ధాన్యం సేకరణలో నంబర్‌ వన్‌

ABN , First Publish Date - 2020-05-29T10:32:44+05:30 IST

వరి దిగుబడి ధాన్యం సేకరణలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణాకే తలమానికంగా నిలుస్తున్నది.

ధాన్యం సేకరణలో నంబర్‌ వన్‌

తెలంగాణాకే తలమానికం 

రాష్ట్రంలో సేకరించిన ధాన్యంలో 21 శాతం  ఉమ్మడి జిల్లా జిల్లాదే..

ఇప్పటికే 11.81 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ 


(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

వరి దిగుబడి ధాన్యం సేకరణలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా తెలంగాణాకే తలమానికంగా నిలుస్తున్నది. భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) యాసంగిలో వరి ధాన్యాన్ని సమకూర్చిపెట్టడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిస్తే రాష్ట్రంలో కరీంనగర్‌ ఆ స్థానాన్ని దక్కించుకున్నది. దేశంలో ఎఫ్‌సీఐ 91.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు 83.01 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించింది. ఇందులో తెలంగాణ నుంచే 63శాతం ధాన్యం ఎఫ్‌సీఐకి సమకూరింది. రాష్ట్రం నుంచి 52.23 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐకి ఇవ్వగా అందులో 21 శాతం ధాన్యం ఉమ్మడి జిల్లా సమకూర్చింది. ఇప్పటి వరకు కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 11.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నారు. ఇది ఎఫ్‌సీఐ కొన్న ధాన్యంలో ఏడో వంతు (14.25 శాతం) కావడం విశేషం. రాష్ట్రంలో అత్యధిక వరి ధాన్యాన్ని పండించడమే కాకుండా బియ్యం వ్యాపారంలో అగ్రగామిగా నిలిచే ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డును కరీంనగర్‌ బ్రేక్‌ చేసింది. 


కాళేశ్వరం నీరు అందుబాటులోకి రావడంతో..

కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందుబాటులోకి వచ్చి శ్రీరాంసాగర్‌ ఆయకట్టుకు నీటి లభ్యత పెరగడం, రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా చేరడంతో యాసంగి పంట కరీంనగర్‌లో సిరులను పండించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ సీజన్‌లో 16.46 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా రైతులు మార్కెట్‌కు 12.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తెస్తారని అంచనా వేశారు. ఇప్పటికే అక్కడ 11.70 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 11లక్షల 81వేల 926 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు పూర్తయింది. ముందుగా అంచనా వేసిన మేరకు జిల్లాలో 17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో సుమారు 4 లక్షల మెట్రిక్‌ టన్నులు విత్తన ధాన్యం కాగా, మిగతావి రైతుల అవసరాల కోసం ఉంచుకుంటారని, సుమారు మరో లక్ష టన్నులు మార్కెట్‌కు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.  


ఉమ్మడి జిల్లాలో 1,228 కొనుగోలు కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం 1,228 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 2,04,241 మంది రైతుల నుంచి 2,168 కోట్ల 62 లక్షల విలువ చేసే 11,81,926 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు లక్షా 24 వేల 672 మంది రైతులకు 1,250 కోట్ల 25 లక్షల రూపాయలు చెల్లించారు. ఇంకా 79,569 మంది రైతులకు 918 కోట్ల 83 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. కొనుగోళ్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం అవుతున్నందు వల్ల డబ్బు చెల్లింపులో కొంత ఆలస్యమవుతున్నది. కరీంనగర్‌ జిల్లాలో 583 కోట్ల 38 లక్షలు, జగిత్యాల జిల్లాలో 681 కోట్ల 67 లక్షలు, పెద్దపల్లి జిల్లాలో 538 కోట్ల 094 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 364 కోట్ల 63 లక్షల రూపాయల విలువైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటి వరకు కొనుగోలు చేసిన 10,177 కోట్ల విలువ చేసే వరి ధాన్యంలో 2,168 కోట్ల విలువ చేసే ధాన్యం కరీంనగర్‌ జిల్లాదే కావడం విశేషం.

   

దేశానికే తిండి పెట్టే స్థాయికి ఎదిగాం... : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే తిండిపెట్టే స్థాయికి ఎదిగింది. ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం అవుతున్నా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో   10,167 కోట్ల వరిధాన్యం కొనుగోలు చేశాం. భారత ఆహార సంస్థకు అత్యధిక వరి ధాన్యాన్ని సమకూర్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణలో కరీంనగర్‌ ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణం.


కాళేశ్వరం తొలి ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి...రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేధస్సుతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. జిల్లాలో రికార్డుస్థాయిలో వరి ధాన్యం పండింది. దేశానికి వరి విత్తనాలను అందించడంలో కూడా కరీంనగర్‌ అగ్రగామిగా నిలుస్తున్నది. ఇప్పటికే జిల్లాలోని హుజురాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ విత్తనోత్పత్తిలో ముందున్నది. రాబోయే రోజుల్లో కరీంనగర్‌ సీడ్‌ బౌల్‌గా రూపుదాల్చనున్నది. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కరీంనగర్‌ వేదిక కానున్నది. 

Updated Date - 2020-05-29T10:32:44+05:30 IST