పురాతన పెంకుటిల్లుకూ OTS.. కంగుతిన్న వృద్ధ దంపతులు..!

ABN , First Publish Date - 2021-12-09T17:28:25+05:30 IST

వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి...

పురాతన పెంకుటిల్లుకూ OTS.. కంగుతిన్న వృద్ధ దంపతులు..!

  • ఇది స్వార్జితమని వెల్లడి..
  • 100 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లూ జాబితాలోకి
  • డబ్బు కట్టాలంటూ.. కొలతలకు సిద్ధమైన సిబ్బంది

కృష్ణా జిల్లా/కూచిపూడి : వైసీపీ సర్కారు ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌)లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును సైతం అధికారులు ఓటీఎస్‌లో చేర్చారు. ఇది పక్కా ఇల్లా.. పెంకుటిల్లా అని చూడకుండానే వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఓటీఎస్‌లో భాగంగా డబ్బులు చెల్లించాలని చెప్పడమే కాకుండా ఆ ఇంటి కొలతలు కూడా తీయడానికి సిద్ధమయ్యారు. దీందో వృద్ధ దంపతులు కంగుతిన్నారు.  మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో 96 ఏళ్ల క్రితం నిర్మించిన పెంకుటిల్లును లింగమనేని వెంకటసుబ్బమ్మ, రాజారావు వద్ద నుంచి 1981లో దండమూడి రాజగోపాలరావు-లక్ష్మి దంపతులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి అందులోనే నివసిస్తున్నారు.


ఓటీఎస్‌లో భాగంగా 1996-97 లో ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాల జాబితాలో రాజగోపాలరావు (పెంకుటిల్లు) పేరును కూడా అధికారులు చేర్చారు. దీంతో వలంటీర్‌ తేజస్వి జాబితాలో మీ పేరు ఉందని వారికి చెప్పింది. సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ బుర్రే శ్రీధర్‌ వచ్చి ఇంటి కొలతలు తీయాలని చెప్పటంతో వృద్ధ దంపతులు అవాక్కయ్యారు. ఆ ఇంటిని తాము సొంతంగా కొనుగోలు చేశామని, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి రుణం పొందలేదని  చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయమై హౌసింగ్‌ ఏఈ మల్లిఖార్జునరావును వివరణ కోరగా.. సచివాలయ అధికారులు, వలంటీర్‌ వారి ఇంటికి వెళ్లి లిస్టులో పేరు ఉంది, డబ్బులు కట్టాలని చెప్పిన మాట వాస్తవమేనని అన్నారు. దీనిపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Updated Date - 2021-12-09T17:28:25+05:30 IST