chennai: ఆన్‌లైన్‌ మోసం !

ABN , First Publish Date - 2021-10-14T15:39:07+05:30 IST

ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బు గుంజడంతో పాటు వారిని బెట్టింగ్‌లోకి దింపి మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. అంతేగాక అతడి నుంచి భారీగా నగదు, బం

chennai: ఆన్‌లైన్‌ మోసం !

- గేమ్స్‌ పేరుతో డబ్బులు గుంజిన వ్యక్తి అరెస్టు

- పలు క్రికెట్‌ బెట్టింగుల్లోనూ పాల్గొన్నట్టు గుర్తింపు

- 193 గ్రాముల బంగారం, రూ.24.5 లక్షల నగదు 6 కిలోల వెండి, కారు, 10 మొబైల్‌ఫోన్ల స్వాధీనం


చెన్నై: ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బు గుంజడంతో పాటు వారిని బెట్టింగ్‌లోకి దింపి మోసాలకు పాల్పడిన ఓ వ్యక్తిని నగర పోలీసులు అరెస్టు చేశారు. అంతేగాక అతడి నుంచి భారీగా నగదు, బంగారం, వెండి నగలు, మొబైల్‌ ఫోన్లు, కారు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు., వివరాల్లోకి వెళితే... హరికృష్ణన్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ గేమ్స్‌ పేరుతో రూ.87 లక్షలు మోసం చేశాడంటూ చూలైమేడుకు చెందిన విఘ్నేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైం అదనపు డిప్యూటీ కమిషనర్‌ బీహెచ్‌ షాహిదా నేతృత్వంలోని ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. లోతైన దర్యాప్తు అనంతరం నిందితుడు మహాబలిపురం సమీపంలో వున్న ఓ ప్రైవేటు హోటల్లో వున్నట్టు గుర్తించి వల పన్ని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద రూ.24,68,300, 193 గ్రాముల బంగారు ఆభరణాలు, 6 కిలోల వెండి వస్తువులు, పది మొబైల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ తదితరాలను స్వాధీనం చేసుకుంది. కొందరి వద్దనుంచి అతను బంగారు ఆభరణాలతోనూ బెట్టింగ్‌ కట్టినట్టు నిర్ధారించుకుంది. కాగా అతను 30 మంది వద్ద భారీ స్థాయిలో మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం హరికృష్ణన్‌ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరచి, జుడీషియల్‌ కస్టడీకి తరలించారు. హరికృష్ణన్‌ తండ్రి కూడా ఆన్‌లైన్‌ వ్యాపారం చేసేవాడని, ఆయన మరణానంతరం ఇతను రంగంలోకి దిగి మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక అతను క్రికెట్‌ బెట్టింగ్‌లో పాల్గొన్నాడని తెలిసింది. బుకీగా అవతారమెత్తిన అతను అనేక మోసాలకు పాల్పడ్డాడు. కాగా అతడితో కలిసి బెట్టింగుల్లో పాల్గొన్న వారి జాబితాను పోలీసులు సేకరిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T15:39:07+05:30 IST