అంబులెన్స్‌లో ఆర్తనాదాలు.. ఆక్సిజన్‌ బెడ్లు లేక ఓ నర్సు నరకయాతన

ABN , First Publish Date - 2020-08-05T18:23:32+05:30 IST

అంబులెన్స్‌లో నర్సు మృత్యువుతో పోరాడుతున్నా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా.. ఏ ఒక్కరూ వినిపించుకోరు.. ఇదేం పర్యవేక్షణ? బెడ్లు ఖాళీ లేవని.. ఆస్పత్రులు, కొవిడ్‌ సెంటర్ల చుట్టూ తిప్పుతారు.. ఎక్కడున్నాయో కూడా.. ఎవ్వరికీ తెలియదా? ప్రైవేట్‌ సిలిండర్‌ తెప్పించుకుని.

అంబులెన్స్‌లో ఆర్తనాదాలు.. ఆక్సిజన్‌ బెడ్లు లేక ఓ నర్సు నరకయాతన

అనంతలో మారని పర్యవేక్షణ

అంబులెన్స్‌లోనే ప్రైవేట్‌గా ఏర్పాటు చేసుకుని నిరీక్షణ

సోషల్‌ మీడియాలో వీడియో హల్‌చల్‌

అధికారులు ఉరుకులు పరుగులు.. జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స


అనంతపురం (ఆంధ్రజ్యోతి): అంబులెన్స్‌లో నర్సు మృత్యువుతో పోరాడుతున్నా.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా.. ఏ ఒక్కరూ వినిపించుకోరు.. ఇదేం పర్యవేక్షణ? బెడ్లు ఖాళీ లేవని.. ఆస్పత్రులు, కొవిడ్‌ సెంటర్ల చుట్టూ తిప్పుతారు.. ఎక్కడున్నాయో కూడా.. ఎవ్వరికీ తెలియదా? ప్రైవేట్‌ సిలిండర్‌ తెప్పించుకుని.. నర్సుకు అంబులెన్స్‌లోనే  ఆక్సిజన్‌ అందిస్తున్నా.. భర్త, కొడుకు నరకయాతన అనుభవిస్తున్నా.. అధికారులు, వైద్యులు మాత్రం పట్టించుకోరు.. ఇదేమి పర్యవేక్షణ? ఇదెక్కడి వైద్యం?


జిల్లాలో కరోనా బాధితుల ఆర్తనాదాలు ఆగడంలేదు. సోమవారం ఆరోగ్యశాఖ మంత్రి కరోనా బాధితులకు వసతులు, వైద్యసేవలపై సమీక్ష నిర్వహించారు. ఆ సమయంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి జిల్లాలో కొవిడ్‌ ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోగ్య మంత్రికి వివరించారు. దీంతో ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని సైతం అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదనీ, ప్రతి కరోనా బాధితుడికీ సరైన వసతి, వైద్యం, నాణ్యమైన ఆహారం అందాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశించి, వెళ్లారు. మరుసటిరోజే మంగళవారం జిల్లా కేంద్రంలో ఓ కరోనా పాజిటివ్‌ బాధిత కుటుంబం పడిన కష్టం అందర్నీ కలచివేసింది. గుంతకల్లుకు చెందిన ఓ నర్సు, ఆమె భర్త, కుమారుడు కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. నర్సు ఆరోగ్య పరిస్థితి విషమిస్తూ వచ్చింది. శ్వాస సమస్య తీవ్రమైంది. దీంతో ఆమెను భర్త, కుమారుడు అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి మంగళవారం ఉదయమే తీసుకొచ్చారు. 


ఇక్కడ ఆక్సిజన్‌ బెడ్లు ఖాళీ లేవని చెప్పి, ఎస్కేయూ కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లాలని సూచించారు. దీంతో నర్సును అంబులెన్స్‌లోనే ఎస్కేయూ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బెడ్లు లేవన్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రైవేట్‌గా ఆక్సిజన్‌ సిలిండర్‌ను అద్దెకు తీసుకున్నారు. అంబులెన్స్‌లోనే సిలిండర్‌ను ఏర్పాటు చేసుకుని, ఆక్సిజన్‌ అందించుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ గంటలకొద్దీ నిరీక్షించారు. అయినా అధికారులు, వైద్యవర్గాల నుంచి స్పందన కనిపించలేదు. వారి పరిస్థితి.. చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను కలచి వేసింది. వారి కష్టాలను వీడియో తీసి, సోషల్‌ మీడియాలో పెట్టారు. అది హల్‌చల్‌ చేసింది.


ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. దీంతో అధికారులు పరుగులు తీశారు. నర్సును మళ్లీ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐసీయూలో అడ్మిట్‌ చేసుకుని, ఆక్సిజన్‌ అందిస్తూ వైద్యసేవలు అందిస్తున్నారు. పాజిటివ్‌ ఉన్న భర్త, కుమారుడిని కూడా ఆస్పత్రుల్లో ఉంచుకుని, చికిత్సలు అందిస్తున్నారు. మంత్రి, జిల్లా ప్రజాప్రతినిధులు సమీక్ష చేసి, పలు ఆదేశాలిచ్చారు. ఆ మరుసటి రోజే ఆక్సిజన్‌ బెడ్లు లేక ఓ నర్సు నరకయాతన అనుభవించటం శోచనీయం. ఇప్పటికైనా అవసరం మేరకు ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసి, కరోనా బాధితులను కాపాడాలని జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-08-05T18:23:32+05:30 IST