ఏడాదైనా పైసా ఇవ్వలేదు

ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST

అది ఎగువ సగిలేరు ప్రాజెక్టు.. దాదాపు 13 వేల ఎకరాలకు సాగు నీరందించే సామర్థ్యం ఉంది. వరుస కరువులతో సతమతమయ్యే బద్వేలు రైతాంగానికి సగిలేరు ప్రాజెక్టు ఆ ప్రాంత రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చేది. అయితే అంతటి ప్రాధాన్యత గల ప్రాజెక్టుపై

ఏడాదైనా పైసా ఇవ్వలేదు

 సగిలేరు ప్రాజెక్టుకు గేట్లు పెట్టేదెన్నడో!

 తాత్కాలిక మరమ్మతులతోనే సరి

 కొత్త గేట్ల ఏర్పాటు కోసం రూ.4.93 కోట్లతో ప్రతిపాదనలు


(కడప - ఆంధ్రజ్యోతి): 

అది ఎగువ సగిలేరు ప్రాజెక్టు.. దాదాపు 13 వేల ఎకరాలకు సాగు నీరందించే సామర్థ్యం ఉంది. వరుస కరువులతో సతమతమయ్యే బద్వేలు రైతాంగానికి సగిలేరు ప్రాజెక్టు ఆ ప్రాంత రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చేది. అయితే అంతటి ప్రాధాన్యత గల ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొట్టుకుపోయిన గేట్ల స్థానంలో కొత్త గేట్లు అమర్చేందుకు రూ.4.93 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే ఇంతవరకు ప్రభుత్వం పైసా కూడా విడుదల చేయలేదు. సగిలేరు ప్రాజెక్టు పరిధిలో బి.కోడూరు, బద్వేలు మండలాల్లోని 26 చెరువులకు నీరు అందుతుంది. వర్షాకాలంలో వర్షం నీటితో పాటు తెలుగుగంగ నీటిని కూడా ప్రాజెక్టులో నింపి చెరువులకు నీరు విడుదల చేసేవారు. ప్రాజెక్టు సామర్థ్యం 0.5 టీఎంసీలు. 12,869 హెక్టార్ల ఆయకట్టు ఉంది. 2018 నవంబరు 10న సగిలేరుకు వచ్చిన నీటి ఉధృతికి గేట్లు కొట్టుకుపోయాయు. అప్పట్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇంతవరకు పూర్తి స్థాయిలో గేట్లు ఏర్పాటు చేయలేదు.


ఏడాదైనా పైసా ఏది?

సాఽధారణంగా వర్షాకాలం ప్రారంభంలో నీటి పారుదల శాఖాధికారులు చెరువులు, ప్రాజెక్టులను పరిశీలిస్తారు. తూములు, గేట్లు, కట్ట బలహీనంగా ఉందా, వర్షాలు వచ్చినప్పుడు కోతకు గురి కాకుండా ఉంటుందా అనేది అంచనా వేస్తారు. అప్పట్లో ఈ ప్రాజెక్టును పరిశీలించకపోవడంతో గేట్లు దెబ్బతినడం గుర్తించలేకపోవడంతో అవి కొట్టుకుపోయాయి. కొత్త గేట్ల కోసం ఏడాది క్రితం రూ.4.93 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు పంపించారు.


జిల్లా వాసి సీఎం కావడంతో నిధులు త్వరగా వస్తాయని ఈ ప్రాంత రైతులు ఆశించారు. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. ఎల్‌ఎస్పీ నుంచి నీటిని విడుదల చేస్తే బి.కోడూరు, బద్వేలు మండలాల్లోని చెరువుల పరిధిలోని ఆయకట్టుకు నీరందడంతో పాటు భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ మోటార్ల కింద మరింత పంటలు సాగవుతాయి. అలాగే గ్రామాల్లో నీటి ఎద్దడి కూడా తలెత్తదు. ప్రజాప్రతినిధులు స్పందించి గేట్ల మరమ్మతులకు నిధులు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST