రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-01-22T05:18:33+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రణస్థలం : కొండములగాం గ్రామానికి చెందిన దన్నాన సన్యాసప్పడు (59) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం సాయంత్రం కొండములగాం నడిచి వెళ్తుండగా పిన్నింటివారి కల్లాల వద్ద వెనుక నుంచి వచ్చిన ద్విచక్రవాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన సన్యాసప్పడును చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ద్విచక్రవాహన చోదకుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేఆర్‌పురం హెచ్‌సీ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


మహిళకు గాయాలు...

నందిగాం : గొల్లూరు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలయ్యాయి. నౌగాం గ్రామానికి చెందిన పొందర పార్వతమ్మ గొల్లూరు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా నందిగాం నుంచి టెక్కలి వైపు వెళ్తున్న ద్విచక్రవాహనం ఢీకొనడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పార్వతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.యాసిన్‌ తెలిపారు.


నాతవలస సమీపంలో తొమ్మిది మంది...

డెంకాడ : విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస టోల్‌ప్లాజా సమీపంలో శుక్రవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. డెంకాడ ఎస్‌ఐ ఎన్‌.పద్మావతి తెలిపిన వివరాల మేరకు... తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లేందుకు కొంతమంది ప్రైవేట్‌ టూరిస్టు బస్సులో శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్నారు. ఈ బస్సు నాతవలస వద్దగల టోల్‌ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టి, ప్రయాణికులను సురక్షితంగా పంపించారు. డ్రైవర్‌ అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-22T05:18:33+05:30 IST