Abn logo
May 3 2021 @ 00:46AM

తిరుపతి ఫలితం చూసి.. కంగుతిన్న వైసీపీ!

‘మూడు’ దాటలేదే!

గెలిచినా వైసీపీకి సంతోషాన్నివ్వని తిరుపతి ఫలితం

జిల్లాలో గతానికంటే వైసీపీకి తగ్గిన ఓట్లు

ఓట్లు తగ్గినా నైతిక విజయం తమదేనంటున్న టీడీపీ 


ఒకరు మూడు లక్షలు మెజారిటీ గ్యారెంటీ అన్నారు..

మరొకరు నాలుగు తప్పదన్నారు..

హబ్బే..అంతేనా ఐదు తప్పదు అన్నారు ఇంకొకరు..

మీరు రావాల్సిన అవసరమే లేకుండా అఖండ విజయం సాధించి మీ చేతుల్లో పెడుతామని సీఎంకి హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే వ్యూహాలు రచించారు. పోలింగ్‌ రోజున తిరుపతిని హోరెత్తించారు. వేలాది మంది అపరిచితులు నగరంలో ఎటు చూసినా కనిపించారు. క్యూల్లో బారులు తీరారు. దొంగ ఓట్లు దందా అంటూ విపక్షాలు గగ్గోలు చేశాయి. క్యూల్లోని వారి దగ్గర నుంచి నకిలీ ఓటరు కార్డులు    పట్టుకున్నారు. దీన్నంతా మీడియా జనం ముందు పెట్టింది. ఇంత చెడ్డపేరును మూటగట్టుకున్నా అధికారపార్టీ నేతలు చెక్కు చెదరలేదు. జంకలేదు. అంతా అబద్ధమనే చెప్పారు. స్వయంగా డిప్యూటీ సీఎం, పోలింగ్‌ ముగిసీ ముగియగానే ఐదు లక్షలు దాటి చూపిస్తాం అని ధీమాగా ప్రకటించారు. తీరా ఆదివారం ఫలితాల జోరు చూశాక మాత్రం కంగుతిన్నారు. మూడంకె కూడా దాటలేదన్న నిరాశ విజయోత్సాహాన్ని నీరుగార్చేసింది. ముందు పలికిన బీరాల మాటల వల్ల గెలిచీ ఓడినంత పనయింది. రేపు ముఖ్యమంత్రి ముందు ఏమవుతుందో అనే బెంగపట్టుకుంది. 


జిల్లాలో వైసీపీకి తగ్గిన ఓట్లు

తిరుపతి(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్ధి 2.71 లక్షల అఖండ మెజారిటీతో గెలిచినా ఆ పార్టీ నేతలకు గొంతులో ఎలక్కాయ ఇరుక్కున్నట్టే అయ్యింది. 2019 ఎన్నికల్లో బల్లి దుర్గాప్రసాద్‌ సాధించిన మెజారిటీకన్నా ఇది ఎక్కువే అయినా, నాయకులు ఆశించినంత ఎక్కువ కాదు. 2019 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఉప ఎన్నికల్లో వైసీపీకి జిల్లాలో ఓట్లు తగ్గాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో 288012 ఓట్లు  ఆ పార్టీ సాధించింది.  ప్రస్తుత ఉప ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 260891. అంటే మునుపటి కంటే 27121 ఓట్లు ఆ పార్టీకి తగ్గిపోయాయి. పోలింగ్‌ శాతం ఆధారంగా చూస్తే 2019 ఎన్నికల కంటే ఎక్కువే అని కనిపిస్తున్నా,  ఓట్ల సంఖ్య పరంగా చూస్తే ఈ తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి మెజారిటీ వచ్చిన తిరుపతిలో ఈసారి  వైసీపీకి మెజారిటీ వచ్చింది. శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో మాత్రం గతానికంటే వైసీపీకి ఆధిక్యత తగ్గింది. శ్రీకాళహస్తిలో గత ఎన్నికల్లో వైసీపీకి 32919 ఓట్లు మెజారిటీ రాగా తాజా ఓట్ల లెక్కింపులో 31469 మెజారిటీ వచ్చింది. సత్యవేడు సెగ్మెంట్‌లో కిందటి ఎన్నికల్లో వైసీపీకి 42196 ఓట్ల మెజారిటీ వస్తే ఇపుడు ఆధిక్యత 38144కు తగ్గిపోయింది.


ఓట్లు తగ్గినా నైతికబలం పెంచుకున్న టీడీపీ

స్థానిక ఎన్నికల బెదిరింపుల బీభత్స భయానక వాతావరణం వెంటాడుతుండగానే జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ కేడర్‌ కకావికలవుతుందని అందరూ భావించినా గట్టి పోటీనే ఇచ్చారని ఫలితాలు నిరూపిస్తున్నాయి. తిరుపతి నగరంలో పోలింగ్‌ రోజు కనిపించిన వాతావరణం చూస్తే టీడీపీ ఓటర్లు బూత్‌లకు రావడానికి కూడా భయపడ్డారని భావించారు. జిల్లా మొత్తం కలిపి చూస్తూ టీడీపీ ఓట్ల శాతం గతంలో కన్నా తగ్గినా, వైసీపీ ప్రకటించుకున్నంత ఆధిక్యత వారికి దక్కకపోవడం ఊరటగా మారింది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో టీడీపీకి 7 శాతానికి పైగా ఓట్లు తగ్గాయి. 2019 ఎన్నికల్లో ఈ మూడు సెగ్మెంట్లలో కలిపి 216475 ఓట్లు పడ్డాయి. ఈ పర్యాయం 148751 ఓట్లకే టీడీపీ పరిమితం అయ్యింది. 67724 ఓట్లు తగ్గాయి. పోలైన ఓట్లలో టీడీపీ ఓట్ల శాతం విషయానికొస్తే 2019లో 39.37 శాతం ఓట్లు రాగా ఇపుడు 32.08 శాతం మాత్రమే అని తేలింది. అంటే గతంకంటే 7.29 శాతం ఓట్లు తగ్గిపోయాయి. ఓట్లు తగ్గినా నైతికంగా పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం కాస్త ఇనుమడించిందనే చెప్పాలి.


జనసేన బలమే బీజేపీ బలం

టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని తాపత్రయపడిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికల్లో అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే గతంతో పోలిస్తే ఉప ఎన్నికల్లో ఓట్ల బలాన్ని మూడురెట్లు పెంచుకుంది. 2019లో బీజేపీకి 9206 ఓట్లు మాత్రమే రాగా ఇపుడు 26992 ఓట్లు సాధించింది. 2019లో పోలైన ఓట్లలో 1.674 శాతం ఓట్లు  సాధించిన ఆ పార్టీ ఈసారి 5.82 శాతం ఓట్లు సాధించింది. గతంతో పోలిస్తే 4.146 శాతం ఓట్లు పెరిగాయి. కాకపోతే ఈ ఓట్లు బీజేపీ సొంత బలంగా చెప్పడానికి లేదు. జనసేన పార్టీ మద్దతు కారణంగానే ఓట్ల శాతం పెరిగిందని అంచనా వేస్తున్నారు.


మరింత బలహీనపడిన కాంగ్రెస్‌

తిరుపతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గతానికంటే కూడా బలహీనపడింది. కిందటి ఎన్నికల్లో ఆ పార్టీకి ఈ మూడు సెగ్మెంట్లలో 12951(2.35 శాతం) ఓట్లు  లభించాయి. ప్రస్తుతం కేవలం 4294 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్లలో 1.06 శాతం ఓట్లే ఈ పార్టీకి పడ్డాయి. మునుపటి కంటే ఓట్ల శాతం 1.29 తగ్గింది. ఓట్ల శాతం ఎలావున్నా పార్టీ అభ్యర్థి చింతా మోహన్‌ మాత్రం ఓటర్లకు కాంగ్రెస్‌ పార్టీని గుర్తు చేయడంతోపాటు ముఖ్యమంత్రి జగన్‌, ప్రధాని మోదీలపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టి ప్రజల్ని ఆకర్షించడంలో విజయం సాధించారు.


వ్రతం చెడ్డా దక్కని ఫలితం

పోలింగ్‌ రోజు ప్రత్యేకించి తిరుపతి సెగ్మెంట్‌లో భారీగానూ, శ్రీకాళహస్తి, సత్యవేడు సెగ్మెంట్లలో ఓ మోస్తరుగానూ దొంగ ఓట్లు వేయించారని వైసీపీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు బస్సులు, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సులు, మినీ బస్సులు, జీపులు, కార్లు... ఇలా వందల సంఖ్యలో వాహనాలు తిరుపతిని చుట్టుముట్టాయి. పీలేరు, చంద్రగిరి, మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం, చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలతో పాటు పొరుగున వున్న కడప జిల్లా నుంచీ కూడా వేల మందిని తిరుపతికి తరలించి దొంగ ఓట్లు వేయించారనే ఆరోపణలు హోరెత్తాయి. ముందుగానే నగరంలో అందబాటులో లేని ఓటర్లను గుర్తించి వారి ఓటరు కార్డులను డౌన్‌లోడ్‌ చేసి నకిలీ ఐడీ కార్డులు తయారు చేసి బయట ప్రాంతాల నుంచీ తీసుకువచ్చినవారికిచ్చి ఓట్లు వేయించారని ప్రత్యర్ధి పార్టీలు ఆరోపించాయి. టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు దొంగ ఓటర్లను తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని కొన్నింటిని పోలీసులకు పట్టించారు. అలాగే ఈ పార్టీల నేతలు పోలింగ్‌ కేంద్రాల వద్ద కూడా పలువురు దొంగ ఓటర్లను అడ్డుకుని పోలీసులకు పట్టించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కళ్యాణమండపం ఆవరణలో వేల మంది బయటి వ్యక్తులుండగా టీడీపీ నేతలు దాని ఎదుట ధర్నాకు దిగారు. 35 వేల నుంచీ 50 వేల మందిని తిరుపతిపతికి తరలించి ఓట్లు వేయించారని విపక్షాలు అంచనా వేశాయి. దీనిపై పక్కా ఆధారాలతో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు, అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చర్యల్లేకపోవడంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్‌ జరపాలని రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు.


పోలింగ్‌ రోజు పరిణామాలతో వైసీపీ ప్రతిష్ట దారుణంగా దెబ్బతిన్నట్టయింది. అయినా సరే ఆశించిన ఆధిక్యత దక్కితే చాలన్న అభిప్రాయంతో ఆ పార్టీ నేతలున్నట్టు చెబుతున్నారు. ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం పక్కాగా అమలు కావడంతో అనుకున్న ఆధిక్యత లభించి తీరుతుందనే ధీమాతో ఉన్నారంటున్నారు. అయితే  వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న చందంగా ఆదివారం ఫలితాలు వెలువడ్డాయి. అధికారంలో వున్న అనుకూలత, ప్రజా సంక్షేమ పథకాలపై పెట్టుకున్న ఆశలు, అంతిమంగా దొంగ ఓట్లపై అంచనాలూ... అన్నీ కలగలిపినా కూడా వైసీపీకి ఉప ఎన్నికల్లో ఆశించిన మెజారిటీ కాదుకదా కనీసం అందులో తొలిమెట్టు కూడా ఎక్కలేకపోయింది. మొట్టమొదట ప్రకటించిన 3 లక్షల మెజారిటీకి కూడా చేరువ కాలేక 2.71 లక్షల ఓట్ల ఆధిక్యత వద్దే ఆగిపోయింది.

పార్టీ 2019లో ఓట్లు శాతం 2021లో ఓట్లు శాతం ఓట్ల తేడా శాతం తేడా

------------------------------------------------------------------------------------------ 

టీడీపీ 216475 39.37 148751 32.08 -67724 -7.29

వైసీపీ 288012 52.38 260891 56.26 -27121 +3.88

బీజేపీ   9206 1.674 26992 5.82 +17786 +4.146

కాంగ్రెస్‌ 12951 2.35   4924 1.06 -8027 -1.29

గురుమూర్తి, వైసీపీ


ఈ విజయం అందరిది 

తిరుపతి ఉప ఎన్నికల గెలుపు అందరిది. సీఎం  జగన్‌ పరిపాలనా దక్షతకు ఈ గెలుపే నిదర్శనం. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపనూ తాకాయి. ప్రజలంతా సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకున్నారు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు.

పనబాక లక్ష్మి, టీడీపీ అభ్యర్థి


నైతిక విజయం మాదే

తిరుపతి ఉప ఎన్నికల్లో నైతిక విజయం మాదే. టీడీపీకి వచ్చిన ఓట్లన్నీ ప్రజాస్వామ్యయుతంగానే వచ్చాయని ప్రమాణం చేస్తా, వైసీపీ నాయకులు ప్రమాణం చేయగలరా? ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి ఎన్నికలు మొదటిసారి చూస్తున్నా.

రత్నప్రభ, బీజేపీ అభ్యర్థి


గతంలో కంటే మేం బలపడ్డాం

గత ఎన్నికల్లో ఐదవ స్థానంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో మూడవ స్థానానికి ఎదిగింది. వైసీపీ దారుణంగా రిగ్గింగుకు పాల్పడకుండా వుంటే మరిన్ని ఓట్లు సాధించి ఉండేవాళ్లం. కరోనా కారణంగా పోలింగ్‌ శాతం తగ్గడం కూడా మా ఓట్లను తగ్గించింది.


పార్టీ    అభ్యర్థి          ఓట్లు     శాతం

వైసీపీ   గురుమూర్తి    6,26,108    (56.7)

టీడీపీ   పనబాక లక్ష్మి   3,54,516    (32.1)

బీజేపీ   రత్నప్రభ       57,080      (5.2)

కాంగ్రెస్‌  చింతా మోహన్‌ 9,585      (0.9)

సీపీఎం  యాదగిరి       5,977      (0.5)


ఇతరులు ....          35,992        (3.3)

నోటా                    15568          (1.4)


 

ఇవి కూడా చదవండిImage Caption

సగం ఫ్యాన్‌వైపే!

Advertisement