నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు

ABN , First Publish Date - 2022-01-23T06:15:00+05:30 IST

ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతలో వందమందికి దళిత బంధు అందించడానికి ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మార్చి 7లోగా లబ్ధి చేకూర్చాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, అధికారులు

- ఫిబ్రవరి 5లోగా దళిత బంధుకు ఎంపిక పూర్తి 

- వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

సిరిసిల్ల, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతలో వందమందికి దళిత బంధు అందించడానికి ఫిబ్రవరి 5లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, మార్చి 7లోగా లబ్ధి చేకూర్చాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, సీపీవో శ్రీనివాసచారి, డీఏవో రణధీర్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా తీసుకున్న కార్యక్రమం దళిత బంధు అన్నారు. దేశంలోనే ప్రత్యేకంగా దళితుల కోసం తీసుకున్న గొప్ప పథకమన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం వాసాల మర్రి గ్రామంతోపాటు మరో నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో దళిత బంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి వంద మంది దళితులకు పథకం అమలు  చేయనున్నట్లు చెప్పారు. దళితబంధుతో నిరుపేద, షెడ్యూల్‌ కులాల వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని, జిల్లాలో దళిత బంధు అమలుకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. జిల్లా  స్థాయిలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని, త్వరితగతిన లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్‌లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గం హెడ్‌క్వార్టర్‌లో ఉన్న  కలెక్టర్‌ ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉన్నత అధికారిని దళిత బంధు అమలు ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు.  జిల్లాకు చెందిన మంత్రి సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు.  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొని సకాలంలో యూనిట్‌లు గ్రౌండ్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-01-23T06:15:00+05:30 IST