెస్టింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు ఖర్చు చేయవచ్చని కేంద్రం సూచించింది. సామాజిక దూరాన్ని ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, అపుడే వైర్‌సను నిర్మూలించగలుగుతామని ఆర్‌ఎ్‌సఎస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ సూచించారు. సంక్షోభ సమయంలో కొత్త వత్సరంలోకి అడుగుపెట్టామన్నారు. 


రూ.లక్షన్నర కోట్ల కరోనా ఉద్దీపనం!

కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నందున దెబ్బతిన్న పరిశ్రమలను, పేదలను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.5 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని సిద్ధం చేస్తోంది. ఈ ప్యా కేజీ పరిమాణంపై పీఎంవో, ఆర్థికశాఖ, రిజర్వుబ్యాంకు అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ వారం చివర్లో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్నాయి. లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న 10కోట్ల మంది పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేయడంతోపాటు నష్టపోయిన పరిశ్రమలకు సాయం అందిస్తారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న రుణ సమీకరణ(రూ.7.8 లక్షల కోట్లు)ను పెంచే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేసి లిక్విడిటీ అందించాల్సిందిగా కేంద్రం ఆర్బీఐని కోరినట్లు తెలిసింది. 

Advertisement
Advertisement
Advertisement