ఇక ‘అమ్మఒడి’ వంతు!

ABN , First Publish Date - 2021-09-15T06:42:08+05:30 IST

జిల్లాలో 30వేల సామాజిక పింఛన్లను రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అమ్మఒడి లబ్ధిదారులపై దృష్టి సారించింది.

ఇక ‘అమ్మఒడి’ వంతు!

  జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలకుగాను సుమారు 30వేల మందికి చెందిన సామాజిక పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమ్మఒడి లబ్ధిదారులపై దృష్టి సారించింది. అనర్హుల జాబితా తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

చిత్తూరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే వంద మంది అమ్మఒడి లబ్ధిదారుల అర్హతలపై నమూనా సర్వే జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలనూ పథకంలో చేర్చారని.. ఆదాయపన్ను, భూములు, కార్లు ఉన్నవారికి కూడా అమ్మఒడి లబ్ధి అందుతోందని గుర్తించారు. వీటిపై సమగ్ర విచారణకు కమిటీలను రూపొందించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని 2020 జనవరిలో సీఎం జగన్‌ ప్రారంభించారు. తొలుత 3,30,341 మంది విద్యార్థులు ఈ పథకంలో అర్హత పొందగా.. వారి తల్లుల ఖాతాల్లో రూ.495.51 కోట్లను జమ చేశారు. రెండోసారి 2021లో అర్హుల జాబితా పెరిగింది. 3,51,333 మందికిగాను రూ.14 వేల చొప్పున రూ.527 కోట్లను జమ చేశారు. తొలి విడత కంటే రెండో విడతలో లబ్ధిదారుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా బాగా పెరిగింది. దీంతో లబ్ధిదారుల అర్హతలను పరిశీలించేందుకు నమూనా సర్వే  చేశారు. ఇందులో నాగలాపురం, జీడీనెల్లూరు, వాయల్పాడు, మదనపల్లె మండలాల్లో మాత్రమే అర్హత లేని 14 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరి నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తారా.. ఇక నుంచి రాకుండా చేస్తారా.. అనే విషయంలో స్పష్టత లేదు.

ప్రాథమిక పాఠశాలలు: 4311

ప్రాథమికోన్నత పాఠశాలలు: 760

ఉన్నత పాఠశాలలు: 1260

మొదటి విడత అమ్మఒడి: 3,30,341 మంది

జమ చేసిన మొత్తం: రూ.495.51 కోట్లు

రెండో విడతలో అర్హులు: 3,51,333

జమ చేసిన మొత్తం: రూ.527 కోట్లు


అర్హత ఉండీ సొమ్ములు అందని వారి మాటేమిటో..?

ఆధార్‌, బ్యాంకు ఖాతాల నెంబర్లు తప్పుగా ఉన్నాయని కొందరికి మొదటి ఏడాది డబ్బులు అందలేదు. ఇలాంటి వారి వివరాలను అప్పట్లోనే సరిచేసి పంపించినా.. వారికి రెండో విడత లబ్ధి అందకుండా పోయింది. అలాగే కొంత మంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు. వారికి అమ్మఒడి పథకం కోసం సంరక్షకుల బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చారు. ఆ సంరక్షకుడి రేషన్‌ కార్డులో ఈ పిల్లల పేర్లు లేవని అనర్హులుగా చూపారు. ఇలాంటి వారికి రెండు విడతల డబ్బులూ జమ కాలేదు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉన్నప్పటికీ స్పందన లేదు.


చిరుద్యోగుల పిల్లలకు కట్‌

ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ నెలకు రూ.10వేల ఆదాయం మించిన వారందరినీ అనర్హులుగా సర్వేలో చూపిస్తున్నారు. ఇలా ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల పిల్లలను అనర్హులుగా గుర్తిస్తున్నారు. ఇలా చేయడంపై విద్యాశాఖ వారే తప్పు పడుతున్నారు. ఆశా, అంగన్వాడీ సంఘాల నేతలూ మండిపడుతున్నారు.

Updated Date - 2021-09-15T06:42:08+05:30 IST