Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 6 2021 @ 01:34AM

21కి చేరిన ఒమైక్రాన్‌ కేసులు

ఆదివారం ఒక్క రోజే 17 మందికి నిర్ధారణ


న్యూఢిల్లీ, డిసెంబరు 5: దేశంలో ఒమైక్రాన్‌ కేసులు 21కి చేరాయి. ఆదివారం 17 మందికి కొత్త వేరియంట్‌ నిర్ధారణ అయింది. రాజస్థాన్‌లోనే 9 మందికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. వీరిలో నలుగురు గత నెల 25న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. 28న వివాహానికి హాజరయ్యా రు. వీరితో పాటు కాంటాక్టుల్లోని ఐదుగురు బంధువుల నమూనాల జన్యు విశ్లేషణలో కొత్త వేరియంట్‌ ఉన్నట్లు తేలింది. మరోవైపు నైజీరియా నుంచి నవంబరు 24న మహారాష్ట్ర పుణె సమీపంలోని పింప్రి-చించ్వాడ్‌ వచ్చిన మహిళ (44), ఆమె పెద్ద కుమార్తె (18), చిన్న కుమార్తె (12)కు, సోదరుడు(47), అతడి ఇద్దరు కుమార్తె (7 ఏళ్లు, ఏడాదిన్నర)లకు ఒమైక్రాన్‌ సోకినట్లు తేలింది. మహిళ, పెద్ద కుమార్తె, సోదరుడు టీకా పూర్తిగా పొందారు. గత వారం ఫిన్లాండ్‌ నుంచి వచ్చిన పుణెకే చెందిన మరో వ్యక్తి కూడా కొత్త వేరియంట్‌ బారినపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. టాంజానియా నుంచి ఢిల్లీ వచ్చిన 37 ఏళ్ల వ్యక్తికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఈ యువకుడు టీకా రెండు డోసులు పొందాడని.. లక్షణాలు చాలా స్వల్పంగానే ఉన్నాయని లోక్‌నాయక్‌ జయప్రకాష్‌(ఎల్‌ఎన్‌జేపీ) ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం కర్ణాటకలో ఇద్దరికి(ఒకరు దక్షిణాఫ్రికా దేశస్థుడు), శనివారం గుజరాత్‌ వృద్ధుడి(72)కి, మహారాష్ట్రలో మెరైన్‌ ఇంజనీర్‌ (33)కు ఒమైక్రాన్‌ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. 


అదనపు డోసుపై నేడు సమావేశం

కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ‘అదనపు డోసు’ వేయడంపై చర్చించేందుకు జాతీయ వ్యాక్సినేషన్‌ సాంకేతిక సలహా బృందం సోమవారం సమావేశం కానుంది. వ్యాక్సిన్‌ అదనపు డోసు, బూస్టర్‌ డోసు రెండూ వేర్వేరు అంశాలని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ప్రస్తుతానికి బూస్టర్‌ డోసు మా ఎజెండాలో లేదు. అదనపు డోసుపైనే చర్చిస్తాం’’ అని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 


బిహార్‌లో భారీగా మృతుల సంఖ్య సవరణ

కరోనాతో మృతి చెందినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభు త్వం రూ.50వేల పరిహారం ఇస్తుండడంతో ఒక్కో రాష్ట్రం గణాంకాలను సవరిస్తున్నాయి. బిహార్‌ శనివారం ఒక్కరోజే 2,426 కొవిడ్‌ మరణాలను రికార్డుల్లోకి ఎక్కించింది. కేరళ సైతం శనివారం బులెటిన్‌లో 263 మరణాలను చూపింది. దీంతో  ఆదివారం కేంద్రం బులెటిన్‌లో 2,796 మరణాలు కనిపించాయి. కొత్తగా 8,895 మందికి వైరస్‌ సోకినట్లు తెలిపింది. కాగా, కర్ణాటకలోని చిక్కమగుళూరులోని జవహర్‌ నవోదయంలో 59 మంది విద్యార్థులు, 10మంది బోధనా సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది. మహారాష్ట్ర నాసిక్‌లో మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరైన ఇద్దరు మహిళలకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.  టీకా పొందడాన్ని తప్పనిసరి చేస్తూ పుదుచ్చేరి ఆదేశాలిచ్చింది. 


అమెరికా ప్రయాణికులకు కొత్త నిబంధనలు

ఒమైక్రాన్‌ భయాలతో అమెరికా కొత్త ప్రయాణ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. తమ దేశానికి వచ్చేవారు కొవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు లేదంటే గత 90 రోజుల్లో కొవిడ్‌ బారినపడి కోలుకున్నట్లు ఆధారం చూపాలని స్పష్టంచేసింది. భారత్‌ సహా అన్ని దేశాలకు ఈ నిబంధనలు సోమవారం నుంచే అమల్లోకి రానున్నాయి. గతంలో కొవిడ్‌ టెస్టు రిపోర్టు వ్యవధిని 72 గంటల నుంచి 24 గంటలకు కుదించింది. కాగా, న్యూయార్క్‌లో మరో ముగ్గురికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు ఇక్కడ ఈ వేరియంట్‌ కేసుల సంఖ్య 8కి పెరిగింది. మొత్తం 14 రాష్ట్రాల్లో ఒమైక్రాన్‌ కేసులు నమోదవడం గమనార్హం.


త్వరలో స్వల్ప మూడో వేవ్‌ ?!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో స్వల్పంగా మూడోవేవ్‌ రావచ్చని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మణీంద్ర అగర్వాల్‌ అన్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒమైక్రాన్‌ బారినపడిన వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని ఆయన గుర్తుచేశారు. దాని వల్ల తేలికపాటి ఇన్ఫెక్షన్లే సోకుతుండటాన్ని సానుకూల అంశంగా అభివర్ణించారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాబోతున్న మూడో వేవ్‌.. రెండో వేవ్‌ అంత ప్రమాదకరంగా ఉండకపోవచ్చని మణీంద్ర స్పష్టం చేశారు. దాదాపు 80 శాతం దేశ జనాభాకు కొవిడ్‌పై సహజ రోగ నిరోధకత చేకూరిందని, ఈ నేపథ్యంలో భారత్‌పై ఒమైక్రాన్‌ ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉండొచ్చని పేర్కొన్నారు. నిబంధలను పాటించడం, అవసరమైన చోట కట్టడి చేయడం ద్వారా ఒమైక్రాన్‌ కేసులు భారీగా పెరగకుండా ఆపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, మహారాష్ట్ర కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, డాక్టర్‌ శశాంక్‌ జోషి కూడా ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ వచ్చే 6 నుంచి 8 వారాల్లో ఒమైక్రాన్‌ ఏ స్థాయిలో వ్యాపిస్తుందో వేచి చూడాలి’’ అని ఆయన అన్నారు. 

Advertisement
Advertisement