భద్రతాచర్యలతో జూపార్కుల్లో సందర్శకులకు అనుమతి

ABN , First Publish Date - 2020-10-01T16:05:24+05:30 IST

జంతుప్రదర్శనశాలలు, జింకల పార్కుల్లోకి సందర్శకులను అనుమతించాలని ఒడిశా రాష్ట్ర వన్యప్రాణుల విభాగం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నిర్ణయించారు.....

భద్రతాచర్యలతో జూపార్కుల్లో సందర్శకులకు అనుమతి

భువనేశ్వర్ (ఒడిశా):  జంతుప్రదర్శనశాలలు, జింకల పార్కుల్లోకి సందర్శకులను అనుమతించాలని ఒడిశా రాష్ట్ర వన్యప్రాణుల విభాగం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోసందర్శకులు, జంతుప్రదర్శనశాలల ఉద్యోగులు, వన్యప్రాణుల భద్రతకు చర్యలు తీసుకోవాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశాలు జారీ చేశారు. కాంట్రాక్టర్లు, మాంసం సప్లయర్లు కొవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులకు థర్మల్ పరీక్షలు చేయాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సూచించారు. 


సందర్శకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని జూపార్కుల్లోకి అనుమతించరాదని కోరారు. సీనియర్ సిటిజన్లు, చిన్నపిల్లలను జూపార్కుల్లోకి తీసుకురావద్దని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ సూచించారు. జూపార్కుల్లోని క్యాంటీన్లలో  అన్ని రకాల ముందు జాగ్రత్తలు, కొవిడ్ నిబంధనలు పాటించాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశించారు.


జూఅథారిటీ జూపార్కుల్లో శానిటైజేషన్ కార్యక్రమాలు చేయడంతోపాటు అదనంగా పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కోరారు. జూపార్కుల్లో హ్యాండ్ శానిటైజర్లు ఉంచాలని, పెద్ద జూపార్కుల్లో రోజుకు 1500 మందిని, చిన్న జూపార్కుల్లో రోజుకు 300మందిని, మినీ జూ, జింకల పార్కుల్లో 300 మందిని మాత్రమే అనుమతించాలని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆదేశించారు. 

Updated Date - 2020-10-01T16:05:24+05:30 IST