Abn logo
Jul 8 2020 @ 05:12AM

ఏదో.. ఇస్తున్నారంతే..!

ఊరికి దూరంగా.. అనువుగాని చోట..

కొండలు, గుంతలు, వంకల్లో ప్లాట్లు

పేదల ఇంటి స్థలాలపై పెదవి విరుపు


ఎమ్మిగనూరు, జూలై 6: పెద్ద కడుబూరు మండలం రాగిమాన్‌దొడ్దికి కిలోమీటరు దూరంలో ఉన్న స్థలం ఇది. మూడేళ్ల క్రితం ఇక్కడ గరుసు కొండ ఉండేది. ఎమ్మిగనూరులో  జీ ప్లస్‌ త్రీ గృహాల నిర్మాణం కోసం ఇక్కడ గరుసు తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 40 శాతం పైగా గరుసును తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ఆ గుంతల్లో నీరు నిలిచింది. గరుసు తవ్విన స్థలంలో పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గుంతలు పడిన స్థలంలో రహదారులు ఏర్పాటు చేశారు. ఊరికి దూరంగా, అనువుగాని స్థలాన్ని ఇస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.


ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా మాసుమాన్‌దొడ్డి గ్రామ సమీపంలోని స్థలం ఇది. కొండను ఆనుకుని ఏటవాలుగా ఉంది. కందనాతి, మసీదుపురం గ్రామాల్లోని పేదలకు ఇక్కడ ఇంటి స్థలాలు ఇస్తున్నారు. ఈ స్థలం కందనాతి గ్రామానికి సుమారు 3 కీ.మీ, మసీదుపురం గ్రామానికి 7 కీ.మీ. దూరంలో ఉంది. గరుసు కొండకు సమీపంలో ఏటవాలుగా ఉంది. ఇక్కడ ఇంటి నిర్మాణం అంత సులువుకాదు. ఇంత దూరం లబ్ధిదారులు వస్తారా..? సొంత ఊరిని విడిచేందుకు ఇష్టపడతానా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడికి రహదారి, మంచినీటి సౌకర్యాలు కల్పించటం కూడా కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 


నందవరం మండలం ముగతి గ్రామ సమీపంలో ఉన్న కొండపై ఇంటి స్థలాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణం కష్టమైన పనే..! స్థలం వెనుకభాగంలో పెద్దపెద్ద బండరాళ్లు, గుంతలు ఉన్నాయి. ఈ కొండ ఎమ్మిగనూరు-మంత్రాలయం రోడ్డుకు ఆనుకుని ఉంది. తాగునీరు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించటం కష్టతరం. ఏదో ప్రభుత్వం ఇస్తోంది, ఎందుకు వద్దనాలి అని లబ్ధిదారులు రాజీ పడాల్సిందే. 


నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాని ప్రభుత్వం భావిస్తోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్థల సేకరణ చేస్తోంది. ప్రతి గ్రామంలో లబ్ధిదారులను గుర్తించి జాబితా తయారు చేసింది. కానీ అనువైన స్థలాలు సేకరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు విఫలమయ్యారన్న వాదన ఉంది. గ్రామాలకు దూరంగా, కొండలు, గుంతలు, వంకల సమీపంలో స్థలాలను సేకరించారు. అనువుగాని ప్రాంతాల్లో ఉన్నాయని తెలిసినా.. అంతర్గత రోడ్లు, ప్లాట్ల విభజన వంటి పనులు చేపట్టారు. దీనిపై లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఓకే చోట స్థలాలు కేటాయించటం విమర్శలకు తావిస్తోంది. 


ఎమ్మిగనూరు మండలంలోని మాసుమాన్‌దొడ్డి, గుడికల్‌ గ్రామల పేదలకు మాసుమాన్‌దొడ్డి సమీపంలో ఉన్న గరుసు కొండపై ఇంటి స్థలాలు ఇస్తున్నారు. కందనాతి, మసీదుపురం గ్రామలకు ఆరేడు కీ.మీ. దూరంలో ఉన్న గరుసుకొండపై స్థలాలను సిద్ధం చేస్తున్నారు. బనవాసి, పరమాన్‌దొడ్డి, బనవాసి ఫారం పేదలకు నవోదయ ఎదురుగా గతంలో టెక్సెటైల్‌ పార్కుకు కేటాంయించిన స్థలంలో ప్లాట్లు వేశారు. కోటేకల్‌, చెన్నాపురం, బోడబండ, నక్కలమిట్ట గ్రామల వారికి బోడబండ గ్రామ సమీపంలోని బనవాసి ఫారం భూముల్లో స్థలాలు ఇస్తున్నారు. కడివెళ్ల గ్రామస్థులకు ఊరికి రెండు కీ.మీ. దూరంలో ఉన్న మోడల్‌ స్కూల్‌ పక్కన స్థలాలు సిద్ధం చేశారు. 


గోనెగండ్ల పట్టణ వాసులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఎమ్మిగనూరు రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సిద్ధం చేశారు. చిన్న మరివీడు గ్రామానికి చెందిన పేదలకు గ్రామ శివారులోని కులుమాల రహాదారిలో ప్లాట్లు వేశారు. ఈ స్థలానికి రెండు వైపులా పెద్ద వంకలు ఉన్నాయి. నీరు ఉప్పొంగితే కాలనీ మునిగిపోతుంది. ఈ స్థలాలకు దగ్గరలో శ్మశానం కూడా ఉంది. 


నందవరం పేదలకు గ్రామ సమీపంలోని వంకను ఆనుకుని స్థలాలు కేటాయిస్తున్నారు. ముగతి గ్రామ పేదలకు మంత్రాలయం రోడ్డును ఆనుకుని ఉన్న కొండపై స్థలం సేకరించారు.


పెద్దకడుబూరు వాసులకు గ్రామానికి రెండు కి.మీ. దూరంలో ఉన్న వంక సమీపంలో మోడల్‌ స్కూలుకు ఎదురుగా స్థలాను సిద్ధం చేశారు. భారీ వర్షాలు వస్తే ఆ స్థలాల్లోకి నీరు చేరుతుంది. హెచ్‌ మురవణి గ్రామస్థులకు రెండు చోట్ల స్థలాలు కేటాయించారు. గ్రామానికి కీ.మీ. దూరంలో పెద్ద కడుబూరుకు వెళ్లే రహదారిలో, ఎల్లెల్సీ పక్కన ఉన్న చిన్నపాటి రాళ్ల గుట్టపై  కేటాయించారు. మరోచోట స్థలం ఉన్నా, అనువుగాని ఈ స్థలాన్ని ఎందుకు ఎంపిక చేశారో అధికారులకే ఎరుక. దొడ్డిమేకల గ్రామానికి కి.మీ. దూరంలో వంకకు అటువైపు భూమిని కొనుగోలు చేసి, ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. రాగిమాన్‌దొడ్డి పేదలకు ఊరి సమీపంలో ఉన్న గరుసుకొండ దగ్గర స్థలాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు గరుసు తవ్వటంతో గుంతలు ఎర్పడ్డాయి. కల్లుకుంట లబ్ధిదారులకు ఊరికి కి.మీ. దూరంలో ఉన్న కొండలను ఆనుకుని స్థలాలను ఇస్తున్నారు.


కోసిగి లబ్ధిదారులకు రెండు కి.మీ. దూరంలో ఉన్న మోడల్‌ స్కూలు ప్రాంతంలో స్థలాలు సిద్ధం చేశారు. కామనదొడ్డి గ్రామస్థులకు కీ.మీ. దూరంలో స్థలాలు ఇస్తున్నారు. 


మంత్రాలయం మండలంలోని రచ్చుమర్రి గ్రామస్థులకు కిలోమీటరు దూరంలో వంక వద్ద స్థలాలు ఇస్తున్నారు. కలుదేవకుంటలో గ్రామానికి కి.మీ. దూరంలో సూగూరుకు వెళ్లే దారిలో ఇంటి స్థలాలు కేటాయించారు. 


కౌతాళం వాసులకు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఊరు ఈతనహాల్‌ వద్ద స్థలాలు సిద్ధం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement