సేంద్రియ సాగు..లాభాలు బాగు..!

ABN , First Publish Date - 2020-08-12T11:10:53+05:30 IST

జిల్లాలో ఖరీఫ్‌లో 1.15 లక్షల హెక్టార్లు సాగు లక్ష్యం. ఆహార ధాన్యాల పంటలు 46,660 హెక్టార్లు, పప్పుదినుసుల పంటలు 12,842 హెక్టార్లు

సేంద్రియ సాగు..లాభాలు బాగు..!

రసాయన ఎరువు, పురుగు మందుల వల్ల పెట్టుబడి రెట్టింపు

పంట ఉత్పత్తులోనూ క్రిమినాశిని అవశేషాలు

సేంద్రియ, ప్రకృతి సేద్యం వల్ల పెట్టుబడి ఆదా

ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులు

రైతుల ఇంటి సిరుల పంట


వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం ఎక్కువైంది. వాటి ధరలు రెక్కలు తొడిగి పెట్టుబడి రెట్టింపు అవుతోంది. భూమి నిస్సారం అవుతోంది. ఏటేటా దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. అంతేకాదు.. పంట ఉత్పత్తుల్లో క్రిమినాశిని అవశేషాలు వెలుగు చూస్తున్నాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహం అందిస్తున్నాయి. అంపశయ్యపై ఉన్న సేద్యానికి ఊపిరిపోస్తున్నారు. అవని మనసెరిగి.. అదును చూసి సాగు చేస్తే సిరుల పంట పండించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు రైతులు. తక్కవ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయంలో రాణిస్తున్న రైతుల స్ఫూర్తిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖరీఫ్‌లో 1.15 లక్షల హెక్టార్లు సాగు లక్ష్యం. ఆహార ధాన్యాల పంటలు 46,660 హెక్టార్లు, పప్పుదినుసుల పంటలు 12,842 హెక్టార్లు, ఆయిల్‌ సీడ్‌ పంటలు 25,939 హెక్టార్లు, వాణిజ్య పంటలు 28 వేల హెక్టార్లు కలిపి 1.15 లక్షల హెక్టార్లలో రైతులు సాగు చేపట్టారు. మరో 1.25 లక్షల హెక్టార్లలో అరటి, జామ, చీనీ, మామిడి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ముప్పాతిక శాతం రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తూ సాగు చేస్తున్నారు. వరి, పత్తి వంటలకు కనీస పెట్టుబడి రూ.35-50 వేలు వస్తే.. పసుపు, ఉద్యానవన పంటలకు ఎకరాకు రూ.లక్ష నుంచి 1.25 లక్షలు దాటుతోంది. ఏటేటా రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెరుగుతున్నాయి.  ఆ స్థాయిలో దిగుబడులు లేక.. గిట్టుబాటు ధర రాక.. పెట్టుబడి చేతికి రాక అప్పులు ఊబిలో చిక్కి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 


భూమి పొరల్లోకి 1.75 లక్షల టన్నుల రసాయన ఎరువు

జిల్లాలో వ్యవసాయ పంటలకు పంటలకు యూరియా 35 వేల టన్నులు, డీఏపీ 8,850, కాంప్టెక్స్‌ 28,092, ఎంవోపీ 5,100, ఎంఎస్‌పీ 6 వేలు, మినరల్స్‌ 1,700 కలిపి 84,745 మెట్రిక్‌ టన్నులు రసాయన ఎరవులు వాడుతున్నారు. ఉద్యాన పంటలకు మరో 90 వేల మెట్రిక్‌ టన్నులు కలిపి 1.75 లక్షలు టన్నులు భూమి పొరల్లో వేస్తున్నారు. టన్ను సగటున రూ.19-20 వేలు చొప్పున రూ.350 కోట్లకు పైగా ఈ ఎరువులకు వెచ్చిస్తున్నట్లు అంచనా. పురుగు మందులకు మరో రూ.350-400 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. అంటే.. భూమాత ఏ స్థాయిలో రసాయనాలతో నిండిపోతోందో ఇట్టే తెలుస్తుంది. 


సేంద్రియ సాగుతో పెట్టుండి ఆదా

వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.1.25 లక్షలకుపైగా వెచ్చిస్తున్నారు. అందులో సగానికిపైగా రసాయన ఎరువులు, పురుగు మందులకే ఖర్చు చేస్తున్నారు. సేంద్రియ సాగు చేస్తే.. పశువుల ఎరువు 4-5 ట్రాక్టర్లు, వారం పది రోజులకు ఒకసారి జీవామృతం, వేప కషాయం పిచికారి, అవసరాన్ని బట్టి ఘనామృతం, వేప పండి.. వంటి సేంద్రియ ఎరువులు పైరుకు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ఈ లెక్కన ఖర్చు రూ.5-10 వేలకు మించదని రైతులే అంటున్నారు. పెట్టుబడి ఆదా.. ఆరోగ్యకరమైన పంటల సాగుతో పలువురు రైతులు రాణిస్తున్నారు. ప్రతి రైతు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేపడితే రసాయన ఎరువులు, పురుగు మందుల రూపంలో దాదాపుగా రూ.400 కోట్లు పెట్టుబడి ఆదా చేయవచ్చని సేంద్రియ వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. 


పంట ఉత్పత్తుల్లో క్రిమినాశిని అవశేషాలు

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం పంట ఉత్పత్తుల్లో క్రిమినాశిని అవశేషాలు ఉన్నట్లు గుర్తించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ‘కీటకనాశనుల అవశేషాలు గుర్తింపు పథకం’ కింద దేశవ్యాప్తంగా 25 వేల నమూనాలు (శాంపుల్స్‌) సేకరించారు. 18.7 శాతం నమూనాల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. 1,180 కూరగాయలు, 225 పండ్లు, 735 మసాల దినుసులు, 30 బియ్యం నమూనాలు, 45 పప్పు ధాన్యాల నమూనాల్లో గుర్తించలేని కీటక నాశని అవశేషాలు ఉన్నట్లు గుర్తించినట్లు ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రసాయన, పురుగు మందుల వినియోగం తగ్గించడానికి ‘నాన్‌ పేస్ట్‌ మేనేజ్‌మెంట్‌’ స్కీంను అమల్లోకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. 


బియ్యం క్వింటాపై రూ.వెయ్యి అదనంగా వస్తుంది

ఈ రైతు పేరు బండి వెంకటచలపతి. దువ్వూరు మండలం రాంసాయినగర్‌ గ్రామం. పదెకరాల పొలం ఉంది. వరి, చీనీ, జామ, పసుపు, దానిమ్మ పంటలు సాగు చేస్తున్నారు. ఏటేటా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడి ఆర్థికంగా నష్టపోయారు. తక్కువ పెట్టబడితో లాభాల సాగు చేయాలని ఆలోచించారు. మూడు నాలుగేళ్లుగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేశారు. ఎకరాకు 4 ట్రిప్పుల పశువుల ఎరువు వేస్తున్నాడు. ఉద్యాన పంటలకు డ్రిప్‌ ద్వారా వారం పది రోజులకు ఒకసారి జీవామృతం ఎరువుగా, అదే జీవామృతంను పురుగు నివారణకు పిచికారి చేస్తున్నారు. వరి పైరుకు దుక్కుల్లో పశువుల ఎరువు, పైపాటుగా జీవామృతం పిచికారి చేస్తున్నానని రైతు వివరించారు. ఎలాంటి పురుగు మందు వాడకపోవడంతో వరి ధాన్యం మిల్లు ఆడించి బియ్యం విక్రయిస్తే.. మామూలు బియ్యం కంటే క్వింటాకు రూ.వెయ్యి అదనంగా ఇచ్చి కొంటున్నారని ఆ రైతు వివరించారు. 

-బండి వెంకటచలపతి, రాంసాయినగర్‌, దువ్వూరు మండలం


ప్రకృతి సేద్యంలో దిట్ట ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి

రాజంపేట మండలం హస్తవరం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి ప్రకృతి సేద్యంలో ఆదర్శంగా నిలుస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రకృతి సేద్యంలో వరప్రసాద్‌రెడ్డి చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం సృజనాత్మక రైతు జాతీయ పురస్కారాన్ని అందజేసింది. రెండు దశాబ్దాలుగా ప్రకృతి సేద్యం ద్వారా అనేక రకాల పంటలు పండించి మంచి దిగుబడులు సాధించి లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం జామ పంటలో అంతర పంటలుగా 25 రకాల కూరగాయలను, చెండుమల్లె పూలను పండించారు. సుమారు ఆరు ఎకరాల్లో ఎకరాకు ఒకటిన్నర్ర లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసి ప్రధాన పంట జామకు ఖర్చు చేసిన సొమ్మును అంతర పంటల ద్వారా ఒకటిన్నర్ర లక్ష సంపాదించాడు. ఇక జామ పంట ద్వారా అదనంగా మరో ఒకటిన్నర్ర లక్ష ఆదాయాన్ని సంపాదించాడు. రసాయనాలకు దూరంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ పద్ధతి ద్వారా పంటలు సాగు చేస్తూ పశువుల ఎరువు, జీవామృతం, డీకంపోజ్‌ ఎరువులు, వేస్ట్‌ డీకంపోజ్‌ ఎరువులు, ఆవుపేడ, ఆవుమూత్రం, వేపపిండి, వేపాకు తదితర ప్రకృతి పరమైన ఎరువులను వాడుతూ వ్యవసాయం చేస్తున్నారు. దీని వల్ల ఖర్చు పోనూ ఎకరాకు ఒకటిన్నర్ర లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. 

- ఆకేపాటి వరప్రసాద్‌రెడ్డి, ఆదర్శ రైతు 

Updated Date - 2020-08-12T11:10:53+05:30 IST