చెరువులోకి ఓసీపీ నీరు

ABN , First Publish Date - 2021-03-02T04:36:34+05:30 IST

సింగరేణి సంస్థ నిర్వాకం వల్ల జిల్లా కేంద్రంలోని ఓ చెరువు నీరు కలుషితమవుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు దొరగారిపల్లెలోని చింతల చెరు వులోకి రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్టు గని నుంచి వెలువడే నీరు చెరువులో కలుస్తోంది.

చెరువులోకి ఓసీపీ నీరు
చెరువులో కలుస్తున్న ఓసీపీ నీరు

కలుషిత నీటితో పంటలకు చేటు

ఆందోళన చెందుతున్న రైతులు

 పట్టించుకోని రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

మంచిర్యాల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ నిర్వాకం వల్ల జిల్లా కేంద్రంలోని ఓ చెరువు నీరు కలుషితమవుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు దొరగారిపల్లెలోని చింతల చెరు వులోకి రామకృష్ణాపూర్‌ ఓపెన్‌కాస్టు గని నుంచి వెలువడే నీరు చెరువులో కలుస్తోంది. గ్రామ సమీపంలోని గర్మిళ్ల శివారు 188 సర్వే నంబర్‌లో సుమారు 50 సంవత్సరాల క్రితం చింతల చెరువును నిర్మించారు. నీటి పారుదలశాఖ అధికారులు స్థానిక రైతుల నుంచి 30 ఎకరాల భూమిని సేకరించి పంట పొలాలకు నీరందించే ఉద్దేశ్యంతో చెరువు నిర్మించారు. చెరువు కింద సుమారు 200 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులు ఈ చెరువు నీటితో యేటా రెండు పంటలు సాగు చేసుకునేవారు.

ఓసీపీ ఏర్పాటుతో..

సింగరేణి విస్తరణలో భాగంగా 2011లో రామకృష్ణాపూర్‌ ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టు(ఓసీపీ)ను ఏర్పాటు చేసింది. సుమారు ఆరేళ్ల క్రితం ఉత్పత్తి ప్రారంభం కావడంతో అందులో వెలువడే నీరు, ఇతర వ్యర్థ పదార్థాలను  చెరువులోకి వదులుతున్నారు. వ్యర్థాల నీరు చెరువులోకి చేరుతుండడంతో కలుషితమైపోయింది. నీరంతా పచ్చని రంగులోకి మారడంతో చేపలు, ఇతర జీవులు మృత్యువాత పడ్డాయి. చెరువు నీటిని ఉపయోగించి సాగు చేసిన వరి పంట ఎర్రబడి దిగుబడి రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరువు నీటితో ఉతికిన బట్టలు కూడా దుర్వాసన వస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఓసీపీ వ్యర్థాలను వేరే చోటుకు మళ్ళిం చాలని కోరుతున్నారు.

భూమిని కోల్పోయాను.. - నర్సాగౌడ్‌, గ్రామ రైతు

భూమిని కోల్పోయాను..


- నర్సాగౌడ్‌, గ్రామ రైతు

చెరువు నిర్మాణం కోసం భూ సేకరణ జరిపిన నీటిపారుదల శాఖ అధికారులు దశాబ్దాలు గడిచినా సంబంధిత రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. పరిహారం కోసం వారు కోర్టును ఆశ్రయించారు. ఓసీపీ నీటితో కలిసి పెద్ద మొత్తంలో మట్టి చెరువులోకి చేరడంతో పూడికతో నిండిపోయింది. పూడిక తీయిస్తామని హామీ ఇచ్చిన సింగరేణి అధికారులు ఆ విషయాన్ని విస్మరించడంతో చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అసలు చెరువుకు సంబంధించిన రికార్డులే రెవెన్యూ, నీటి పారుదల శాఖల వద్ద లేకపోవడం కొసమెరుపు. చెరువును రక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

భూమిని కోల్పోయాను..

- నర్సాగౌడ్‌, గ్రామ రైతు

చెరువు కింద 5.20 ఎకరాలు భూమిని కోల్పోయాను. అప్పట్లో భూమి తీసుకున్న అధికారులు పరిహారం ఇవ్వలేదు. చెరువును వాడుకుంటున్న సింగరేణి ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. అధికారులు, నాయకుల చుట్టూ తిరిగితే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.

మా దృష్టికి రాలేదు..

-సత్యనారాయణ, నీటిపారుదలశాఖ డీఈ 

చింతల చెరువులోకి ఓసీపీ నీరు చేరుతున్న విషయం ఇప్పటిదాకా మా దృష్టికి రాలేదు. చెరువులోకి ఓసీపీ నీటిని వదులుతుండడంపై విచారణ జరుపుతాం. సింగరేణి అధికారులతో మాట్లాడటం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఈ విషయం ఉన్నతాధికారుల ధృష్టికి కూడా తీసుకెళ్లి వారి సూచన ప్రకారం చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-03-02T04:36:34+05:30 IST