Abn logo
Oct 30 2020 @ 05:51AM

రైతుభరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ

Kaakateeya

వచ్చేనెల 25 నుంచి 259 కేంద్రాల్లో కొనుగోలు

ఏపీ డెయిరీ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ బాబు వెల్లడి


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 29 : అమూల్‌ సంస్థ ద్వారా వచ్చేనెల 25వ తేదీ నుంచి జిల్లాలో తొలివిడతగా 259 రైతుభరోసా కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభిస్తున్నట్లు ఏపీ డెయిరీ డెవెలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అహ్మద్‌ బాబు వెల్లడించారు. డెయిరీ అభివృద్ధిపై అనుబంధ శాఖల అధికారులతో గురువారం సాయంత్రం స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్‌ సమావేశపు హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో అమూల్‌ సంస్థ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలను మొదటిగా జిల్లాలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందుకోసం అమూల్‌ బృందాలు 331 గ్రామాల్లో సమగ్ర సర్వేలను నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారన్నారు. సంస్థ సర్వే ఆధారంగా 25 మండలాల్లో ప్రయోగాత్మకంగా నవంబరులో 20న పాలసేకరణ ప్రారంభమవుతుందన్నారు. నవంబరు 25న  ప్రభుత్వం అధికారికంగా పాలను సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ సంస్థగా అమూల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆ సంస్థకు చెందిన సబర్‌కర్ణా యూనియన్‌ పరిధిలోకి ప్రకాశం జిల్లాను చేర్చడం సంతోషదాయకమని తెలిపారు.


మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘంలోకి రైతులను చేర్చి రైతుభరోసా కేంద్రాల  అనుసంధానంతో నాణ్యమైన పాలు ఉత్పత్తి చేస్తామని తెలిపారు. విడతల వారీగా 820 రైతుభరోసా కేంద్రాల్లో పాల ఉత్పత్తి సేకరణ చేపడతామన్నారు. పాల సేకరణకు సంబంధించిన నగదు కేవలం 10రోజుల్లోనే రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమల్లోకి రానుందని, పారదర్శకంగా సేవలు అందుతాయని ఆయన వివరించారు.  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ పాల ఉత్పత్తుల  ద్వారా జిల్లాలోని రైతులకు ఎంతో మేలు జరగనుందని తెలిపారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌సుధాకర్‌బాబు మాట్లాడుతూ ఒంగోలు  డెయిరీని అభివృద్ధి పర్చేందుకు అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకోవడం శుభపరిణామనన్నారు. అంతకు ముందు ఎండీ బాబును సత్కరించారు. సమావేశంలో జేసీ వెంకట మురళీ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement