Abn logo
May 10 2021 @ 03:08AM

అక్రమాల ఆన్‌లైన్‌..!

అసైన్డ్‌ ల్యాండ్‌కు వన్‌బీ

నిన్న బసినికొండ.. నేడు బి.కె.పల్లె


మదనపల్లె, మే 9: వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకుని, నకిలీలను ఆయుధంగా వాడుకుని రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎప్పుడిచ్చారో, అసలు ఇచ్చారో లేదో తెలియని అసైన్డ్‌ భూమికి ఆన్‌లైన్‌ వన్‌బీ చేస్తున్నారు. తద్వారా విలువైన ప్రభుత్వ భూమి పరాధీనానికి పరోక్ష కారకులవుతున్నారు. ఇప్పటికే బసినికొండ సర్వే నెం.718-3ఏలో 2.4 ఎకరాల ప్రభుత్వ భూమికి వన్‌బీ చేసి, విక్రయానికి కారణమైన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు బి.కె.పల్లెలో రూ.కోటిన్నరకుపైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్‌ చేయడం ద్వారా అమ్మకానికి పెట్టారు.


మదనపల్లె పట్టణ శివారు బి.కె.పల్లె సర్వే నెం.575-1ఏలో ఎకరా భూమిని అప్పటి రెవెన్యూ అధికారి ఇటీవల వన్‌బీ చేశారు. ముజీబ్‌నగర్‌కు ఆనుకుని, తట్టివారిపల్లె చెరువులో కలసిపోయిన ఎకరా భూమికి బాలాజీనగర్‌కు చెందిన పి.రెడ్డెప్ప కుమారుడు పి.శ్రీకాంత్‌ పేరున ఆన్‌లైన్‌ వన్‌బీ చేశారు. ఈయనకు 2003లో 19వ విడత జన్మభూమిలో డీకేటీ పట్టా ఇచ్చినట్లు ఆన్‌లైన్‌ ప్రొసీడింగ్స్‌లో నమోదు చేశారు. అసైన్డ్‌ ఫర్‌ రిజిస్టర్‌లో నమోదుతోపాటు సర్వేయర్‌ ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఆధారంగా ఆన్‌లైన్‌ చేస్తున్నట్లు చూపించారు. మరి.. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. బి.కె.పల్లె సర్వే నెం.575.. బి.కె.పల్లె ఇందిరమ్మకాలనీ ఏరియాలో వస్తుంది. కానీ, పట్టణంలో మిళితమైన చీకలిగుట్టకు ఆనుకుని ఉన్న స్థలాన్ని చూపించడంతో వీఆర్వో, ఆర్‌ఐ వన్‌బీ చేయడానికి సిఫార్సు ఫైలుపై సంతకం చేయలేదు. అనంతరం బదిలీపై వెళ్లే ముందు ఓ రెవెన్యూ అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించినట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చసాగుతోంది. సాధారణంగా రెవెన్యూశాఖలో చిన్నపాటి ధ్రువప్రతం తీసుకోవాలంటేనే వీఆర్వో నుంచి ఆర్‌ఐ వరకు ఆమోదిస్తే, తర్వాత డీటీ సిఫార్సుతో తహసీల్దార్‌ మంజూరు చేస్తుంటారు. కానీ, రూ.కోటిన్నరపైగా విలువైన భూమికి అధికారం కల్పించే ముందు, వీరి ప్రమేయం లేకుండానే ఫైలు ముందుకెళ్లిందంటేనే ఇక్కడ ‘ఏం జరిగిందో’ అర్థం చేసుకోవచ్చు. ఓ రెవెన్యూ ఉద్యోగి దళారీ పాత్ర పోషించడంతో రోజుల వ్యవధిలోనే పనైపోయిందని చెబుతారు. తనకు ఎలాంటి అధికారం లేకపోయినా ఫైలుపై సంతకం చేయాలని వీఆర్వోపై ఆ ఉద్యోగి ఒత్తిడి తేవడంతో అప్పట్లో కార్యాలయంలో ఈ విషయమై  పెద్ద వివాదమే జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు గుర్తుచేస్తున్నారు. 

వీఆర్వో, ఆర్‌ఐ సంతకాల్లేని ఆన్‌లైన్‌ వన్‌బీ ప్రొసీడింగ్‌ పత్రం

అసైన్డ్‌ పట్టా పొందాలంటే..


స్థానికుడై ఎక్కడా తనపేరున ఎలాంటి భూమి లేకుండా, సాగు చేసుకుంటున్న వారికే డీకేటీ భూములను అసైన్డ్‌ పట్టాగా జారీ చేస్తుంటారు. ప్రస్తుతం సర్వే నెం.575-1ఏలో ఎకరా డి.పట్టా ఇచ్చినట్లు చెబుతున్న శ్రీకాంత్‌ది స్వగ్రామం కలకడ మండలంగా, ఈయన తండ్రి రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా చెబుతున్నారు. పైగా కోనేరు రంగారావు సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటే పట్టణానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల లోపల సాగు భూమికి పట్టా ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఎప్పుడో 2003లో ఇచ్చిన డీకేటీ పట్టాను 18 ఏళ్ల తర్వాత వన్‌బీ చేయడం ఏమిటని రెవెన్యూ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

...అయినా వన్‌బీ చేశారు


నిబంధనలకు విరుద్ధంగా మదనపల్లె పట్టణ ఏరియాలో అసైన్డ్‌ పేరుతో పట్టాలు జారీ చేశారని, ఆ భూములు వినియోగంలో లేవని ఇటీవల సబ్‌కలెక్టర్‌ జాహ్నవికి కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆమె.. పట్టణ ఏరియాలోని అసైన్డ్‌ భూముల జాబితా పంపాలని, అప్పటి తహసీల్దార్‌ సురేష్‌బాబును ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన ఈ పట్టాలను రద్దు చేయాలని ఆయన సబ్‌కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఇది పరిశీలనలో ఉండగానే, అలాంటి భూమికే వన్‌బీ చేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం మొదలైంది.


‘ఎ’ చేర్చి పట్టా ఇచ్చారా? 


బి.కె.పల్లె సర్వే నెం.575-1 నుంచి 5వరకు 2011లో అప్పటి తహసీల్దార్‌ అమరేంద్రబాబు అసైన్డ్‌ పట్టాలు ఇచ్చారు. శ్రీకాంత్‌ పేరున, అంతకుముందే 2003లో అదే సర్వే నెం.575-1ఏలో ఎలా ఇచ్చారన్నదే ఇక్కడి ప్రశ్న. ఇందులో సర్వే నెంబరు సబ్‌లెటర్‌కు ‘ఏ’ చేర్చి పనికానిచ్చారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే, రెవెన్యూ అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement