కొనసాగుతున్న బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-04-05T10:01:18+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. పలు చోట్ల

కొనసాగుతున్న బియ్యం పంపిణీ

పలుచోట్ల లబ్ధిదారుల ఇబ్బందులు 

ఎండ తీవ్రతకు ఇక్కట్లు 

భౌతిక దూరం పాటించిన ప్రజలు 


మునుగోడు/మర్రిగూడ, త్రిపురారం/ మిర్యాలగూడ టౌన్‌, ఏప్రిల్‌ 4: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పంపిణీ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. పలు చోట్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రేషన్‌ దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించారు. మునుగోడులో తహసీల్దార్‌ దేశ్య ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


మండలంలోని చౌకధరల దుకాణాల వద్ద ఉచిత బియ్యం పంపిణీని పర్యవేక్షించారు. మర్రిగూడలోని పలు గ్రామాల్లో రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ కుర్చీలు వేసి లబ్ధిదారులను కూర్చొబెట్టి బియ్యం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయబ్‌ తహసీల్దార్‌ జక్కర్తి శ్రీనివాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజిరెడ్డి, ఆర్‌ఐలు దుర్గామహేశ్వరి, శ్రీనివా్‌సనాయక్‌, మర్రిగూడ సర్పంచ్‌ నల్లా యాదయ్యగౌడ్‌, పాక నగే్‌షయాదవ్‌, వెంకటమ్మ, వీర్వోలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ దుకాణాదారులు సర్కిళ్లు వేయించారు.


ఆయా డబ్బాల్లో లబ్ధిదారులు వంతుల కోసం బస్తాలు, చేసంచులు పెట్టుకుని వేచి ఉండటం కనిపించింది. పలు వార్డుల్లో కౌన్సిలర్లు బియ్యం పంపిణీని పర్యవేక్షించారు. త్రిపురారంలో భౌతిక దూరం పాటించారు. ఎండ అధికంగా ఉండటంతో కొంత ఇబ్బందులు పడ్డారు.  


అధికారి వేలిముద్ర పడక ఆగిన పంపిణీ

చింతపల్లి: ప్రతి రేషన్‌ దుకాణానికి, వీఆర్వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శికి అథెంటికేషన్‌ ఇచ్చారు. సదరు అధికారి వేలిముద్ర వేస్తేనే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. చింతపల్లి మండల కేంద్రంలోని షాప్‌ నెంబర్‌ 32కు అధికారులు వీఆర్‌ఏ వెంకట్రాములుకు అథెంటికేషన్‌ ఇచ్చారు. అతని ఆధార్‌లో ఆధార్‌ తప్పు ఉండటంతో వేలిముద్ర పడటం లేదు. దీంతో మూడు రోజులుగా లబ్ధిదారులు ఈ దుకాణం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.  


తూకంలో తేడాలు 

మర్రిగూడ: మర్రిగూడ మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఓ రేషన్‌ దుకాణంలో బియ్యం తక్కువగా వస్తోందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా రేషన్‌ పంపిణీ చేస్తుండగా తూకంలో తేడాలు గమనించారు. అనుమానంతో లబ్ధిదారులు ఓ ప్రైవేట్‌ షాపునకు వెళ్లి తూకం వేసి చూడగా 50 కేజీలకు 43 కేజీల తూకం రావడంతో అవాక్కయ్యారు.


ఈ విషయంపై సర్పంచ్‌ చిట్యాల సబిత రేషన్‌షాపు వద్దకు వెళ్లి తూకం వేసే యంత్రాన్ని పరిశీలించారు. తూకంలో తేడా రాకుండా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా మాకు సమాచారం తెలిసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకొని తూకం యంత్రాన్ని తొలగించి లబ్ధిదారులకు సక్రమంగా బియ్యం అందేలా చూస్తామని తెలిపారు.

Updated Date - 2020-04-05T10:01:18+05:30 IST