ప్రయోగాత్మకమైతేనే ‘ఆన్‌లైన్‌’ ప్రయోజనం

ABN , First Publish Date - 2020-08-15T20:39:37+05:30 IST

వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు..

ప్రయోగాత్మకమైతేనే ‘ఆన్‌లైన్‌’ ప్రయోజనం

17 నుంచి టెక్నికల్‌ విద్యార్థులకు తరగతులు

తదేక దీక్ష, అర్థం చేసుకుంటేనే అనుకూలం


వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు  సోమవారం నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు అవగతమయ్యేలా అధ్యాపకులు పాఠ్యాంశాలు వివరించేలా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులు తదేక దీక్షతో విని అర్థం చేసుకుంటేనే ఈ తరగతులు లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు చెబుతున్నారు.


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కాకినాడ, అనంతపురంలోని జేఎన్‌టీయూ పరిధిలోని కళాశాలల్లో బీటెక్‌, ఫార్మసీ కోర్సులకు సంబంధించి 2, 3,4 సంవత్సర విద్యార్థులతోపాటు ఎంబీఏ, ఎంటెక్‌, ఎంసీఏ తదితర కోర్సులలోని పాత విద్యార్థులకు 17వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించనున్నారు. విద్యార్థులందరికీ సమానంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా ఆన్‌లైన్‌లో బోధించడం అంత సులువేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తిగా కృత్యాధారమైనవి. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను ప్రయోగశాలలో పరీక్షించి నిర్ధారించుకున్నపుడే వాటిపై పూర్తిగా పట్టు లభిస్తుంది. అలాంటిది ఆన్‌లైన్‌ తరగతుల్లో వివరించే పాఠ్యాంశాలను విద్యార్థులు ఏ మేరకు అవగతం చేసుకోగలుగుతారో చూడాల్సి ఉంది. కాగా, జిల్లాలో అధిక శాతం మంది విద్యార్థులకు తగిన వనరులు లేకపోవడంతో ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనే అవకాశం అంతంతమాత్రమే.


ఇలా చేస్తే..

మెకానికల్‌, సివిల్‌, ఈఈఈ కోర్సులకు సంబంధించిన ప్రయోగాలపై వెబ్‌ కెమెరాల సాయంతో అవగాహన కల్పించాలి.

యానిమేషన్‌ ద్వారా రియల్‌టైమ్‌, సిమ్యులేషన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ వివిధ సాంకేతిక పరికరాలను, పరిశోధన ప్రక్రియలను బోధించాలి.

సీ ప్లస్‌ప్లస్‌, జావా, ఆటోక్యాడ్‌, ఒయాసిస్‌ వంటి సాఫ్ట్‌వేర్‌లు విద్యార్థులకు అందు బాటులో ఉంచేందుకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు చర్యలు తీసుకోవాలి.


విద్యార్థులు జాగ్రత్తగా వినాలి 

ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఆన్‌లైన్‌లో తరగతులను జాగ్రత్తగా వినాలి. అధ్యాపకులు చెప్పిన అంశాలపై ఎప్పటికప్పుడు నోట్స్‌ తయారు చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది.

- పీవీఎల్‌ మాధవ్‌రావు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ శిక్షకుడు, గీతాంజలి ఇన్‌స్టిట్ట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ


Updated Date - 2020-08-15T20:39:37+05:30 IST