ఖజానాపై.. ఫ్రీజింగ్‌

ABN , First Publish Date - 2021-02-25T04:26:22+05:30 IST

ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నా ఇంకా ఖజానాపై ఫ్రీజింగ్‌ తప్పలేదు.

ఖజానాపై.. ఫ్రీజింగ్‌

- అత్యవసర బిల్లులు మాత్రమే చెల్లింపు
- ఇతర బిల్లులకు నెల రోజుల వరకు సమయం
- మార్చిలో అన్ని బిల్లులు క్లియర్‌ అయ్యే అవకాశం



నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
ఆర్థిక సంవత్సరం ముగింపునకు వస్తున్నా ఇంకా ఖజానాపై ఫ్రీజింగ్‌ తప్పలేదు. చెల్లింపులు అత్యవసరమైన వాటికే ఖజానా నుంచి చెల్లిస్తున్నారు. కొన్ని బిల్లులు త్వరగా చెల్లింపులు జరుగుతున్నా చాలా బిల్లులు మాత్రం 20 రోజుల నుంచి నెల రోజుల వరకు పడుతోంది. పై నుంచి బడ్జెట్‌ విడుదలకు అనుగుణంగానే ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులను చేస్తున్నారు. జీతాలు, ఉద్యోగుల వైద్య ఖర్చుల బిల్లులతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ బిల్లులు మాత్రం ఆగడం లేదు. కార్యాలయాల ఖర్చులతో పాటు ఇతర బిల్లులు మాత్రం ఆలస్యంగానే చెల్లింపులు చేస్తున్నారు. జిల్లాలోని అభివృద్ధి పనుల బిల్లులు కూడా పనులు పూర్తయిన 20 రోజుల నుంచి నెల రోజుల వరకు పడుతోంది.


కొన్ని శాఖల పరిధిలో రెండు నెలల వరకు కూడా సమయం తీసుకుని బడ్జెట్‌ విడుదలకు అనుగుణంగానే చెల్లింపులను చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు ఇంకా 34 రోజులే ఉంది. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తమ బిల్లులను ఖజానా శాఖకు పంపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బడ్జెట్‌ విడుదల ఎక్కువగా ఉంటుందని అన్నిశాఖల వారు ట్రెజరీ కార్యాలయాలకు పంపిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్‌లు పనులు పూర్తికావడంతో తమ బిల్లులను పే అండ్‌ అకౌంట్‌ శాఖలకు పంపిస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఆర్థిక సంవత్సరం ముగింపులోపు బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిధులు విడుదల అయ్యే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఈ బిల్లులను పెడుతున్నారు. గడిచిన కొన్ని నెలలుగా కరోనా ప్రభావంతో చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి.


ఖజానా శాఖతో పాటు పే అండ్‌ అకౌంట్‌ ద్వారా జరిగే చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం కరోనా వల్ల ఆదాయం తగ్గడంతో నిధులు వచ్చిన రీతిలోనే ఆయా శాఖలకు విడుదల చేస్తున్నారు. బడ్జెట్‌కు అనుగుణంగానే ఉమ్మడి జిల్లాలో చెల్లింపులు చేస్తున్నారు. కరోనా మొదలై 11 నెలలు పూర్తయింది. ఆ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. పన్నుల చెల్లింపు తగ్గడం వల్ల ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తగ్గింది. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిధులు సర్దుబాటు అయిన రీతిలోనే ఈ చెల్లింపులను చేస్తున్నారు. 


ప్రతినెల మొదటి పది రోజులు ఉద్యోగుల జీతాలను చెల్లిస్తున్నారు. ఆయా శాఖలకు నిధులు విడుదల చేస్తే 10వ తేదీలోపు చెల్లింపులను పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఉద్యోగులకు సంబంధించిన వైద్య బిల్లులు, ఇతర చెల్లింపులను చేస్తున్నారు. ఇవేకాకుండా వివిధ కార్యాలయాల నుంచి వచ్చే బిల్లులకు కూడా ప్రాధాన్యత క్రమంలో ఈ చెల్లింపులు ఉమ్మడి జిల్లా పరిధిలో చేస్తున్నారు. ప్రభుత్వం ఆయా ట్రెజరీలు, పే అండ్‌ అకౌంట్స్‌ శాఖలకు విడుదల చేసిన విధంగానే ఈ చెల్లింపులు చేస్తున్నారు.


ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు మాత్రం త్వరగానే చెల్లింపులు చేస్తున్నారు. ఇతర బిల్లులు మాత్రం ఆలస్యం అవుతున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులకు అనుగుణంగా నిధులు విడుదల కాగానే చెల్లింపులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈజీఎస్‌ కింద పలు పనులను చేశారు. రెండు జిల్లాల పరిధిలో కోట్ల రూపాయల నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేశారు. కేంద్రం నుంచి నిధులు త్వరగా రాకపోవడం వల్ల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలలో భారీగా నిధులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.


ఉమ్మడి జిల్లా పరిధిలో సాగునీటిశాఖ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. వీటికి కూడా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇంజనీరింగ్‌శాఖల ఆధ్వర్యంలో పనులు జరుగుతునాయి.. రోడ్లు, ఇతర పనులను ఈ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్నారు. వీటికి కూడా పనులు పూర్తయిన నెల రోజుల తర్వాతనే చెల్లింపులను చేస్తున్నారు. ఆసరా పింఛన్‌లకు మాత్రం సమస్యలు లేకుండా చెల్లింపులు చేస్తున్నారు. సంక్షేమశాఖలో అమలవుతున్న వివిధ పథకాలకు ఈ నెలాఖరులో నిధులు విడుదల అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లను చేశారు. బడ్జెట్‌ విడుదల కాగానే లింకేజ్‌ కింద సబ్సిడీని విడుదల చేయనున్నారు. ఇతర పథకాలకు కూడా ఆర్థిక సంవత్సరం ముగింపులోపు బిల్లులు వస్తాయని భావిస్తున్నారు.


ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రస్తుతం మాత్రం అత్యవసరమైన బిల్లులను మాత్రమే ఖజానా ద్వారా చెల్లింపులను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్‌లు శాఖల ద్వారా బిల్లులు క్లియర్‌ అయిన ఖజానా శాఖల చుట్టూ తిరుగుతున్నారు. బడ్జెట్‌ ఆలస్యం కావడం వల్ల వారికి కూడా నెల రోజులపైగా పడుతోంది. కొంతమంది హైదరాబాద్‌కు వెళ్లి ఆర్థికశాఖ అధికారులను కలిసి తమ బిల్లులకు బడ్జెట్‌ కేటాయింపులు చేయించుకుంటున్నారు.


ఉమ్మడి జిల్లాలో అత్యవసర బిల్లులకు ఫ్రీజింగ్‌ లేదని అధికారులు తెలిపారు. కొన్ని బిల్లులు మాత్రమే 20 రోజుల నుంచి నెల రోజుల వరకు సమయం పడుతుందని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి నెలలో ఎక్కువ బిల్లులు చెల్లింపులు జరుగుతాయని వారు తెలిపారు. ప్రభుత్వం బడ్జెట్‌కు అనుగుణంగా నిధులను విడుదల చేస్తే మార్చి నెలలో పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లింపు అయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-02-25T04:26:22+05:30 IST