ఆన్‌లైన్‌ పోటీ

ABN , First Publish Date - 2021-10-14T05:17:38+05:30 IST

దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో సందడే..సందడి. చిన్న వ్యాపార సంస్థల నుంచి కార్పొరేట్‌ వరకు పండుగలను క్యాష్‌ చేసుకునేందుకు పోటీపడుతుంటాయి.

ఆన్‌లైన్‌ పోటీ

పోటా పోటీగా డిస్కౌంట్‌లు 

ఆఫర్లు, లక్కీడిప్‌లతో ఆకర్షణ..

రూ.100 కోట్లపైనే వ్యాపారం


నరసాపురం పట్టణానికి చెందిన రవి పండుగకు బట్టలు కొనేందుకు రెడీమెడ్‌ షాపునకు వెళ్లాడు. అయితే అతనికి కావాల్సిన బ్రాండ్‌ దొరకలేదు. ఇంటికి వెళ్లి ఆన్‌లైన్‌లో వెతికాడు. కావాల్సిన బ్రాండెడ్‌ ప్యాంట్లు పలు రకాల్లో కనిపించాయి. పండుగ డిస్కాంట్స్‌  కూడా కలిసి రావడంతో ఆన్‌లైన్‌లో కొనేశాడు. డెలివరీ కూడా మూడు రోజుల్లో వచ్చేయడంతో షాపింగ్‌ చాలా ఈజీగా అయిపోయింది.


మొగల్తూరుకు చెందిన ఓ వ్యాపారి పండుగ ఆఫర్లలో పెద్ద సైజ్‌ టీవీ కొనాలని నిర్ణయించుకున్నాడు. రెండు రోజులుగా పేరుగాంచిన షాఫులన్నీ వెతికాడు.అయితే పిల్లల సలహాతో ఆన్‌లైన్‌లో కూడా చూశాడు.మార్కెట్‌ రేటు కంటే తక్కువ ధరకే వస్తుండడంతో ఆన్‌లైన్‌లోనే టీవీ బుక్‌ చేశాడు. ఈఎంఐ సౌకర్యం ఉండడంతో పెద్దగా ఇబ్బంది అనిపించలేదు.


నరసాపురం, అక్టోబరు 13: దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. మార్కెట్‌లో సందడే..సందడి. చిన్న వ్యాపార సంస్థల నుంచి కార్పొరేట్‌ వరకు పండుగలను క్యాష్‌ చేసుకునేందుకు పోటీపడుతుంటాయి. డిస్కౌంట్‌ ఆఫర్లు, లక్కీ డిప్‌లు, జీరో వడ్డీ, గిఫ్ట్‌ల పేరుతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు వీరికి ఆన్‌లైన్‌ వ్యాపారం పోటీగా నిలిచింది.ప్రసార మాద్యమాల్లో భారీగా ప్రకటనలు గుప్పించడంతో వినియోగదారుడు రెండు మార్కెట్లలో రేట్ల వ్యత్యాసాన్ని గమనించి తనకు నచ్చినచోట కొనుగోలు చేస్తున్నాడు. ఈసారి ఆన్‌లైన్‌ కంపెనీలో ఈఏంఐ సదుపాయం కూడా కల్పించడంతో జనరల్‌ మార్కెట్‌లోని వ్యాపారులు గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలు కూడా ఈసారి భారీ డిస్కాంట్‌ మేళాలను ప్రకటించాయి. ఈఎంఐ సదుపాయాన్ని కల్పించాయి. దీంతో చాలామంది స్మార్ట్‌ ఫోన్‌లో చూసుకుని నచ్చిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. రెడీమెడ్‌, చీరలు, టీవీ, ఫ్రిజ్‌లు, ఏసీలు, సెల్‌ఫోన్లు వంటి వస్తువుల వ్యాపారం పది రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రెండు మార్కెట్‌లలో పోటాపోటీగా సాగుతోంది. ఏటా ఈసీజన్‌లో జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లు పైనే వ్యాపారం సాగుతుంటుంది. అత్యధికంగా సెల్‌ఫోన్‌, బట్టలు, ఎలక్ర్టానిక్‌, వాహనాల వ్యాపారమే జరుగుతుంటుంది. 

 

ఆన్‌లైన్‌ మార్కెట్‌కు పోటీగా..

ఈసారి వ్యాపారులు ఆన్‌లైన్‌ మార్కెట్‌కు చెక్‌ పెట్టేందుకు వ్యూహాత్మకంగానే వ్యవహరించారు. ఈ సీజన్‌లో జరిగే వ్యాపారానికి సంబంధించిన స్టాక్‌ను పెద్ద మొత్తంలో నిల్వ చేశారు. రెగ్యులర్‌ కస్టమర్లకు ఫోన్‌ చేసి ఆఫర్లు, డిస్కాంట్‌లను తెలియజేస్తున్నారు. క్యాష్‌, కారు వంటి బహుమతులతో లక్కీడిప్‌లను కూడా పెట్టారు. రెగ్యులర్‌ కస్టమర్లకు ఈఏంఐతో పనిలేకుండా రెండు మూడు వాయిదాల్లో చెల్లించే వెసు లుబాటు కల్పిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలకు ధీటుగా మైక్‌ ప్రచారం, కరపత్రాల పంపిణీ చేస్తున్నారు. రెగ్యులర్‌ కస్టమర్లకు వాట్సప్‌లో డిస్కౌంట్‌ సమాచారం తెలియజేస్తున్నారు. ఇలా జిల్లాలో పది రోజుల నుంచి మార్కెట్‌లో పండుగ సందడి నెలకొంది. ఏలూరు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, టీపీగూడెం, జంగారెడ్డిగూడెం వంటి ముఖ్య వ్యాపార కేంద్రాల్లో ఎలక్ర్టానిక్‌, బట్టలు, సెల్‌ఫోన్‌ షాపులు కళకళలాడుతున్నాయి.


ఆటోమొబైల్‌ రంగంలో 

ఆటోమొబైల్‌ వ్యాపారస్తులు కూడా పండుగను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. కార్ల దగ్గర నుంచి ద్విచక్ర వాహన వ్యాపారస్థులు పోటాపోటీగా ఆఫర్లు, డిస్కౌంట్‌లు ప్రకటించారు. కొన్ని కంపెనీలు బైక్‌లకు మూడు నుంచి రూ.4 వేలు డిస్కాంట్‌ ఆఫర్లు చేస్తున్నాయి. లక్కీడిప్‌తో పాటు జీరో వడ్డీపై వాహనాలు ఇస్తున్నారు. ముఖ్య కూడళ్ళల్లో వాహనాలు పెట్టి మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణ, మండల కేంద్రాల్లో వాహనాల షోరూంలలో వారం రోజుల నుంచి సందడి నెలకొంది. చాలామంది వాహనాన్ని బుక్‌ చేసుకుని పండుగ రోజు తీసుకెళ్లే విధంగా ఒప్పందం చేసుకుంటున్నారు.


Updated Date - 2021-10-14T05:17:38+05:30 IST