ఉంచుతారో..లేదో!

ABN , First Publish Date - 2021-06-24T04:54:09+05:30 IST

జిల్లాలో ఒంటరి మహిళ, వితంతు పింఛన్‌దారులకు కొత్త చిక్కు వచ్చింది. కొంతమంది ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లాయని... మరోసారి అర్హత పత్రాలు సమర్పించాలంటూ అధికారులు 11,871 మందికి నోటీసులు జారీచేశారు. దీంతో వారంతా తమ పింఛన్లు తొలగిపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల కింద మొత్తం 3,81,006 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వితంతు పింఛన్లు 1,30,444 మంది, ఒంటరి మహిళ పింఛన్లు 11,504 మంది పొందుతున్నారు. వీరిలో 11,871 మందికి సంబంధించి ధ్రువపత్రాల్లో తప్పులు ఉన్నాయని, మరోసారి అర్హత నిర్ధారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఉంచుతారో..లేదో!
పింఛన్లు కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు (ఫైల్‌)

 జిల్లాలో 11,871 మందికి నోటీసులు

 ధ్రువపత్రాలు మళ్లీ సమర్పించాలని ఆదేశం

 ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు 

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలో ఒంటరి మహిళ, వితంతు పింఛన్‌దారులకు కొత్త చిక్కు వచ్చింది. కొంతమంది ధ్రువపత్రాల్లో తప్పులు దొర్లాయని... మరోసారి అర్హత పత్రాలు సమర్పించాలంటూ అధికారులు 11,871 మందికి నోటీసులు జారీచేశారు. దీంతో వారంతా తమ పింఛన్లు తొలగిపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల కింద మొత్తం 3,81,006 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వితంతు పింఛన్లు 1,30,444 మంది, ఒంటరి మహిళ పింఛన్లు 11,504 మంది పొందుతున్నారు. వీరిలో 11,871 మందికి సంబంధించి ధ్రువపత్రాల్లో తప్పులు ఉన్నాయని, మరోసారి అర్హత నిర్ధారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పింఛనుదారుల ఆధారాలను పునఃపరిశీలించి అప్‌లోడ్‌ చేయాలని సచివాలయ సంక్షేమాధికారులు, వీఆర్వోలకు సూచించారు. ఈ  మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. 11,871 మంది ఒంటరి మహిళ, వితంతు పింఛన్‌దారులకు నోటీసులు జారీచేశారు. 15 రోజుల్లోగా ధ్రువపత్రాలు సమర్పించి.. అర్హత నిర్థారించుకోవాలని సూచించారు. దీంతో పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత పత్రాల కోసం, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డుల్లో మార్పుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్‌ కార్డుల్లో పేర్ల తొలగింపు ప్రక్రియను వీఆర్వోలు జాప్యం చేస్తున్నారని, సచివాలయ సిబ్బంది వివిధ సవరణల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సచివాలయాలు, ఇతర కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


అభ్యంతరాలు ఇవే..: 

- వితంతు పింఛను పొందుతున్న వారిలో ఎక్కువ మంది భర్త మరణ ధ్రువీకరణ పత్రం పొందుపరిచి.. సామాజిక పింఛన్లు పొందారు. రేషన్‌ కార్డుల్లో మాత్రం భర్త పేరు తొలగించలేదు. ఆయన పేరుతోనూ రేషన్‌ పొందుతున్నారు. 

- పింఛను పొందుతున్న కొందరు ఒంటరి మహిళల రేషన్‌ కార్డుల్లో వారి కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. అటువంటి వారికి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారు. 

- దంపతులిద్దరూ వృద్ధాప్య పింఛను పొందుతున్నా.. ఆధార్‌ అనుసంధానంలో తప్పులు దొర్లినా, ఇతర సాంకేతిక కారణాలు తెలుపుతూ పలువురికి నోటీసులు ఇచ్చారు. 

- అభ్యంతరాల నోటీసులను ప్రభుత్వం నేరుగా ఎంపీడీవోలకు, సచివాలయాలకు పంపించింది. వాటిని సచివాలయ సంక్షేమ అధికారులు, వీఆర్వోలు పరిశీలించి, మార్పులు, చేర్పులు చేయాలి. మళ్లీ ఈకేవైసీ చేయించి ఈ నెల 23లోగా అప్‌లోడ్‌ చేయాలి.  అనంతరం ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్ల లాగినఫ ద్వారా ఆమోదం తెలిపి, ఈ నెల 25 నాటికి ప్రభుత్వానికి పంపుతారు. ఆపై రాష్ట్రస్థాయిలో వాటికి ఆమోదం లభించనుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎవరి పింఛన్లూ నిలపలేదని, కేవలం పునఃపరిశీలన చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.  


అర్హులందరికీ అందజేస్తాం : 

నోటీసులు జారీ చేసిన లబ్ధిదారులంతా సరైన ధ్రువపత్రాలు సచివాలయంలో సమర్పించాలి. వాటిని ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్‌ ఆమోదించిన తర్వాత పింఛన్లు అందజేస్తాం. ఈ నెల సాధ్యం కాకపోతే వచ్చే నెలలో కూడా ధ్రువపత్రాలు సమర్పించవచ్చు. అర్హులందరికీ పింఛన్లు అందజేస్తాం.  

- బివివి.దొర, సామాజిక పింఛన్ల ఏవో, శ్రీకాకుళం

Updated Date - 2021-06-24T04:54:09+05:30 IST