అయ్యో అవ్వ..!

ABN , First Publish Date - 2022-06-07T06:29:20+05:30 IST

అయ్యో అవ్వ..!

అయ్యో అవ్వ..!

ఆత్కూరు పీఏసీఎస్‌లో నిధుల గోల్‌మాల్‌కు ఓ వృద్ధురాలు మృతి

కూలి చేసుకుని దాచుకున్న సొత్తును మింగేసిన సిబ్బంది

తీవ్ర మనోవేదనతో రోజూ బ్యాంకు వద్ద పడిగాపులు

సెలవని తెలియక ఆదివారం కూడా బ్యాంకుకెళ్లిన వృద్ధురాలు

తిరిగొచ్చి మంచంపైనే ప్రాణాలొదిలిన అనాథ అవ్వ 


‘నా’ అన్నవారెవరూ లేరు. కూలీనాలి చేసుకుని తనకంటూ కొంత సంపాదించుకుంది. చరమాంకంలో తనకు ఆర్థికంగా భరోసానిస్తాయనుకుంది. తన దగ్గరుంటే ఏమవుతాయోననే భయంతో ఆత్కూరు కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో దాచుకుంది. ఇటీవల జరిగిన నిధుల గోల్‌మాల్‌లో ఆమె డబ్బును కూడా సిబ్బంది కాజేశారు. ఏ ఆధారం లేని ఆ అవ్వ ఏం చేస్తుంది..? ఎవరికి తన బాధ చెప్పుకుంటుంది? ఎక్కడికెళ్లాలి? ఎవరినడగాలో తెలియక రోజూ బ్యాంకు వద్దకు వెళ్లి ‘నా డబ్బు ఇప్పించండయ్యా..’ అంటూ అధికారుల కాళ్లవేళ్ల పడేది. ఆదివారం కూడా అలాగే చేసింది. పాపం.. పిచ్చి అవ్వకేం తెలుసు... ఆదివారం బ్యాంకు ఉండదని. అటుగా పోయేవారెవరో సెలవని చెప్పడంతో కాళ్లు ఈడ్చుకుంటూనే భారంగా ఇంటివైపు కదిలింది. తీవ్ర మనోవేదనకు తోడు వడదెబ్బ తగిలి ప్రాణాలొదిలింది.


ఉంగుటూరు, జూన్‌ 6 : ఉంగుటూరుకు చెందిన అబ్బినేని నాగమల్లేశ్వరి ఒంటరి వృద్ధ మహిళ. కూలీనాలి చేసుకుని కూడబెట్టిన సుమారు రూ.60  వేలు ఆత్కూరు కో-ఆపరేటివ్‌ సొసైటీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూపంలో దాచుకుంది. కాగా, ఇటీవల బ్యాంకు సొమ్ము గోల్‌మాల్‌ వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆందోళనకు గురైన నాగమల్లేశ్వరి రోజూ బాండ్లు పట్టుకుని బ్యాంకుకు వెళ్లేది. అక్కడి సిబ్బందికి, డిపాజిట్‌దారులకు మధ్య జరుగుతున్న  వాగ్వాదాలు, గందరగోళ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసి తీవ్ర ఉద్వేగానికి గురయ్యేది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా బ్యాంకు వద్దకు వెళ్లి మధ్యాహ్నం వరకూ పడిగాపులు కాసింది. బ్యాంకుకు సెలవని తెలియని ఆమె సిబ్బంది కోసం ఎదురుచూసి ఆ తర్వాత ఇంటికొచ్చి మంచంపై నిద్రపోయింది. చివరికి తీవ్ర మానసిక సంఘర్షణతో రాత్రి 10 గంటల సమయంలో మృతిచెందింది.

బాధితులకు న్యాయం చేస్తాం

ఆత్కూరు పీఏసీఎస్‌లో నిధుల గోల్‌మాల్‌ వ్యవహారంలో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ గోసుల శివభరత్‌రెడ్డి హామీ ఇచ్చారు. బ్యాంకు ఉద్యోగి చేతివాటం వల్ల ఖాతాదారుల నగదు గల్లంతైన నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసేందుకు సోమవారం శివభరత్‌రెడ్డి బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో, బ్యాంకు సిబ్బందితో మాట్లాడారు.  

Updated Date - 2022-06-07T06:29:20+05:30 IST